పసిపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్,బాబుల్ రెడ్డి నగర్ వెంకటేశ్వర కాలనీల్లో పసిపిల్లలే టార్గెట్ గా చేసుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన సుశీల్ కుమార్ సింగ్ అనే వ్యక్తి  కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా లో ఉన్న జైన్ ఫుడ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ అందులోనే ఉంటున్నాడు. శని ఆదివారాల్లో ఇతనికి సెలవు ఉండటంతో ఆ టైం లో కంపెనీ నుంచి బయటకు వచ్చి ఐదు నుంచి ఏడేళ్ల లోపు అమ్మాయిలకు చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి వారిపై అఘాయిత్యం చేసి తిరిగి కంపెనీలోకి వెళ్లిపోతుంటాడు.

మళ్లీ వారం రోజులు తర్వాత ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతూ..  తప్పించుకుంటున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. అందుకు కారణమైన వ్యక్తి ఆచూకీ ఆ పరిసర ప్రాంతాల్లో తెలియకపోవడంతో అతన్ని పట్టుకోవడం పోలీసులకు కష్టమైంది. నిందితుడు కంపెనీలో ఉండటం వలన అతన్ని గుర్తించేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వారు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల  పరిశీలించి అఘాయిత్యాలకు పాల్పడ్డ వ్యక్తి  సుశీల్ కుమార్ సింగ్ గా గుర్తించారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో పోలీసులు విచారణ చేపట్టారు.విచారణలో అతడు ఎక్కడెక్కడ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న పూర్తి వివరాలను పోలీసులకు వెల్లడించాడు. దీంతో అతనిపై 456,356  366, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అతని అకృత్యాలకు చాలామంది చిన్నారులు బాధితులయ్యారని పోలీసులు అన్నారు. చిన్నారుల బాధను చూసి తట్టుకోలేక, ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక,  తమ పరువు పోతుందని వారి  తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నట్టు పోలీసులు తెలిపారు.

Latest Updates