మక్కరైతులు మర్లవడ్డరు..మద్దతు ధరకు సర్కారే మక్కలు కొనాలని డిమాండ్

  • మద్దతు ధరతో సర్కారే మక్కలు కొనాలి
  • రైతు బంధు కాదు.. మద్దతు ధర ఇవ్వాలి
  • సన్న వడ్లను క్వింటా రూ. 2,500కు కొనాలి
  • మెట్ పల్లిలో హైవేపై రైతుల మహాధర్నా
  • కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు
  • 4 గంటలపాటు నిలిచిన రాకపోకలు
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇల్లు
  • ముట్టడి.. ఇంటిపైకి చెప్పులు, రాళ్లు
  • రైతులపై కేసు పెట్టిన పోలీసులు

మెట్ పల్లి, వెలుగుముందస్తుగా ప్రకటించిన మద్దతు ధరతో మక్కలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తూ రైతులు కదం తొక్కారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో మహా ధర్నాకు దిగారు. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా మెట్​పల్లికి తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్​రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన ఇంటిపైకి కొందరు రాళ్లు, చెప్పులు విసరడం ఉద్రిక్తతకు దారితీసింది.

4 గంటల పాటు నేషనల్​హైవే దిగ్బంధం

జిల్లాలోని వివిధ ఊళ్ల నుంచి రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మెట్​పల్లి తరలివచ్చిన రైతులు, స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి ర్యాలీగా బయలుదేరి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా కు చేరుకున్నారు. అక్కడే నేషనల్ హైవే 63పై భైఠాయించారు. సుమారు నాలుగు గంటల పాటు రోడ్డును దిగ్బంధించడంతో ఇరువైపులా కిలో మీటర్ల మేర ట్రాఫిక్​ జామ్​ అయింది. ఈ సందర్భంగా పలువురు రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మక్కలకు మద్దతు ధర ప్రకటించగా, రాష్ట్రప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. బడా వ్యాపారులు, పెద్ద పెద్ద పౌల్ట్రీ యజమానులతో సీఎం కేసీఆర్ కుమ్మక్కయి, కావాలనే మక్కలు కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. మార్క్ ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి  రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, లేకపోతే టీఆర్​ఎస్​సర్కారుకు తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు.

సన్న వడ్లకు రూ.2,500 ఇవ్వాలె

వానకాలంలో దొడ్డు రకం వడ్లు వద్దని, సన్న రకాలు పండించాలని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు సన్నరకం వడ్లకు మద్దతు ధర ప్రకటించడం లేదని,  పండించిన పంటను కొనుగోలు చేస్తామని కూడా చెప్పడం లేదని రైతు సంఘం నేతలు అన్నారు. సన్న రకాలను క్వింటాల్​కు రూ. 2,500 చొప్పున మద్దతు ధర ప్రకటించి కొనాలని డిమాండ్ చేశారు. రైతులను ఏడిపించిన ప్రభుత్వాలు బాగు పడలేదని, ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ తీరుతో రైతులు కంటతడి పెట్టుకుంటున్నారని, ఇది టీఆర్ఎస్ సర్కారుకు మంచిది కాదని చెప్పారు. తమకు ఏ రైతు బంధు వద్దని, పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చి కొంటే చాలని పేర్కొన్నారు. వందల ఎకరాల భూములున్న సీఎం సామాజిక వర్గానికి చెందిన భూస్వాములకు లాభం చేయడానికే రైతుబంధు స్కీం తెచ్చారని రైతు సంఘం నేతలు ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు, ఉద్యోగాలు లేక యువత నిరాశ నిస్పృహలో ఏమి చేయాలో తెలియక ఆందోళనలో బతుకుతున్నారని వాపోయారు. వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కేంద్ర సర్కారు ప్రకటించిన మద్దతు ధరకు మక్కలు కొనుగోలు చేయాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి

నాలుగు గంటల రాస్తారోకో తర్వాత రైతులు  ర్యాలీగా సబ్ కలెక్టర్ ఆఫీస్​కు బయలుదేరారు. మార్గ మధ్యంలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  ఇంటిని ముట్టడించడం ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొందరు ఎమ్మెల్యే ఇంటిపైకి చెప్పులు, రాళ్లు విసిరారు. అలర్టయిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా తమకు సహకరించాలని ఓ రైతు ఏఎస్పీ సురేష్ కుమారు కాళ్లు పట్టుకొని వేడుకున్నారు. పరిస్థితి చేజారి పోతుండడంతో డీఎస్పీ గౌస్ బాబా, సీఐలు రాజశేఖర్ రాజు , రాజేష్, శ్రీను  రైతులను సముదాయించి శాంతింపజేశారు. దీంతో రైతులు అక్కడి నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వెళ్లారు. అక్కడ కూడా పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్​కు, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘జై జవాన్.. జై కిసాన్.. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్.. ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నినదించారు.  ఆర్డీవో వచ్చే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. అనంతరం ఆర్డీవో వినోద్​కుమార్​ బయటకు రావడంతో రైతులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, కన్వీనర్ బద్దం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతులపై కేసు

ఎమ్మెల్యే  విద్యాసాగర్ రావు ఇంటిపై దాడి చేసిన రైతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్  చెప్పారు. బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Latest Updates