పేలడానికి రెడీగా అగ్నిపర్వతం

అదో అగ్నిపర్వతం. ఇంతవరకు పేలిన దాఖలాల్లేవు. ఇక దాని పనైపోయిందనుకున్నారు. మళ్లీ పేలదనుకున్నారు. కానీ ఇప్పుడది అలజడి రేపుతోంది. పూర్తిగా మంచుతో కప్పి ఉన్న ఆ పర్వతం కింద మాగ్మా కదులుతోందని, భూ ప్రకంపనలొస్తున్నాయని సైంటిస్టులు కనుగొన్నారు. 2018 మే, జూన్‌ నెలల్లో ప్రకంపనలు గుర్తించామని చెప్పారు. ఆ అగ్నిపర్వతం పేరు బొల్షయ ఉడినా. తూర్పు రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంలో ఉంది. సుమారు మూడు కిలోమీటర్ల పొడవుంటుంది. ఇదో స్ట్రాటో వాల్కనో. అంటే లావా పేరుకుపోయి ఏర్పడిన పర్వతం. దాని పక్కనే మరో చిన్న అగ్ని పర్వతముంది. పేరు మలయ ఉడినా. టెక్టానిక్‌ ప్లేట్ల అంచుల్లో ఉండే ఉడినా లాంటి అగ్నిపర్వతాలు పెద్ద పెద్ద పేలుళ్లు జరిగి ఏర్పడ్డాయని సైంటిస్టులు చెబుతున్నారు.

4.8 కిలోమీటర్ల లోతులో..
బోల్షయ ఉడినా గతంలో ఎప్పుడు పేలిందో తెలియదని సైంటిస్టులు అంటున్నారు. కానీ తాజాగా దాని కింద ప్రకంపనలు వస్తుండటంతో ఆశ్చర్యపోతున్నారు. అది మళ్లీ యాక్టివ్‌ అయిందని భావిస్తున్నారు. పూర్తిగా తెలుసుకోవడానికి రష్యా, ఈజిప్టు, సౌదీ అరేబియా సైంటిస్టులు పర్వతం చుట్టూ సెస్మిక్‌ రికార్డింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 2018 మే, జూన్‌ నెలల్లో భూ ప్రకంపనలను గమనించారు.  ఆ రెండు నెలల్లో 4.8 కిలోమీటర్ల లోతులో 559 సార్లు ప్రకంపనలొచ్చినట్టు గుర్తించారు. ప్రకంపనలొస్తున్నాయంటే లోపల ద్రవం, మాగ్నా కదులుతున్నట్టేనని వివరించారు.

పేలితే ప్రమాదమే
చాలా కాలం తర్వాత పేలే పర్వతాలు పెను విపత్తులు సృష్టిస్తాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. పెద్ద మొత్తంలో బూడిద ఆకాశమంతా వ్యాపిస్తుందని, ప్రపంచమంతా ఇబ్బంది పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. ఇటలీలో వెసువియస్‌ పేలినప్పుడు ఎంతటి విపత్తు సంభవించిందో చెప్పక్కర్లేదన్నారు. 1600 సంవత్సరంలో పెరూలో ఓ అగ్నిపర్వతం పేలి యూరప్‌ మొత్తం కూల్‌ అయిపోయిందని, రష్యాలో కరువొచ్చిందని గుర్తు చేశారు. అయితే ఉడినా పేలుతుందో లేదో ప్రస్తుతం చెప్పడం కష్టమన్నారు. పర్వతం గురించి ఇంకా బాగా స్టడీ చేస్తామన్నారు.

Latest Updates