మూడ్రోజుల్లో ఎన్నికల నగారా…

మహారాష్ట్ర, హర్యానా పోల్​ షెడ్యూల్​ ప్రకటించనున్న ఈసీ

మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్​ కమిషన్(ఈసీ) రెడీ అయింది. దీపావళిలోపే ప్రక్రియ ముగించాలని ఈసీ భావిస్తోందని, ఆ మేరకు రెండు మూడు రోజుల్లోనే షెడ్యూల్​ ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అసెంబ్లీల గడువు ముగుస్తుండటంతో ఈ ఏడాది చివర్లోగా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్​లో ఎన్నికలు చేపట్టాల్సిఉండగా, లెఫ్ట్​ తీవ్రవాదం కారణంగా ఫేజ్​ల సంఖ్య పెంచాల్సిరావడం, ఆమేరకు సరిపడా పారామిలిటరీ బలగాలు మోహరించాల్సిఉండటం లాంటి ఇబ్బందుల వల్ల జార్ఖండ్​ అసెంబ్లీకి విడిగా నవంబర్​లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది.

2014లో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు సెప్టెంబర్​ 20న షెడ్యూల్​ ప్రకటించి, అక్టోబర్​ 15న పోలింగ్​, 19న కౌంటింగ్​ చేపట్టారు. అదే ఏడాదిలో జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్​ 25 నుంచి డిసెంబర్​ 23 మధ్య ఐదు ఫేజ్​ల్లో పోలింగ్​ జరిగింది. బీజేపీ అధికారంలో ఉన్న ఈ మూడు రాష్ట్రాల్లో 2019 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చివరి రౌండ్​ రివ్యూలు కూడా పూర్తికావచ్చాయి. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్​ ఆధ్వర్యంలోని ఈసీ టీమ్​ బుధవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా హర్యానా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ)తో చర్చలు జరిపింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పారామిలిటరీ ఫోర్స్​ మోహరింపుపై ఈసీకి చెందిన మరో టీం కేంద్ర హోం మంత్రిత్వ శాఖతోనూ మంతనాలు జరిపింది. మహారాష్ట్రకు సంబంధించి ఈసీ రివ్యూలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈసీ గైడ్​లైన్​ను అనుసరిస్తూ పోలింగ్​ డ్యూటీలో పాల్గొనే సిబ్బంది జాబితాను కూడా రెండు రాష్ట్రాల అధికారులు సిద్ధం చేశారు.

మహారాష్ట్ర అసెంబ్లీ

మొత్తం సీట్లు: 288

ఓటర్లు: 8కోట్ల 73లక్షల 30వేల 484

ప్రధాన పార్టీలు: బీజేపీ–శివసేన కూటమి, కాంగ్రెస్​–ఎన్సీపీ కూటమి

ప్రస్తుత బలాబలాలు: బీజేపీ–124, శివసేన–61, కాంగ్రెస్​–36, ఎన్సీపీ–32

 

హర్యానా అసెంబ్లీ

మొత్తం సీట్లు: 90

ఓటర్లు: 1కోటి 60 లక్షల 97వేల 230

ప్రధాన పార్టీలు: బీజేపీ, కాంగ్రెస్​, ఐఎన్​ఎల్​డీ

ప్రస్తుత బలాబలాలు: బీజేపీ–47,

కాంగ్రెస్​–16, ఐఎన్​ఎల్​డీ–7

 

జార్ఖండ్​ అసెంబ్లీ

మొత్తం సీట్లు: 81

ఓటర్లు: 2కోట్ల 3లక్షల49వేల 795

ప్రధాన పార్టీలు: బీజేపీ–ఏజేఎస్​యూ కూటమి, జేఎంఎం–కాంగ్రెస్​ కూటమి

ప్రస్తుత బలాబలాలు: బీజేపీ–43, జేఎంఎం–19, కాంగ్రెస్​–8, ఏజేఎస్​యు–3

Latest Updates