ఒక్క రాముడి గుడి అయినా కట్టారా?: మోడీకి మమత ప్రశ్న

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై వాడివేడి చురకలు వేశారు. నిన్న విష్ణుపూర్ సభలో ఆమె పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఎప్పుడూ జై శ్రీరాం అంటూ ఉంటారు.. కానీ ఒక్క రాముడి గుడి అయినా కట్టలేకపోయారు అని విమర్శలు చేశారు మమత.

“ఓ బీజేపీ బాబు.. జై శ్రీరాం అని ప్రతిసారి అంటుంటావ్. ఒక్క రాముడి గుడి కూడా నిర్మించలేకపోయావ్. ఎన్నికలొచ్చినప్పుడల్లా రామచంద్రుడు మీ పార్టీకి పేటెంట్ ఏజెంట్ అయిపోతాడు. ఆయనే మీ ఎలక్షన్ ఏజెంట్ అంటుంటావు.  జై శ్రీరాం అంటావు.. అందరిచేతా బలవంతంగా అనిపించేలా ఒత్తిడి చేస్తావ్. నీకే రాముడిమీద ఆ చిత్తశుద్ధి లేదు” అని అన్నారు మమత బెనర్జీ.

ఇటీవల మమత బెనర్జీని ఉద్దేశించి మోడీ చేసిన విమర్శలకు ఇలా కౌంటర్ ఇచ్చారు బెంగాల్ సీఎం. జై శ్రీరాం.. జై శ్రీరాం నినాదాలు చేస్తూ… ఇటీవల మమత కాన్వాయ్ ను కొందరు అడ్డుకున్నారు. వారిలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇష్యూను ఝార్ గ్రామ్ బహిరంగ సభలో మోడీ ప్రస్తావించారు. “జై శ్రీరాం అన్నవారిని దీదీ జైల్లో పెట్టిస్తోంది. నేనూ అదే మాట అంటాను. నన్ను కూడా జైల్లో పెట్టనీ. అప్పుడు జైల్లో ఉన్నవారికి వెళ్లి సేవ చేసే అవకాశం కలుగుతుంది” అన్నారు. అక్కడే జై శ్రీరాం అని నినాదాలు చేశారు. జనంతో చేయించారు. ఇవి బాగా వైరల్ అయ్యాయి.

స్పందించిన మమత “దేవుడైన రాముడిని ఎలా గౌరవించాలో మాకు తెలుసు. జై శ్రీరాం అనాలని ఎవ్వరినీ బలవంతం చేయొద్దు. మేం జై హింద్ , వందేమాతరం నినాదాలు గర్వంగా చేస్తాం. బీజేపీ ఏది చెబితే అది నినదించాలని మాత్రం అనుకోం” అని మమత మోడీని ఉద్దేశించి అన్నారు.

Latest Updates