
ఆలయ నిర్వహణ కోసం కొత్త చట్టం చేయాలని కేరళ సర్కార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: శబరిమల గుడి నిర్వహణకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలని కేరళ సర్కార్కు సుప్రీంకోర్టు సూచించింది. గుడికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలతోపాటు ప్రత్యేక చట్టానికి సంబంధించిన వివరాలను జనవరి మూడోవారంనాటికల్లా తమముందు ఉంచాలని జస్టిస్ ఎన్.వి. రమణ ఆధ్వర్యంలోని బెంచ్ బుధవారం పేర్కొంది. శబరిమల, ఇతర దేవస్థానాల అడ్మినిస్ట్రేషన్ అంశాల్లో కేరళ ప్రభుత్వం చట్టాల్ని మార్చే ప్రయత్నం చేస్తోంది, దీనిని దృష్టిలో పెట్టుకుని తమ హక్కులు కాపాడాలంటూ పండళం రాజ కుటుంబీకులు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్ట్ ఈ ఆదేశాలను జారీచేసింది.
ట్రావెంకోర్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయాలు, వాటి అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన చట్టాన్ని ప్రభుత్వం సవరించిందని కేరళ రాష్ట్రం తరపు లాయర్ కోర్టుకు చెప్పారు. దేవాలయ సలహా కమిటీలో ఆడవాళ్లకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కూడా ప్రపోజ్ చేసిన చట్టంలో ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆలయంలోకి ఆడవాళ్లు వెళ్లడంతోపాటు పలు మతపరమైన అంశాలను ఏడుగురు సభ్యుల బెంచ్ పరిశీలిస్తుందని అప్పటి సీజే జస్టిస్ రంజన్ గోగొయ్ఆధ్వర్యంలోని సుప్రీంకోర్ట్ బెంచ్ గతవారం నిర్ణయించింది. అయితే సెక్యూరిటీ కారణాల వల్ల 10 నుంచి 50 లోపు ఆడవాళ్లను శబరిమల వెళ్లేందుకు కేరళ సర్కార్అనుమతించలేదు. తాజాగా మంగళవారం నాడు 12 ఏళ్ల అమ్మాయిని పోలీసులు పంబ దగ్గర అడ్డుకుని లోనికి వెళ్లనీయలేదు.