మల్లన్నసాగర్​ పరిహారాల చెక్కులు గాయబ్

mallanna-sagar-checks-theft

మల్లన్నసాగర్​ నిర్వాసితులకు పంపిణీ చేయాల్సిన  చెక్కులు మాయమైయ్యాయి.  రూ.50 లక్షల విలువ చేసే చెక్కును అక్రమంగా డ్రా చేసుకున్న తరువాత ఆఫీసర్లు ఆలస్యంగా  గుర్తించి  సిద్దిపేట వన్​టౌన్​ పోలీస్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.   సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే సందీప్ అనే ఉద్యోగి గత జనవరి నెలలో రెండు ఖాళీ చెక్కులను దొంగిలించి అతని స్నేహితుడు కొండపాక మండలం జప్తి నాచారం గ్రామానికి చెందిన చాంద్​పాషాకి అందజేశాడు. వీటిని తీసుకున్న చాంద్​పాషా వారం రోజుల తరువాత ఒక చెక్కుపై 50 లక్షల రూపాయలను డ్రా చేసుకున్నాడు. తరువాత మరో చెక్కుపై రెండు కోట్ల రూపాయలు డ్రా చేయడానికి ప్రయత్నించినా ఆ సమయంలో ఖాతాలో డబ్బులు లేకపోవడంతో  తీసుకోలేక పోయాడు.

పరిహారాలకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం  కలెక్టర్​వాటిపై దృష్టి సారించడంతో ఆర్డీవో కార్యాలయం నుంచి  రెండు ఖాళీ చెక్కులు మాయమైనట్టుగా గుర్తించారు. మాయమైన రెండు చెక్కుల్లో ఒకదానిపై యాభై లక్షల రూపాయలు డ్రా చేసినట్టు తెలియడంతో  వెంటనే దీనిపై విచారణకు ఆదేశించారు. దీనిపై  ఆఫీసర్లు లోతుగా విచారణ చేయడంతో సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం నుంచి సందీప్అనే వ్యక్తి  దొంగిలించినట్టుగా తేలడంతో కలెక్టర్ఆదేశాల మేరకు సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డి వన్​టౌన్​ పోలీస్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. ఆర్డీవో ఫిర్యాదుతో పోలీసులు జప్తి నాచారంకు చెందిన  చాంద్​పాషాను అదుపులోకి తీసుకుని విచారించగా 50 లక్షల రూపాయలు డ్రా చేయడంతో పాటు మరో రెండు కోట్ల రూపాయలు డ్రా చేయడానికి ప్రయత్నించిన విషయాన్ని ఒప్పుకోగా  అతని నుంచి కొంత సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఖాళీ చెక్కులను దొంగిలించిన ఆర్డీవో కార్యాలయ ఉద్యోగి సందీప్​ను  కలెక్టర్​సస్పెండ్​ చేశారు. ఈ విషయంపై సిద్దిపేట అడిషనల్​సీపీ  నరసంహ్మరెడ్డి మాట్లాడుతూ ఆర్డీవో కార్యాలయం నుంచి రెండు చెక్కులు దొంగిలించినట్టుగా ఆర్డీవో  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా చెక్కులు మాయమైన సంఘటన వెనుక కొందరు ఇంటి దొంగల హస్తం వుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంఘటన  జనవరిలో జరిగితే మూడు రోజుల కింద కలెక్టర్​దృష్టి కి రావడంపై పలు అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. దీని వెనుక కొందరు రెవెన్యూ సిబ్బంది ఉండి విషయం బయటకు పొక్కకుండా చూసినట్టు తెలుస్తోంది.   పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టడంతో అటు రెవెన్యూ  ఆఫీసర్లు, ఇటు పోలీసు  ఆఫీసర్లు దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించడానికి వెనుకాడుతున్నారు.

Latest Updates