వైరస్ పుట్టిన దేశంలో జీరో పాజిటివ్ కేసులు

  • వ్యూహాత్మక విజయం అని పేర్కొన్న చైనా అధికారులు
  • అవన్నీ తప్పుడు లెక్కలేనంటూ అమెరికా ఫైర్

బీజింగ్: వైరస్ పుట్టిన దేశం చైనాలో గడిచిన 24 గంటల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశ హెల్త్ మినిస్ట్రీ శనివారం ప్రకటించింది. చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(పార్లమెంట్) సమావేశాలు ప్రారంభమైన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడింది. సమావేశంలో ప్రధాని లీ కెకియాంగ్ మాట్లాడుతూ కరోనా పై పోరాటంలో దేశం అతిపెద్ద వ్యూహాత్మక విజయం సాధించిందన్నారు. అయినప్పటికీ భవిష్కత్తులో దీనిపై మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైరస్ పుట్టుక గురించిన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు, అధికారులపై ఆయన మండిపడ్డారు. వూహాన్ లో కిందటేడాది డిసెంబర్ లో వైరస్ పుట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఒకరోజులో కేసుల సంఖ్య జీరోకు రావడం ఇదే తొలిసారి. అయితే, చైనా చెప్తున్న వైరస్ కేసుల లెక్కలపై అమెరికా తీవ్ర విమర్శలు గుప్పించింది. చైనా అధికారిక డేటాను కావాలనే కప్పిపుచ్చుతోందని మండిపడింది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న చైనాలో వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య ఐదువేల లోపే ఉందని, కానీ, చాలా చిన్న దేశాల్లో అంతకన్నా ఎక్కువ మంది వైరస్ తో చనిపోయారని గుర్తుచేసింది. కరోనా గురించిన సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఇతర దేశాలతో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నామని చైనా చెప్తోంది. వూహాన్ లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3,38,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

 

Latest Updates