మాల్యాను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాం.. ఎప్పుడో చెప్పలేం

  •  సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం వివరణ
  • బ్యాంకులకు 9 వేల కోట్లు అప్పు ఎగ్గొట్టిన మాల్యా
  • 2016లోనే లండన్​కు పరారి

న్యూఢిల్లీ :   దేశంలోని బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్​లో దాక్కున్న విజయ్​ మాల్యాను ఇక్కడకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. న్యాయపరమైన చిక్కుల వల్లే ఆయనను రప్పించడంలో ఆలస్యం జరుగుతోందని కోర్టుకు వెల్లడించింది. కింగ్​ ఫిషర్​ ఎయిర్​లైన్స్​ కోసం రూ. 9,000 వేల కోట్లను అప్పుగా దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి విజయ్​ మాల్యా పొందారు. ఆ తర్వాత ఈ అప్పును తిరిగి చెల్లించకుండా, దేశం విడిచి పారిపోయారు. విజయ్​ మాల్యాను దేశానికి రప్పించే విషయంలో మరింత స్పష్టమైన సమాధానం ఇచ్చేందుకు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా గడువు కోరడంతో కేసును మార్చి 15కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జస్టిస్​ యూ యూ లలిత్, జస్టిస్​ అశోక్​ భూషణ్​లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్​ విజయ్​ మాల్యా కేసును విచారిస్తోంది. విజయ్​ మాల్యాను ఇక్కడకు రప్పించే విషయంలో  స్టేటస్​పై ఎక్స్​టర్నల్​ ఎఫెయిర్స్​ మినిస్ట్రీ ఆఫీసర్​ దేవేష్​ ఉత్తమ్​కు యూకే గవర్నమెంట్​ రాసిన లెటర్​ను సుప్రీం కోర్టుకు మెహతా అందచేశారు. మాల్యాను రప్పించడానికి  యూకే గవర్నమెంట్​తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, అన్ని రకాల ప్రయత్నాలనూ సీరియస్​గా చేస్తోందని  తుషార్​ మెహతా కోర్టుకు వివరించారు. కానీ, స్టేటస్​ మారడం లేదని తెలిపారు. యూకే  ప్రభుత్వంలోని నాయకులతోనూ, అధికారులతోనూ కేంద్ర ప్రభుత్వం  చర్చల ద్వారా తన ప్రయత్నాలను చేస్తోందని చెప్పారు. మెహతా ఇచ్చిన లెటర్​ను కోర్టు రికార్డులలోకి తీసుకుంది. దేశంలోని  బ్యాంకులకు రూ. 9 వేల కోట్లు చెల్లించాల్సిన విజయ్​ మాల్యా మార్చి 2016 నుంచీ యూకేలోనే ఉంటున్నారు. ఆగస్టు 18, 2017లో ఎక్స్​ట్రాడిషన్​ కేసులో స్కాట్లాండ్​ యార్డ్​ కోర్టు వారంట్​ను ఎగ్జిక్యూట్​ చేసింది. అంటే మూడేళ్ల నుంచి విజయ్​ మాల్యా బెయిల్​పైనే ఉన్నారు.

లీగల్ ప్రాసెస్ పూర్తయితేనే పంపగలం: యూకే

మాల్యాను యూకే నుంచి పంపించే విషయంలో మరి కొన్ని లీగల్​ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాకే పంపగలుగుతామని, యూకే గవర్న్​మెంట్​ మన ఎక్స్​టర్నల్​ ఎఫెయిర్స్​ మినిస్ట్రీకి రాసిన లెటర్​లో పేర్కొంది. తమ చట్టాల ప్రకారం ఈ సమస్య పరిష్కారమైతే తప్ప, ఇండియాకు పంపించలేమని తెలిపింది. సమస్య న్యాయపరమైనది కావడంతో ఇంతకు మించిన వివరాలు ఇవ్వడం సాధ్యంకాదని కూడా యూకే గవర్నమెంట్​ ఈ లెటర్లో స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ సమస్య పరిష్కారానికి ఎంత టైము పడుతుందనేది కూడా కచ్చితంగా చెప్పలేమని పేర్కొంది. భారత ప్రభుత్వానికి ఈ కేసు ఎంత ముఖ్యమైనదో తమకు తెలుసని, వీలైనంత తొందరగా సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మాత్రం యూకే గవర్నమెంట్​ హామీ ఇచ్చింది. వీలైనంత తొందరగా విజయ్​ మాల్యాను ఇండియాకు తీసుకెళ్లాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మన ఫారిన్​ సెక్రటరీ హర్ష్​వర్ధన్​ ష్రింగ్లా యూకే హోమ్​ సెక్రటరీ ప్రీతి పటేల్​తో నవంబర్​ 2020లోనే మాల్యాను తీసుకెళ్లేందుకు తమ ప్రయత్నాలను వివరించారు. ఆ తర్వాత ఫారిన్​ ఎఫెయిర్స్​ మినిస్టర్​ డా జైశంకర్​ కూడా డిసెంబర్​ 2020లో యూకే ఫారిన్​ సెక్రటరీ డొమినిక్​ రాబ్​తో సమస్యపై చర్చించారని, ఈ ఏడాది జనవరిలోనూ ఇండియా హోమ్​సెక్రటరీ యూకే పర్మినెంట్​ అండర్​ సెక్రటరీ (హోమ్​)తో చర్చించారని ఈ లెటర్లో యూకే గవర్నమెంట్​ ప్రస్తావించింది.

విజయ్​ మాల్యాను ఇక్కడకు రప్పించే విషయంలో స్టేటస్ రిపోర్టును ఫైల్​ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కిందటి సంవత్సరం నవంబర్​ 2న ఆదేశించింది. ఆరువారాలలో ఈ స్టేటస్​ రిపోర్టును ఇవ్వమని కోరింది. యూకేలోని చట్టాల ప్రకారం ఒక సీక్రెట్​ లీగల్​ ప్రాసెస్​ పూర్తయితే తప్ప విజయ్​ మాల్యాను యూకే గవర్నమెంట్​ ఇండియాకు పంపించడం కుదరదని కేంద్ర ప్రభుత్వం కిందటేడాది అక్టోబర్​లో సుప్రీం కోర్టుకు తెలిపింది. కేసు నుంచి తన క్లయింట్​ విజయ్​ మాల్యాను విడుదల చేయాలనే ఆయన లాయర్​ ఈ సీ అగర్వాల అభ్యర్ధనను సుప్రీం కోర్టు అంగీకరించలేదు. ఈ కేసులో విజయ్​ మాల్యాను అక్టోబర్​ 5, 2020 నాడు  తమ ముందు హాజరవమని అదే ఏడాది ఆగస్టులోనే సుప్రీం కోర్టు ఆదేశించింది. పిల్లలకు 40 మిలియన్​ డాలర్లు మళ్లించారనే కేసులో ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలనే మాల్యా అభ్యర్ధననూ కోర్టు తోసిపుచ్చింది. యూకేలో న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడానికి ఎంత కాలం పడుతుందనే సుప్రీం కోర్టు ప్రశ్నకు, ఈ విషయంలో లండన్​ హైకమిషన్​ నుంచి తమకెలాంటి సమాచారమూ లేదని మెహతా కోర్టుకు తెలిపారు.

Latest Updates