పిల్లలకు బర్గర్లు, చిప్స్​ కాదు మన వంటకాలు పెట్టండి

  • 15 ఏళ్లుగా దత్తాత్రేయ అలయ్ బలయ్ నిర్వహించడం గొప్ప విషయం
  • రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నం: హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ
  • జలవిహార్‌‌లో ఘనంగా ‘అలయ్‌‌ బలయ్‌‌’
  • హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అన్ని పార్టీల నేతలు

తెలంగాణకు గవర్నర్‌‌గా రావడం తన అదృష్టమని తమిళి సై సౌందరరాజన్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మహారాష్ర్ట మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనకు ఆదర్శం అని చెప్పారు. దత్తాత్రేయ పదిహేనేళ్లుగా అలయ్ బలయ్ నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు. మానవ సంబంధాలు పెంచడంలో ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు. గురువారం జలవిహార్ లో దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి నిర్వహించిన అలయ్ బలయ్ కు గవర్నర్ తమిళి సై హాజరయ్యారు.

తెలుగులో మాట్లాడిన తమిళి సై

గవర్నర్‌ తన ప్రసంగంలో కొద్దిసేపు తెలుగులో మాట్లాడారు. తమిళనాడు, తెలంగాణకు భౌగోళికంగా సరిహద్దులు ఉన్నాయే గానీ.. సంస్కృతి, సంప్రదాయాలు మాత్రం ఒకేలా ఉంటాయని ఆమె చెప్పారు. చిన్న పిల్లల టిఫిన్ బాక్సుల్లో బర్గర్లు, చిప్స్ ఉంటున్నాయని, దీని వల్ల ఒబెసిటీ పెరుగుతోందని పలు పత్రికల్లో తాను చదివానని గవర్నర్ అన్నారు. చిన్నారుల్లో పోషకాహారలోపం తలెత్తుతోందని, వారికి మన వంటకాలే పెట్టాలని, పౌష్టికాహారం ఇచ్చేలా తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.

భావితరాలకు చెప్పేందుకే: దత్తాత్రేయ

చెడు మీద మంచి సాధించిన విజయమే దసరా అని హిమాచల్‌‌ ప్రదేశ్‌‌ గవర్నర్‌‌ దత్తాత్రేయ అన్నారు. బతుకమ్మ, బోనాల పండుగలు తెలంగాణ ఖ్యాతిని పెంచుతున్నాయన్నారు. భావితరాలకు పండుగల ప్రాధాన్యం తెలియజేసేందుకే అలయ్‌‌ బలయ్‌‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. హిమాచల్, తెలంగాణ పర్యాటక అభివృద్ధికి సహకరిస్తానని, పరిశ్రమల ఏర్పాటుకు చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. తెలంగాణలో కవులు, కళాకారులు.. సాంస్కృతిక విప్లవం తీసుకువచ్చి భాషను రక్షించుకోవాలని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. సాంస్కృతిక తెలంగాణ సాధించుకోవాలన్నారు.

అందరినీ కలుపుతున్న పండుగ: కిషన్ రెడ్డి

రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుతున్న పండుగ అలయ్ బలయ్ అని కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి అన్నారు. తెలంగాణ సాధనలో అలయ్ బలయ్ దోహదపడిందన్నారు. 15 ఏళ్లుగా రెండు రాష్ట్రాల నేతలు విభేదాలు పక్కనపెట్టి అలయ్ బలయ్​కి హాజరయ్యారన్నారు.

విభేదాలున్నా.. ఒకే వేదిక: కేకే

తెలంగాణ ఉద్యమంలో నేతల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా అలయ్ బలయ్ ద్వారా ఒకే వేదిక మీదకు వచ్చామని ఎంపీ కె.కేశవరావు గుర్తు చేసుకున్నారు. మాజీ గవర్నర్ నరసింహన్, ప్రస్తుత గవర్నర్ తమిళి సై తమకు తగిన సమయం ఇవ్వలేదని కాంగ్రెస్‌‌ నేత వీహెచ్‌‌ అసంతృప్తి వ్యకం చేశారు. పాత గవర్నర్‌‌లా చేయొద్దని.. తమిళి సైని కోరారు. కార్యక్రమంలో పలువురిని దత్తాత్రేయ సన్మానించారు. మండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌ రెడ్డి, మంత్రి తలసాని, ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, విశాక ఇండస్ట్రీస్ ఎండీ సరోజ వివేకానంద, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కవి గోరటి వెంకన్న, మాజీ మంత్రులు బాబుమోహన్, నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest Updates