మహాశివరాత్రి : ముస్తాబైన ఆలయాలు

రాష్ట్రంలో మహాశివరాత్రికి శివాలయాలు ముస్తాబయ్యాయి. ప్రత్యేక అలంకరణలు, విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేస్తున్నారు. రేపటి జాగరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్రంలో మహాశివరాత్రి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయ. సంగారెడ్డి జిల్లా ఝారసంగంలో దక్షిణ కాశీగా పేరున్న శ్రీకేతకి సంగమేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. ఇవాళ్టి నుంచి తొమ్మిది రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి దాదాపు 3లక్షల మంది భక్తులు వస్తారని  అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ మహాశివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర స్వామి గుడితో పాటు బోధన్ లోని ఏకచక్రశ్వరాలయం, బిచ్కుంద మండలంలోని కాశీ విశ్వనాథ ఆలయంలో రేపు జాగరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శివాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు భక్తులు. కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం ఈస్ గాం శివమల్లన్న ఆలయంలో ఉత్సవాలు మొదలయ్యాయి. ఇవాళ్టి నుంచి మూడు రోజుల వైభవంగా వేడుకలు జరగనున్నాయి. ఇక్కడి గుడిలో శివలింగంతో పాటు గణపతి,పార్వతిదేవీ, విష్ణుమూర్తి, సూర్యాది దేవతలు కొలువుదీరి ఉంటారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉత్సవాల్లో మూడో రోజు ఈస్ గాంలోని కాందిశీకులు ప్రత్యేకంగా దర్శించుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా సిరిచెల్మ మల్లన్న ఆలయంలో భక్తుల దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇది పురాతన ఆలయం. ఇక్కడ రెండు నంది విగ్రహాలు ఒకటి గర్భగుడిలో ఉంటే.. మరొకటి బయట ఉంటాయి. బయటి నందిపై పడిన సూర్యకిరణాలు గర్భగుడిలోని శివలింగంపై ప్రతిబింబిస్తాయంటున్నారు భక్తులు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయానికి మహాశివరాత్రి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని కదిలె పాపహరేశ్వరాలయంలోనూ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పరశురాముడు ఇక్కడ 32వ శివలింగాన్ని ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఉన్న ఏడు గుండాల్లో భక్తులు స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. మహాశివరాత్రి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహాశివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ శివాలయాన్నీ ముస్తాబయ్యాయి. వేయి స్తంబాల గుడి, సిద్ధేశ్వరాలయం, మెట్టురామ లింగేశ్వరాలయం, కోటి లింగాలు, రామప్ప, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వరాలయంతో పాటు ఐలోని మల్లన్న ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. వేయిస్తంబాల గుడిలోని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్… ఉత్సవాలను ప్రారంభించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో రేపు రాత్రి జాగారం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయంలో నాగలింగ పుష్పాలు కను విందు చేస్తున్నాయి. ఏడాదిలో కేవలం శివరాత్రికి మాత్రమే పూసే ఈ పూలతో శివుడికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

 

Latest Updates