పోగుబంధం.. మల్లేశం రివ్యూ

mallesham-movie-review-by-v6

బయోపిక్ అనగానే స్పోర్ట్స్ పర్సన్, లేదంటే పొలిటీషియన్ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ‘ప్యాడ్ మ్యాన్’ లాంటి ఒకరిద్దరు సామాన్యుల కథలు తెరకెక్కినా.. అవేవి వాస్తవికతకు దగ్గరగా ఉండవు. ఇలాంటి నేపథ్యంలో చేనేత కళాకారుల శ్రమ తగ్గించిన ‘ఆసుయంత్రం’ ఆవిష్కర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేషం జీవితం సినిమాగా తెరకెక్కింది. ఆరోతరగతికే స్కూల్ డ్రాపౌట్ అయిన మల్లేశం కథ సినిమాగా ఎంతవరకూ వర్కవుట్ అయింది. కామెడీ ఇమేజ్ ఉన్న ప్రియదర్శి మల్లేశం పాత్రలో ఎంతవరకూ మెప్పించాడు. తెలంగాణ గ్రామాల్లోని వాస్తవికతను దర్శకుడు ఎంతవరకూ చూపించగలిగాడు రివ్యూలో చూద్దాం.

కథగా..
చేనేత కళాకారుల కుటుంబానికి చెందిన వ్యక్తి మల్లేశం (ప్రియదర్శి). సరైన ఆదాయం లేక అప్పులపాలవుతున్నా చేనేతపైనే ఆధారపడి జీవించే కుటుంబాలున్న ఆ ఊర్లో మల్లేశానిది ఓ కుటుంబం. ఒక్కరే మగ్గం నేస్తే ఇల్లు గడవదని కొడుకు చేత ఆరో తరగతికే బడి మాన్పించి కులవృత్తిలోకి దించుతాడు మల్లేశం తండ్రి (చక్రపాణి). ఒక చీర నేయాలంటే అందుకు తొమ్మిది వేల సార్లు దారాన్ని ఆసు పోయాలి. అలా కొన్నేళ్ల పాటు ఆసు పోయడం వల్ల భుజం నొప్పితో భాదపడుతుంటుంది మల్లేశం తల్లి లక్ష్మి (ఝాన్సి). తల్లి కష్టం చూసి చలించిపోయిన మల్లేశం చిన్ననాటి నుంచే ఆసుయంత్రం తయారుచేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు, అప్పులు చేస్తాడు. పెళ్లి చేస్తే దారిలో పడతాడని పద్మ (అనన్య)తో పెళ్లి చేస్తారు. భార్య పోత్సాహం కూడా తోడవడంతో తన లక్ష్యం కోసం మళ్లీ ప్రయత్నిస్తుంటాడు. కానీ కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, సరైన ప్రోత్సాహం లేకపోవడం, తండ్రితో సహా ఊర్లో వాళ్లు అవహేళన చేయడం లాంటి ఎన్నో ప్రతికూల అంశాలు అతనికి అడ్డుతగులుతుంటాయి. ఇన్ని అడ్డంకుల నడుమ తన లక్ష్యాన్ని మల్లేశం ఎలా చేరుకున్నాడు అనేది ఈ సినిమా అసలు కథ.

నటీనటులు..
‘పెళ్లిచూపులు’ సినిమాతో వచ్చిన కామెడీ ఇమేజ్ చెరిపేసుకుని ఏ పాత్రలోనైనా మెప్పించే నటుడిగా నిరూపించుకునే ప్రయత్నంలో ప్రియదర్శికి చింతకింది మల్లేశం బయోపిక్ ఓ మంచి అవకాశం. అందుకు తగ్గట్టే ఈ ఛాన్స్ ని పూర్తి స్థాయిలో వాడుకున్నాడు. మల్లేశం పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ఇక భార్యగా నటించిన అనన్య సైతం ఆ పాత్రలో తన మార్క్ చూపించింది. కొన్ని సీన్స్ లో ప్రియదర్శికి పోటీ ఇచ్చింది. తల్లిదండ్రుల పాత్రలకు మరొకరిని ఊహించుకోలేనంతగా ఝాన్సి, చక్రపాణి ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. స్నేహితులుగా నటించిన జగదీష్, అన్వేష్ సహజత్వానికి దగ్గరగా కనిపించారు. ఇతర పాత్రల్లో తాగుబోతు రమేష్, ఆర్.ఎస్.నందా, గంగవ్వ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతికంగా..
తెలంగాణ మాండలికంలో పెద్దింటి అశోక్ కుమార్ అందించిన సంభాషణలు సినిమాకు సహజత్వాన్ని తీసుకొచ్చాయి. మార్క్ కే రాబిన్ సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. సందర్భోచితంగా వచ్చే పాటలు సినిమాకు ఆకర్షణగా నిలచాయి. గోరటి వెంకన్న, చంద్రబోస్ సాహిత్యం ఆకట్టుకుంది. బాలు యస్ కెమెరా పనితనం కథకు, సన్నివేశాలకు అనుగుణంగా సాగింది. రియల్ లైఫ్ స్టోరీని సినిమాగా మలచిన దర్శకుడు రాజ్ ని, అతనితో కలసి ఇలాంటి సినిమా నిర్మించిన సహనిర్మాత శ్రీఅధికారిని అభినందించి తీరాలి.

