మీకు రాము -సోము ఎలుగుబంటి స్టోరీ గుర్తుందా..?

మీకు ఇద్దరు మిత్రులు ఎలుగుబంటి స్టోరీ గుర్తుందా..? ఒక ఊర్లో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వ్యాపార నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుండగా మార్గం మధ్యలో ఓ ఎలుగుబంటి ఇద్దరు స్నేహితుల్ని హతమార్చేందుకు ప్రయత్నిస్తుంది.

ప్రాణాపాయస్థితిలో ఉన్న స్నేహితుణ్ని విస్మరించిన సోము ఎలుగబంటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. చెట్టెక్కితే ప్రాణాలు దక్కించుకోవచ్చని ప్లాన్ వేస్తాడు. ఎలుగుబంటి రాకను గమనించిన సోము చెట్టేక్కేస్తాడు. రామును విస్మరిస్తాడు. చెట్టెక్కడం రాని రాము ఎలుగబంటి నుంచి తన ప్రాణాల్ని కాపాడుకునేందుకు  చచ్చిపోయినవాడిలా ఆ చెట్టుకింద కదలకుండా, మెదలకుండా పడిపోయాడు . ఇంతలో ఎలుగుబంటి రానే వచ్చింది. పైకి చూస్తే ఒకడు చెట్లో నక్కి కూర్చున్నాడు. ఆ చెట్టుపైకి ఎక్కడం అంత సులభం కాదు. కింద చూస్తే వీడు చచ్చి పడి ఉన్నాడు.
ఏం చేయాలబ్బా అని ఆలోచించిన ఎలుగుబంటి ఎందుకైనా మంచిది కిందపడిన వాడు నిజంగా చనిపోయాడా లేదో? తెలుసుకుని తన దారిన తాను వెళ్లిపోవాలని అనుకుంది. వెంటనే రామూ దగ్గరికి వచ్చి చుట్టూ తిరిగి వాసన చూసి, చనిపోయాడని నిర్ధారించుకుని చేసేదేమీలేక అక్కడినుంచి వెళ్లిపోయింది.

సేమ్ రాము ఎలా యాక్ట్ చేసి తన ప్రాణాల్ని కాపాడుకున్నాడో..మహరాష్ట్రలో ఓ వ్యక్తి పులి నుంచి తప్పించుకునేందుకు అలాగే యాక్ట్ చేసి ప్రాణాల్ని దక్కించుకున్నాడు.  ప్రస్తుతం పులి, వ్యక్తికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహారాష్ట్రలోని భందారా జిల్లాలోని తుమ్సార్ ప్రాంతంలో ఓ పులి అలజడి సృష్టించింది. జనావాసాల్లో సంచరిస్తూ భయాందోళనకు గురి చేసింది. అయితే పులిరాకతో భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. వారిలో ఓ వ్యక్తి పులి నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆ వ్యక్తిని లక్ష్యం చేసుకుని పులి అతడి మీదకు దూకింది.  అయితే, సమయస్పూర్తితో అతడి కిందపడిపోయి.. చనిపోయినవాడిలా నటించడంతో పులి అతడిని వదిలిపెట్టి అడవుల్లోకి పారిపోయింది. అటవీ శాఖ అధికారి ప్రవీణ్ కశ్వాన్ ట్వీట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.