అయోధ్యపై ఫేస్‌బుక్‌లో రెచ్చగొట్టే పోస్ట్.. యువకుడి అరెస్టు

  • దేశ వ్యాప్తంగా వేల మందిపై కేసులు నమోదు

ఇండోర్: అయోద్య రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టు పెట్టాడని ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జితేంద్ర చౌహాన్ అనే యువకుడు ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం శనివారం నాడు అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వివాదస్పద 2.77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణానికి కేటాయించి, మసీదు కట్టడానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలో ఐదెకరాల భూమిని ఇవ్వాలని సుప్రీం తీర్పు వెల్లడించింది. దీన్ని అన్ని వర్గాలు స్వాగతించాయి.

అయోధ్య తీర్పు నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి హింస జరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా చానెళ్లు, పత్రికలతో పాటు సోషల్ మీడియాలోనూ రెచ్చగొట్టేలా కథనాలు వేయకూడదని అడ్వైజరీ జారీ చేసింది. బాబ్రీ మసీదును కూల్చిన నాటి ఫొటోలను సైతం వేయకూడదని ఆదేశాలిచ్చింది. తమ ఆదేశాలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలుతప్పవని హెచ్చరించింది కేంద్ర హోం శాఖ. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు దీనిపై సూచనలను పంపింది.

అయితే కేంద్రం హెచ్చరికలను అతిక్రమించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన చాలా మందిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 మందిపైనే అరెస్టు చేశారు. అలాగే దేశ వ్యాప్తంగా 8 వేల మందిపై కేసులు పెట్టారు.

 

Latest Updates