వైరస్​ ఇప్పట్లో తగ్గే చాన్స్ లేదు: డబ్ల్యూహెచ్​వో

జెనీవా: కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గే చాన్స్ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​వో) వార్నింగ్ ఇచ్చింది. వైరస్ తో ఇంకా చాలా కాలం ప్రయాణించాల్సి ఉంటుందని చెప్పింది. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి ఎదుర్కోవడంలో ప్రారంభ దశలోనే ఉన్నాయని, మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. గురువారం జెనీవాలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో డబ్ల్యూహెచ్​వో చీఫ్ టెడ్రోస్ మాట్లాడుతూ.. కరోనావైరస్ నియంత్రణలో ఉందని భావించిన కొన్ని దేశాలు తిరిగి వైరస్ బారిన పడ్డాయని, ఆఫ్రికా, అమెరికాలో పొజిషన్ క్రిటికల్ గా ఉందని అన్నారు. తాము ప్రపంచ అత్యవసర పరిస్థితిని సరైన సమయంలోనే ప్రకటించామన్నారు. ప్రపంచ దేశాలను అలర్ట్ చేస్తూ.. జనవరి 30న గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయాన్ని టెడ్రోస్ గుర్తుచేశారు. ‘‘తప్పు చేయవద్దు. మనం చాలా దూరం వెళ్ళాలి. ఈ వైరస్ మనతో చాలా కాలం ఉంటుంది”అని ఆయన అన్నారు. డబ్ల్యూహెచ్​వో పై అమెరికా ఆరోపణలు చేస్తున్నా.. తాను మాత్రం రాజీనామా చేసే ప్రసక్తే లేదని టెడ్రస్ స్పష్టం చేశారు. కరోనా కంట్రోల్​కు డబ్ల్యూహెచ్​వో సరైన సమయంలో స్పందించ లేదంటూ అమెరికా విమర్శలు గుప్పిస్తున్న మేరకు ఆయన ఈ కామెంట్ చేశారు.

ఫండింగ్ పై మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి
డబ్ల్యూహెచ్​వోకు అమెరికా ఇచ్చే సాయాన్ని కొనసాగించాల్సిందిగా టెడ్రస్ విజ్ఞప్తి చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గత వారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి నిధులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని యూఎస్ పున:పరిశీలిస్తుందని టెడ్రస్ ఆశాభావం వ్యక్తం చేశారు. యూఎస్ అందించే సాయంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాధి బారిన పడుతున్న వారిని ఆదుకోవడంతోపాటు.. అమెరికా కూడా సేఫ్ గా ఉంటుందని అన్నారు. ఈ ఏడాదికి గాను అమెరికా 700 మిలియన్ డాటర్లను డబ్ల్యూహెచ్​వోకు ప్రకటించింది.

Latest Updates