సమీక్ష..
రియల్ లైఫ్ స్టోరీని సినిమాగా తెరకెక్కించాలంటే ఆయా వ్యక్తుల జీవితాలు బలమైన సంఘర్షణలు, భావోద్వేగాల మిళతమై ఉండాలి. ఎలాంటి ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు లేని జీవితాలు సినిమాలుగా మెప్పించలేవని ఇప్పటికే కొన్ని బయోపిక్స్ నిరూపించాయి. ఈ క్రమంలో వాస్తవిక పరిస్థితులకు దగ్గరగా చూపిస్తూనే, ప్రేక్షకులను మెప్పించే అంశాలను రంగరించడం దర్శకుడికి కత్తిమీద సాము లాంటిది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని అథెంటిక్ గా ఉండేలా దర్శకుడు ‘మల్లేశం’ని తీర్చిదిద్దాడు. కథకు అవసరం లేని సన్నివేశాలు జొప్పించకపోవడంతో ప్రేక్షకుల దృష్టి మల్లేశం పాత్ర నుంచి డీవియేట్ అవలేదు. నెమ్మదిగా సాగే కథనం రెగ్యులర్ ఆడియన్స్ ని కొంత విసిగించొచ్చు. అయితే కథలో ఇన్వాల్వ్ అయ్యి, మల్లేశం క్యారెక్టర్ తో ట్రావెల్ అవుతున్న ప్రేక్షకులెవరికీ అది విసుగు అనిపించదు. భార్యభర్తల అనుబంధాన్ని, కుటుంబ బంధాలను, చేనేత కళాకారుల కష్టాలను, ముఖ్యంగా ఆ వృత్తిలో మహిళల ప్రాధాన్యతని దర్శకుడు చూపించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కథలోని పాత్రలతోనే పండించిన సున్నితమైన హాస్యం నవ్వులు పూయిస్తుంది. మల్లేశం కథను ఎంచుకోవడంలోనే సగం సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు.. నటీనటుల ఎంపిక, వారి నుంచి నటనను రాబట్టుకున్న తీరు, సహజత్వానికి దగ్గరగా తీసిన విధానంతో మిగతా సగం మెప్పించాడు. తొంబైల నాటి తెలంగాణ నేటివిటీని సహజంగా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. సెట్స్ లాంటివేమి లేకుండా నేచురల్ లొకేషన్స్ లో తీయడం వల్ల చేనేత కార్మికుల జీవితాన్ని దగ్గరనుంచి చూసిన భావన కలిగింది. ప్రేక్షకులను మెప్పించేందుకు కొంత ఫిక్షన్ అంశాలను జోడించినప్పటికీ అవి వాస్తవికథకు దగ్గరగా ఉన్నాయి. ఆసుయంత్రం ఆవిష్కరణ వెనకున్న కారణాలను, అతని మానసిక సంఘర్షణను మనసులకు హత్తుకునేలా తెరకెక్కించాడు. సినిమాటిక్ లిబర్టీతో పాటల్లాంటి కమర్షియల్ వ్యాల్యూస్ కు ప్రయారిటీ ఇచ్చినప్పటికీ అవన్నీ కథలో ఇమిడిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ గ్రామాల్లో ఉండే పరిస్థితులు, ఇక్కడి యాస, భాష, వ్యక్తుల భావోద్వేగాలను దర్శకుడు తెరకెక్కించిన విధానం ప్రశంసనీయం. ఈ సినిమాలోని ఓ డైలాగ్ లో చెప్పినట్టు చేనేత కళాకారుల జీవితాలకు దగ్గరగా తీసిన ఈ సినిమా ఓ ‘పోగుబంధం’

కమర్షియల్ సినిమా పేరిట ఒకే కథను మళ్లీ మళ్లీ తీస్తూ మూస ధోరణిలో ముందుకెళ్తోన్న తెలుగు సినిమాకు.. మన మట్టివాసనని గుర్తుచేసి, కథల కోసం ఏ కొరియన్ సినిమాలనో కాపీ కొట్టాల్సిన అగత్యం లేదు.. మన గ్రామాల్లోనే ఇలాంటి కథలు కోకొల్లలు ఉన్నాయని చాటే చిత్రం ఈ ‘మల్లేశం’.

Latest Updates