మనసును తడిమే ‘మల్లేశం’

mallesham-movie-gets-positive-response

ఒక్క యంత్రంతో వేలాదిమంది నేతకారుల జీవితాలను మార్చేసిన వ్యక్తి చింతకింది మల్లేశం. ఆయన జీవితాన్ని సినిమాగా రూపొందించాడు దర్శకుడు రాజ్. మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటించాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదలయ్యింది. మరి మల్లేశం కథ ప్రేక్షకుల్ని మెప్పించిందా?
అంచనాలను అందుకుందా?

కథ

నేతకారుల కుటుంబంలో పుట్టిన పిల్లాడు మల్లేశం (ప్రియదర్శి). కుటుంబ పరిస్థితుల వల్ల ఆరోతరగతిలోనే చదువు మానేసి నేతపని చేస్తుంటాడు. ఆసు పోసి పోసి తల్లి చేయి పడిపోయే స్థితికి చేరుకోవడం అతణ్ని కలచివేస్తుంది. తన తల్లితోపాటు ఆ ఊరి వారందరి కష్టాలనూ తీర్చడానికి ఆసు యంత్రాన్ని కనిపెట్టాలనుకుంటాడు. ఆ కలతోనే పెరిగి పెద్దవుతాడు. అప్పులు చేసి, ఎన్నో యేళ్ల పాటు రకరకాల సమస్యలు ఎదుర్కొని ఎలాగైతే ఆసు యంత్రాన్ని కనిపెడతాడు. చేనేత కార్మికుల కష్టాలు తీరుస్తాడు.

విశ్లేషణ

ఒక వ్యక్తి జీవితాన్ని రెండున్నర గంటల వ్యవధిలో చెప్పేయడం తేలిక కాదు. అందులోనూ ఆ జీవితం నిండా పోరాటమే ఉన్నప్పుడు మరీ కష్టం. ఆ కష్టాన్ని అధిగమించాడు దర్శకుడు. మల్లేశం జీవన యానాన్ని ఎంతో అందంగా చూపించాడు. చదువు మానేసి మగ్గం పట్టడం, తల్లి కష్టాన్ని చూసి కుమిలిపోవడం, యంత్రాన్ని తయారుచేసి తీరాలన్న తపన, ఆ క్రమంలో ఎదురయ్యే అవమానాలు తట్టుకోలేక చనిపోవాలనుకోవడం, మానుకుని మళ్లీ లక్ష్యం వైపు అడుగులేయడం…ఎన్నో ఆటుపోట్లూ ఎత్తూపల్లాలూ ఉన్నాయి మల్లేశం జీవితంలో. వాటన్నిటినీ ఒద్దికగా కూర్చి అందించిన విధానం అభినందనీయం. చాలా వరకూ రియల్ లొకేషన్లలో చిత్రీకరించడం వల్ల సహజంగా అనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భాష, యాసలను గొప్పగా చూపించారు. సన్నివేశాలను పండించేందుకు కాస్త కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించినా.. కృత్రిమంగా లేకుండా జాగ్రత్తపడ్డారు.  అయితే మొదట్నుంచీ అందంగా సాగిన మల్లేశం జర్నీ ఒక దశకి చేరుకున్నాక స్లో అవుతుంది. మల్లేశంలోని తపన కనిపిస్తుంది కానీ ఆ యంత్రం చేయడానికి అవసరమైన స్ఫూర్తి కనిపించదు. అవన్నీ చేసేంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో చూపించలేదు. చింతకింది మల్లేశం ఎంతో కష్టపడి, తనకు అర్థం కాని ఆంగ్ల పుస్తకాలను సైతం చదివి ఈ స్థాయికి చేరుకున్నానని కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఆ స్ట్రగుల్‌‌ని కూడా కాస్త చూపించివుంటే ఈ ప్రశ్న పుట్టివుండేది కాదు. యేళ్ల పాటు వైఫల్యాలు, అవమానాలు చూసిన మనిషి విజయం సాధించిన క్షణంలో పొందే ఆనందాన్ని క్లైమాక్స్​లో సరిగ్గా చూపించకపోవడం కాస్త వెలితిగా అనిపిస్తుంది.

ఎవరెలా?

మల్లేశం కథను నిజాయతీగా చెప్పడంలో దర్శకుడు సక్సెసయితే… మల్లేశాన్ని కళ్లముందు నిలపడంలో ప్రియదర్శి విజయం సాధించాడు. అతనిలోని సెన్సిబుల్ నటుణ్ని బయటకు తీసిందీ పాత్ర. భార్యగా నటించిన అనన్య, తల్లిగా నటించిన ఝాన్సీ, తండ్రి పాత్రధారి చక్రపాణి కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్​ అంశాలు చూస్తే సినిమాటోగ్రఫీ, సంగీతం సినిమా స్థాయిని పెంచాయి. పాటలు సినిమాకి బలాన్నిచ్చాయి. పెద్దింటి అశోక్ కుమార్ తెలంగాణ మాండలికంలో డైలాగ్స్ బాగా రాశారు. అన్ని అంశాలూ కుదిరితేనే మంచి సినిమా తయారవుతుంది. అలా తయారయ్యింది కనుకే ‘మల్లేశం’ మనసుల్ని తడుముతుంది. మనసు పొరల్లో ఎప్పటికీ మిగిలిపోతుంది.