స్మార్ట్ ఫోన్ ఎత్తికెళ్లిన కోతి.. స్మార్ట్ గా సెల్ఫీలు దిగి .. ఆ తర్వాత..!

బటుపహాట్‌: కోతులు చేసే హంగామా అంతాఇంతా కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. కోతులు అద్దంలో ఫేస్ చూసుకోవడం.. ఇంట్లోని వస్తువులు ఎత్తుకెళ్లడం.. ఇలాంటివి కామన్. అయితే ఓ కోతి మాత్రం ఏకంగా స్మార్ట్ ఫోన్ ఎత్తికెళ్లి పిచ్చపాటిగా సెల్ఫీలు దిగింది. ఫొటో షూట్ అయిపోగానే మళ్లీ ఇంటి దగ్గర స్మార్ట్ ఫోన్ వదిలేసి వెళ్లింది. ఈ వెరైటీ సంఘటన మలేషియాలో జరుగగా ఇందుకు సంబంధించిన కోతి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వివరాల్లోకెళితే..మలేషియాలోని బటు పహాట్‌ కు చెందిన జాక్‌ రిడ్జ్ రోడ్జి అనే 20 ఏళ్ల విద్యార్థి రాత్రి తన మంచం పక్కన మొబైల్ పెట్టి నిద్రపోయాడు. అయితే, నెక్ట్స్ డే మార్నింగ్ లేచి చూసే సరికి ఫోన్‌ లేదు.రూమ్ మొత్తం వెదికాడు. ఇంట్లో వాళ్లను అడిగాడు. ఎక్కడా స్మార్ట్ ఫోన్‌ జాడలేదు. అతడి తండ్రి జాక్‌ రిడ్జ్‌ ఫోన్‌ కు రింగ్‌ ఇస్తూనే ఉన్నాడు. ఇంటి వెనుకాల రింగ్‌టోన్‌ వినిపించగా, రోడ్జి వెళ్లాడు. చివరికి ఓ తాటిచెట్టుకింద ఫోన్‌ దొరికింది.

వెంటనే ఫోన్‌ ను శుభ్రం చేసిన రోడ్జి.. గ్యాలరీ ఓపెన్‌ చేసి చూడగానే, షాక్‌ అయ్యాడు. అందులో కోతుల సెల్ఫీ ఫొటోలున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్పినా మొదట ఎవరూ నమ్మలేదు. అందులోని ఒక ఫొటోలో ఓ కోతి ఫోన్‌ తినేందుకు ప్రయత్నించడం కూడా క్యాప్చర్‌ అయ్యింది. ఈ ఫొటోలన్నింటినీ రోడ్జి ఓ వీడియో రూపంలోకి మార్చి ట్విట్టర్‌లో పెట్టగా వైరల్‌ అయ్యింది. కోతి కిటికీ నుంచి వచ్చి ఫోన్‌ ఎత్తుకెళ్లి ఉంటుందని ఆ ఫ్యామిలీ భావిస్తోంది.

 

 

Latest Updates