‘జైహింద్ వాహిని‘ ఆయుధంగా దీదీ ఢీ

జైహింద్ వాహిని పూర్తిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుర్రకు పుట్టిన ఆలోచన. బెంగాలీల  ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి పుట్టినట్లు చెబుతున్న  ఈ  సంస్థలో మమత సోదరులు  కార్తీక్ బెనర్జీ, గణేశ్ బెనర్జీ కీలక పాత్ర పోషిస్తున్నారు. వాహినికి కార్తీక్ బెనర్జీ ప్రెసిడెంట్ కాగా గణేశ్ బెనర్జీ కన్వీనర్ గా ఉన్నారు. సాంస్కృతికపరంగా బంగ్లా కల్చర్ ను, బెంగాలీల ఆత్మాభిమానాన్ని ఎలుగెత్తి చాటడం జైహింద్ వాహిని లక్ష్యమన్నారు మమత. ఈ సంస్థ ఏర్పాటు ను మమత చాలా సీరియస్ గా తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ అంతటా జైహింద్ వాహిని శాఖలు ఏర్పాటయ్యేలా చూడాలని తృణమూల్ కాంగ్రెస్ కేడర్ కు ఆమె తాజాగా హుకుం జారీ చేశారు. వాహినిలో చేరేవారందరికీ యూనిఫాం అలాగే ఐడెంటిటీ కార్డులు ఇస్తామన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదర్శాల అమలుకోసం వాహిని కార్యకర్తలు పనిచేస్తారన్నారు. అంతేకాదు మతతత్వ రాజకీయాలతో బెంగాల్ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్న  ఆరెస్సెస్ కార్యకలాపాలను జైహింద్ వాహిని కార్యకర్తలు దీటుగా ఎదుర్కొంటారని చెప్పారు.

బీజేపీ ని ఎదుర్కోవడమే టార్గెట్ ?

రానున్న రోజుల్లో బెంగాల్ లో బీజేపీని ఎదుర్కోవడమే జైహింద్ వాహిని అసలు టార్గెట్ అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. బంగ్లా  కల్చర్ ను బీజేపీ, ఆరెస్సెస్ తూట్లు పొడుస్తున్నాయని మమతా బెనర్జీ గతంలో ఆరోపించారు. దీంతో బెంగాలీల  కల్చరల్  హెరిటేజ్ ను కాపాడుకోవడానికే జైహింద్ వాహిని పేరుతో ఓ సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. తాజాగా ముగిసిన లోక్ సభ ఎన్నికల ప్రచారం సందర్బంగా బెంగాల్ లో హింస చెలరేగింది. బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా పర్యటన సందర్భంగా ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చివేశారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం పై జరిగిన దాడిని బెంగాలీల కల్చర్ పై జరిగిన దాడిగా మమతా బెనర్జీ పేర్కొన్నారు.  ప్రాణాలు పణంగా పెట్టయినా బెంగాలీల కల్చర్​ను  కాపాడుకుంటామని ఆమె అన్నారు.

ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రొఫైల్ మారింది

మమతా బెనర్జీ అధికార ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ కొన్ని రోజుల కిందట మారింది. బెంగాల్ కు చెందిన ప్రముఖుల ఫొటోలను ఆమె ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నారు. పిక్ పైన బెంగాలీ భాషలో  ‘జై హింద్’ అనీ, కింద ‘జై బంగ్లా ’ అని రాసి ఉంది.

జైహింద్ వాహినికి ఎల్లో యూనిఫాం

జైహింద్ వాహినిలో కేవలం యువకులే కాదు మధ్య వయసు వారు కూడా ఉన్నారు. పసుపురంగు యూనిఫాం వేసుకున్నారు. నెత్తిపై టోపీ పెట్టుకున్నారు. ఎల్లో కలర్ కు ఒక ప్రత్యేకత ఉందన్నారు జైహింద్ వాహిని ప్రెసిడెంట్ కార్తీక్ బెనర్జీ. రవీంద్రనాథ్ ఠాగోర్  ఫేవరెట్ కలర్ పుసుపు అన్నారు. శాంతినికేతన్ లో అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఎల్లో కలర్ డ్రస్సులే వేసుకుంటారని చెప్పారు.

జై శ్రీరాంకు దీటుగా

ఉత్తర 24 పరగణా జిల్లాలలో ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన ఒక కార్యక్రమానికి మమతా బెనర్జీ వెళుతుండగా బీజేపీ కార్యకర్తలు ఆమె కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఆమె కారును  చుట్టుముట్టి ‘జై శ్రీరాం ’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో మమత కారులో నుంచి బయటకు వచ్చి వారిని కోప్పడ్డారు. అయినా జై శ్రీరాం నినాదాలు ఆగలేదు. దీంతో బీజేపీ కార్యకర్తల ముసుగులో బయటి నుంచి వ్యక్తులు తన కాన్వాయ్ పై దాడి చేయడానికి ప్రయత్నించారని మమత ఆరోపించారు. తర్వాత  పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి  నైహాతికి వెళ్లిపోయారు. నైహాతి సభలో మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు తన కారును చుట్టుముట్టిన విషయాన్ని ప్రస్తావించారు. అదే వేదికపై  బెంగాల్ ప్రజల హక్కుల కోసం, రాష్ట్రంలో సెక్యులర్ వాతావరణం కాపాడుకోవడానికి ‘జైహింద్ వాహిని’, ‘ బంగ జనని సమితి’ పేరుతో రెండు సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బంగ జనని సమితి  మహిళలకు సంబంధించిన సమస్యల పై పోరాటం చేస్తుందన్నారు. ‘జై హింద్ ’ నినాదానికి తాను కట్టుబడి ఉన్నానని ఆమె  స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ ను ఎలాంటి పరిస్థితుల్లోనూ  గుజరాత్ లా మారనివ్వబోమని మమత స్పష్టం చేశారు. ‘జై శ్రీరాం’ నినాదంతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే బెంగాల్ ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి బీజేపీ లీడర్లు ఈ నినాదాన్ని వాడుకోవడాన్నే తాను వ్యతిరేకిస్తున్నానని మమత చెప్పారు.

 

 

 

 

 

 

Latest Updates