మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి అరెస్ట్.. రూ.70 కోట్ల అక్ర‌మ ఆస్తులు గుర్తింపు

హైద‌రాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డిని అవినీతి నిరోధ‌క శాఖ‌(ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. న‌ర్సింహారెడ్డికి సంబంధించి ఇప్పటివరకు రూ. 70 కోట్ల ఆస్తులు గుర్తించిన‌ట్టు ఏసీబీ తెలిపింది. హైద‌రాబాద్‌లోని సైబర్ టవర్స్ ముందు 4 ప్లాట్లు, హఫీజ్ పెట్ లో జీ ప్లస్ 3 కమర్షియల్ కాంప్లెక్స్, మరో రెండు ఇంటి ప్లాట్స్, న‌గ‌రంలో మ‌రో రెండు ఇళ్లు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో 15 లక్షల లిక్విడ్ క్యాష్ ల‌భ్యం కాగా.. రెండు బ్యాంక్ లాకర్లతో పాటు రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న‌ట్లు తెలిపింది. హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, న‌ల్ల‌గొండ‌, క‌రీంన‌గ‌ర్‌తో పాటు అనంత‌పురంలో మొత్తం 25 చోట్ల‌ సోదాలు నిర్వ‌హించిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు. మహీంద్రా హిల్స్ లోని ఏసీపీ మ‌రో ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

అక్ర‌మాస్తుల కేసులో మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. గతంలో ఉప్పల్ సీఐగా పని చేసిన‌ నరసింహారెడ్డి.. పలు ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడి అక్ర‌మంగా సంపాదించినట్లు తెలుస్తోంది.

Latest Updates