పోలీసులనే అమ్మాయి నంబర్ అడిగిన నెటిజన్

ఆకతాయి చేష్టలు ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ, పోలీసులతో కాదు. అలా కాదని నాలుగో సింహం జోలికెళ్తే.. పట్టపగలే చుక్కలు కనిపిస్తయ్!! ట్విట్టర్‌ వేదికగా ఓ నెటిజన్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. అసలు ఆ సీన్ ఏంటంటే..

పుణే పోలీసులు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ ప్రజలు ఏదైనా సాయం కోరితే వెంటనే రెస్పాండ్ అవుతుంటారు. ఇలా నిధి జోషి అనే ఓ యువతి ఆదివారం నాడు ట్విట్టర్‌లో ధనోరి ఏరియా పోలీస్ స్టేషన్ నంబర్ కావాలని పుణే పోలీస్ ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేసి అడిగింది. వెంటనే క్షణాల గ్యాప్‌లో పోలీసులు రెస్పాండ్ అయ్యారు. ఆమె ట్వీట్ కిందనే ఆ స్టేషన్ నంబర్‌ను రిప్లై  ఇచ్చారు.

పోలీసుల ట్విట్టర్ అకౌంట్ అని కూడా భయం లేకుండా ఓ ఆకతాయి పిచ్చి పనులకు దిగాడు. ఎవరో కూడా తెలియని అమ్మాయి నంబర్ అడగడం సభ్యత కాదన్న ఇంగితం లేకుండా ప్రవర్తించాడు అభిర్ చిక్డూ అనే నెటిజన్. ఆమె నంబర్ ఇస్తారా అంటూ పుణే పోలీసులను ట్యాగ్ చేస్తూ ఆ వెంటనే ట్వీట్ చేశాడు.

పోలీసుల స్వీట్ వార్నింగ్

ఆ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని వెంటనే అరెస్టు చేయాలంటూ ట్వీట్లు చేశారు. పోలీసులు కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు. తాగి డ్రైవింగే కాదు.. ట్వీట్లు కూడా చేయకూడదంటూ సరదా రిప్లై ఇచ్చారు. అలాగే ‘‘సర్, నీ నంబర్ తెలుసుకోవాలని మాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఆమె నంబర్ అడగడంలో నీ ఇంట్రెస్ట్ ఏంటో మేం తెలుసుకుంటాం. నువ్వు తాగి ఉన్నావు కావచ్చు. మేం ఇతరుల ప్రైవసీని గౌరవిస్తాం’’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

చితకబాదితే ఆనందిస్తాం

ఈ రెస్పాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. మంచి రిప్లై ఇచ్చారని, హ్యూమర్‌ని.. డ్యూటీని బాగా మేనేజ్ చేశారని ఓ నెటిజన్ అన్నాడు. ‘అతడో ఈవ్ టీజర్‌లా ఉన్నాడు. పోలీసుల ముందే ఇలా చేస్తున్నాడంటే.. ఇక మామూలుగా ఇంకెంతలా అసభ్యంగా ప్రవర్తిస్తాడో ఊహించుకోవచ్చు. మేము కూడా ప్రైవసీని గౌరవిస్తాం. కానీ, ఈ ఆకతాయిని జనమంతా కలిసి చితకబాదితే ఇంకా ఆనందిస్తాం’ అని ట్వీట్ చేశాడు ఒకతను. ఆ వ్యక్తి ప్రచారం కోరుకుంటున్నాడని, పట్టించుకోకుండా వదిలేస్తే మేలని మరొకరు కామెంట్ చేశారు.

 

Latest Updates