RCB: బౌలింగ్​ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్‌సీబీ

RCB: బౌలింగ్​ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్‌సీబీ

బూమ్ బూమ్ బుమ్రా.. భారత స్పీడ్‌గన్, రేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ ఒకసారి మనసులో తలచుకోండి.. అతని బౌలింగ్ శైలి ఎంత విభిన్నమో.. అతను సంధించే బంతులు అంతే ప్రత్యేకం. బుమ్రా బౌలింగ్ చేయడానికి బంతి అందుకున్నాడంటే.. క్రీజులో ఎంతటి బ్యాటర్ ఉన్నా అతన్ని ఎదుర్కోవడానికి సందేహించాల్సిందే. పరుగులు రాబట్టడం పక్కనపెట్టి.. ఔట్ అవ్వకుండా ఉంటే చాలనుకుంటారు. పదునైన పేస్, బౌన్స్, ఖచ్చితత్వంతో కూడిన యార్కర్లు.. అబ్బో ఇలా బుమ్రా సంధించే ఒక్కో బంతో ఒక్కో ప్రత్యేకం. అలాంటి బౌలర్​ తమ జట్టులో ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి.. మరీ ముఖ్యంగా.. ఐపీఎల్​లో ఇప్పటివరకూ ఒక్కసారి ట్రోఫీ గెలవని రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(ఆర్‌సీబీ)కు బుమ్రా లాంటి​ బౌలర్​ ఖచ్చితంగా కావాల్సిందే. అందుకే, ఆర్‌సీబీ యాజమాన్యం ఆ దిశగా అడుగులు వేసి.. మరో బుమ్రాను సిద్ధం చేస్తోంది. 

అచ్చం బుమ్రా బౌలింగ్​ యాక్షన్​తో ఓ కుర్ర బౌలర్ బంతులు సంధిస్తున్న వీడియోలు ఇంటర్నెట్​ని షేక్​ చేస్తున్నాయి. అతని బౌలింగ్ శైలి, బ్యాకప్, బంతులు విసురుతున్న తీరు అన్నీ బుమ్రాలాగే ఉన్నాయి. ఇద్దరి బౌలింగ్​ యాక్షన్​ దాదాపు ఒకే విధంగా ఉండాటన్ని చూసి.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ యువ బౌలర్ పేరు.. మహేష్ కుమార్. గతేడాది గుజరాత్ టైటాన్స్ జట్టుతో భాగమైన మహేష్, ఈ ఏడాది ఆర్‌సీబీ జట్టుకు నెట్ బౌలర్ గా పనిచేస్తున్నాడు. పదునైన యార్కర్లు సంధిస్తూ బెంగుళూరు బ్యాటర్లకు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ అందిస్తున్నాడు. మహేశ్ తన బౌలింగ్​ని మరింత మెరుగుపరుచుకుంటే.. ఆర్‌సీబీ తరుపున అరంగ్రేటం చేసే అవకాశం దక్కవచ్చు.

ఆఖరి స్థానం.. ఆర్‌సీబీదే

ఐపీఎల్​ 2024లో బెంగళూరు జట్టు చెత్త ప్రదర్శన కొనసాగుతోంది.  ఇప్పటివరకూ ఆడిన 10 మ్యాచ్​ల్లో మూడింట గెలిచి, ఏడింట ఓటమిపాలయ్యారు. ఇతర జట్లు విజయాలు సాధించి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తుంటే.. వేరేమో అట్టడుగు స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. వారికి ఊరటనిచ్చే ఒకే ఒక్క విషయం.. చివరి 2 మ్యాచ్​ల్లో విజయాలు. దాదాపు నెల రోజుల తర్వాత గెలుపు బాట పట్టారు. ప్రస్తుతానికి అనధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు తప్పుకున్నా.. ఏదేని అద్భుతం జరగపోతుందా...! అని వేచి చూస్తున్నారు.

ఆర్‌సీబీ జట్టు తదుపరి మ్యాచ్​లో గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. మే 04న చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.