కాబూల్‌‌‌‌ నడిబొడ్డున గాంధీ బొమ్మ

  • గతంలో అక్కడి ఇండియన్‌‌‌‌ ఎంబసీ గోడలపైన చిత్రం
  • రెండేళ్ల కిందటి టెర్రరిస్టుల దాడిలో నాశనం
  • తాజాగా గవర్నర్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ గోడలపైన బొమ్మ

ఆఫ్ఘనిస్థాన్‌‌‌‌లో బాంబుల విధ్వంసం సర్వసాధారణం. పొద్దున లేస్తే తుపాకుల మోతే. అలాంటి చోట శాంతి స్థాపన కోసం అక్కడి ఆర్టిస్టులు నడుం బిగించారు. శాంతి, అహింసకు ప్రతిరూపమైన మహాత్మాగాంధీ బొమ్మను కాబూల్‌‌‌‌లోని ఇండియన్‌‌‌‌ ఎంబసీ గోడలపై వేశారు. కానీ రెండేళ్ల కిందట జరిగిన ఉగ్రదాడిలో ఆ బొమ్మ పాడైంది. కానీ ఆర్టిస్టుల నమ్మకం మాత్రం చెదరలేదు. ఈసారి కాబూల్‌‌‌‌ నడిబొడ్డున గాంధీ బొమ్మ గీశారు. కొద్ది రోజుల్లో గాంధీ జయంతి ఉన్నందున మ్యూరల్‌‌‌‌ పెయింటింగ్‌‌‌‌తో ఆయనకు నివాళులర్పించారు.

ఎంబసీ గోడలపై

ఆప్ఘనిస్థాన్‌‌‌‌ రాజధాని కాబూల్‌‌‌‌లోని ఇండియన్‌‌‌‌ ఎంబసీ గోడలపై 2015లో మన జాతిపిత గాంధీ బొమ్మ గీశారు. గాంధీ బొమ్మ పక్కనే ఖాన్‌‌‌‌ అబ్దుల్‌‌‌‌ గఫార్‌‌‌‌ ఖాన్‌‌‌‌ బొమ్మ కూడా వేశారు. నిత్యం రక్తపాతం కళ్లజూసే ఆఫ్ఘనిస్థాన్‌‌‌‌లో శాంతి కోసం ఆ దేశానికి చెందిన ‘ఆర్ట్‌‌‌‌లార్డ్స్‌‌‌‌’ ఆర్టిస్టులే ఆ బొమ్మలు గీశారు. బొమ్మల పక్కన.. ‘మనిషి అవసరాలను తీర్చడానికి భూమి ఉంది. అత్యాశ కోసం కాదు’. ‘అవినీతిని దేవుడు, ప్రజలు చూస్తూనే ఉంటారు’ అని రెండు మాటలు కూడా రాశారు. అయితే 2017 మే 31న జరిగిన ట్రక్‌‌‌‌ బాంబు దాడిలో గాంధీ బొమ్మ చెదిరిపోయింది. దాడిలో 140 మంది చనిపోయారు. దీంతో తాజాగా కాబూల్‌‌‌‌ నడిబొడ్డున ఉన్న గవర్నర్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ బయట అదే సంస్థకు చెందిన ఆర్టిస్టులు మళ్లీ గాంధీ బొమ్మ వేశారు. ‘పవర్‌‌‌‌పై ప్రేమను.. ప్రేమ అనే శక్తి అధిగమిస్తే శాంతి అంటే ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది’ అని ఇంగ్లిష్‌‌‌‌, పర్షియన్‌‌‌‌ భాషలో శాంతికి సంబంధించిన మెసేజ్‌‌‌‌ను బొమ్మ పక్కన రాశారు.

ఇక్కడి వాళ్లకు గాంధీ తెలుసు

దేశంలో శాంతి స్థాపన కోసం ఆర్టిస్టులు, వలంటీర్లందరూ కలిసి ప్రయత్నిస్తున్నామని ఆర్ట్‌‌‌‌లార్డ్స్‌‌‌‌ కో ఫౌండర్‌‌‌‌, ప్రెసిడెంట్‌‌‌‌ ఒమైద్‌‌‌‌ షరీఫీ చెప్పారు. త్వరలో గాంధీ పుట్టిన రోజు వస్తున్నందున ఆయనకు నివాళిగా బొమ్మ వేశామన్నారు. ‘కాబూల్‌‌‌‌ నగరం మధ్యలో గవర్నర్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ గోడలపై బొమ్మ వేశాం. గాంధీ.. ఆయన సత్యం, అహింస విధానాలు ఇక్కడి ప్రజలకు బాగా తెలుసు’ అన్నారు. 2018 జులైలో ఆఫ్ఘనిస్థాన్‌‌‌‌లోని జలాలాబాద్‌‌‌‌లో ఉగ్రదాడి జరిగింది. 13 సిక్కు లీడర్లతో సహా 19 మంది మృతి చెందారు. దాడికి నిరసనగా ఆర్ట్‌‌‌‌లార్డ్స్‌‌‌‌ ఓ పేద్ద బొమ్మ గీసింది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన రవైల్‌‌‌‌ సింగ్‌‌‌‌ కూతురు బొమ్మ వేసి.. ‘నాన్నను చంపిన మీరు స్వర్గానికి పోరు’ అని  రాశారు. ఆఫ్ఘనిస్థాన్‌‌‌‌ విద్యా వ్యవస్థలో ఆర్ట్‌‌‌‌ అండ్‌‌‌‌ కల్చర్‌‌‌‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్ట్‌‌‌‌లార్డ్స్‌‌‌‌ ప్రయత్నిస్తోంది.

 

Latest Updates