క‌రోనాకి ఆ రెండు టాబ్లెట్స్ క‌లిపి వాడ‌డం డేంజ‌ర్!: అమెరికా సైంటిస్టులు

క‌రోనా పేషెంట్ల‌కు మ‌లేరియాకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్, యాంటీ బ‌యాటిక్ అజిత్రోమైసిన్ టాబ్లెట్లు క‌లిపి ఇస్తే కోలుకుంటార‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇప్పుడు ఈ మందుల‌నే అమెరికాలోని చాలా ఆస్ప‌త్రుల్లో పేషెంట్ల‌కు వాడుతున్నారు. భార‌త్ లోనూ పేషెంట్ల‌కు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్ట‌ర్లు, న‌ర్సులు, పేషెంట్ కాంటాక్ట్స్ లాంటి హైరిస్క్ పాపులేష‌న్ కు మ‌లేరియా డ్ర‌గ్ వాడొచ్చ‌ని భార‌త మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్) కూడా సూచించింది. అయితే వాటిని ఎవ‌రుప‌డితే వారు వాడ‌కూడ‌ద‌ని, వారి ఆరోగ్య స్థితిని బ‌ట్టి.. డాక్ట‌ర్ల ప్రిస్క్రిప్ష‌న్ తోనే తీసుకోవాల‌ని చెప్పింది. అయితే అమెరికాలో కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్ కోసం వాడ‌డంపై ఆ దేశంలోని ఒరేగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివ‌ర్సిటీ, ఇండియానా యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు ఉమ్మ‌డిగా అధ్య‌య‌నం చేశారు. మ‌లేరియా డ్ర‌గ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో పాటు అజిత్రోమైసిన్ టాబ్లెట్ ను క‌లిపి వాడ‌డం వ‌ల్ల హార్ట్ ప్రాబ్ల‌మ్స్ రావ‌చ్చ‌ని గుర్తించారు. అలాగే అప్ప‌టికే గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్న వాళ్లు మ‌ర‌ణించే ప్ర‌మాదం ఉంటుంద‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు.

అమెరిక‌న్ కాలేజ్ ఆఫ్ కార్డియాల‌జీ రీసెర్చ్ మ్యాగ‌జైన్ లో శాస్త్ర‌వేత్త‌లు త‌మ ప‌రిశోధ‌న ఫ‌లితాల‌ను ప్ర‌చురించారు. సాధార‌ణంగానే కొన్ని డ్ర‌గ్స్ సైడ్ ఎఫెక్ట్స్ గుండెపై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతాయ‌ని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో పాటు అజిత్రోమైసిన్ టాబ్లెట్ ను క‌లిపి ఇస్తే వెంటిక్యుల‌ర్ అరిథ‌మియా అనే హార్ట్ ప్రాబ్లం త‌లెత్తే ముప్పు ఎక్కువ‌ని తెలిపారు. హార్ట్ బీట్ ఒక్క‌సారిగా వేగం పెరిగి మెద‌డుకు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా త‌గ్గిపోవ‌డం వ‌ల్ల మ‌నిషి మ‌ర‌ణిస్తాడ‌ని సైంటిస్టులు చెప్పారు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని క‌రోనా పేషెంట్లకు హార్ట్ ప్రాబ్ల‌మ్స్ ఏమీ లేకుంటే మాత్ర‌మే ఈ రెండు టాబ్లెట్స్ క‌లిపి వాడాల‌ని సూచించారు.

Latest Updates