ఇంటిముఖం పట్టిన సింధు, సైనా

కౌలాలంపూర్‌‌: మలేసియా మాస్టర్స్‌‌ బ్యాడ్మింటన్‌‌ టోర్నీలో ఇండియా ప్లేయర్ల పోరాటం ముగిసింది. ఆశలు పెట్టుకున్న టాప్‌‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌‌ కూడా ఇంటిముఖం పట్టారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో వరల్డ్‌‌ చాంపియన్‌‌, ఆరోసీడ్‌‌  సింధు 16–21, 16–21తో టాప్‌‌సీడ్‌‌ తై జు యింగ్‌‌ (చైనీస్‌‌ తైపీ) చేతిలో ఓడింది. తై జు చేతిలో ఓడటం సింధుకు వరుసగా ఇది రెండోసారి. గతేడాది అక్టోబర్‌‌లో ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ క్వార్టర్స్‌‌లోనూ పరాజయం చవిచూసింది. ఈ విజయంతో తై జు హెడ్‌‌ టు హెడ్‌‌ రికార్డు 12–5కు పెరిగింది. 36 నిమిషాల ఈ మ్యాచ్‌‌లో తెలుగమ్మాయికి సరైన ఆరంభం దక్కలేదు. అయినా పట్టువిడవకుండా పోరాడుతూ 7–7తో సమం చేసింది. తర్వాత 9–11తో వెనుకబడిన దశలో సింధు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 13–11 ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ వెంటనే పుంజుకున్న తైజు ఒక్కో పాయింట్‌‌తో దూసుకొచ్చింది. ఓ దశలో ఇరువురి స్కోరు 15–15తో సమమైనా.. తైజు వరుసగా 5 పాయింట్లు గెలిచి 20–15తో నిలిచింది. ఇక్కడ సింధు ఒక్క పాయింట్‌‌ గెలిస్తే, తైజు గేమ్‌‌ను ముగించింది. రెండో గేమ్‌‌లో తైపీ ప్లేయర్‌‌కు ఎదురులేకుండా పోయింది. 2–2 స్కోరు నుంచి మొదలైన పాయింట్ల వర్షం ఎక్కడా ఆగలేదు. కనీసం సింధు ఒక్కసారి కూడా స్కోరును సమం చేయలేక చేతులెత్తేసింది. మరో క్వార్టర్స్‌‌ మ్యాచ్‌‌లో సైనా 8–21, 7–21 కరోలినా మారిన్‌‌ (స్పెయిన్‌‌) చేతిలో ఘోరంగా కంగుతిన్నది. మ్యాచ్‌‌ ఆద్యంతం ఆధిపత్యం చూపెట్టిన మారిన్‌‌ కేవలం అర్ధ గంటలోనే హైదరాబాదీకి చెక్‌‌ పెట్టింది. ముఖాముఖి రికార్డులో మారిన్‌‌ 7–6 ఆధిక్యంలో నిలిచింది. 10–6 ఆధిక్యంతో తొలి గేమ్‌‌ను మొదలుపెట్టిన మారిన్‌‌.. ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. రెండో గేమ్‌‌లో సైనా చేసిన అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌.. స్పెయిన్‌‌ ప్లేయర్‌‌కు బాగా కలిసొచ్చాయి.

Malaysia Masters 2020: Indian challenge ends as PV Sindhu, Saina Nehwal crash out

Latest Updates