మార్ఫింగ్​ చేసి మనీ గుంజుతాడు

  • వాట్సాప్, ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ లు డౌన్ లోడ్
  • ఆపై పోర్న్ సైట్స్, డేటింగ్ యాప్స్ లో అప్ లోడ్
  • నిందితుడి వద్ద 300 మంది యువతుల ఫొటోలు
  • పోలీసుల అదుపులో మొబైల్ స్టోర్ ఉద్యోగి

హైదరాబాద్, వెలుగు: యువతుల ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి గుట్టు రట్టయింది. సోషల్ మీడియా అడ్డాగా ఓ మహిళను వేధిస్తున్న పాడి వినోద్ కుమార్ అలియాస్ సందీప్, ప్రవీణ్(25)ను సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సీసీఎస్ అదనపు డీసీపీ రఘువీర్ తెలిపిన వివరాల ప్రకారం.. వైజాగ్ కు చెందిన పాడి వినోద్ కుమార్ ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. ఆ తరువాత కొంత కాలం కంప్యూటర్ కోర్స్ చేశాడు. హార్డ్ వేర్ అండ్ నెట్ వర్కింగ్ నేర్చుకుని ప్రస్తుతం వైజాగ్​లోని ఒడాఫోన్​మొబైల్ స్టోర్ లో పని చేస్తు్న్నాడు. ఈ క్రమంలోనే అడ్రస్​ప్రూఫ్స్ లేకుండా సిమ్ కార్డులు కొనుగోలు చేశాడు. ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్, టీవీ ప్రోగ్రామ్స్ నుంచి యువతుల ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలను సేకరించాడు. ట్రూ కాలర్ లో మహిళల పేరుతో ఉన్న నంబర్లు గుర్తించాడు. దీంతో పాటు ఫేస్ బుక్, వాట్సాప్ డీపీల్లో ఉన్న యువతులు, మహిళల ఫొటోలను స్టోర్ చేసుకున్నాడు.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా బిల్డప్

మొదట తన వద్ద ఉన్న ఫోన్ నంబర్లకు వాట్సాప్ నుంచి మెసేజ్ పంపించేవాడు. అవతలి వ్యక్తులు స్పందించే వరకు పోస్టింగ్స్ చేసేవాడు. ఒకవేళ ఎవరైన మహిళ ఫోన్ చేస్తే తన పేరు సందీప్ అలియాస్ ప్రవీణ్ గా పరిచయం చేసుకునేవాడు. తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగినని నమ్మించేవాడు.  సీఐఎస్సీఓ, డెల్ కంపెనీల్లో సెక్యూరిటీ ఇంజినీర్ గా పని చేస్తున్నానని చెప్పేవాడు. తన ట్రాప్ లో పడ్డవారిని నమ్మించేందుకు dellsecurityengi@gmail.com, sandiocisco@gmail.com పేరుతో మెయిల్ ఐడీలు, ఫేస్ బుక్ ప్రొఫైల్ పోస్ట్ చేశాడు. ఇలా రకరకాల మొబైల్ యాప్స్ ఉపయోగించి తన వద్ద ఉన్న ఫోన్ నంబర్లు, ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడం ప్రారంభించాడు.

నెల నెలా పది వేలు వసూలు

ఇలా ఫొటోస్ మార్ఫింగ్ చేసి డేటింగ్ యాప్స్, పోర్న్ సైట్లలో ఫోన్ నంబర్ తో పాటు పోస్ట్ చేసేవాడు. అందుకోసం ఫేస్ బుక్, వాట్సాప్ నుంచి సుమారు 300 మంది అమ్మాయిల ఫొటోలను సేకరించాడు. ఇలా హైదరాబాద్ లోని ఓ యువతి ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడు. వాట్సాప్ చాటింగ్ ద్వారా పరిచయం చేసుకున్న వినోద్ కుమార్ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు ప్రతి నెల రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే తన దగ్గరున్న ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాతో పాటు పోర్న్ సైట్స్, డేటింగ్ యాప్స్ లో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. అంగీకరించకపోవడంతో యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ సైట్లలో పోస్ట్ చేశాడు. భయపడిన బాధిత యువతి జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రతి నెల రూ.10 వేల చొప్పున రూ.40 వేలు చెల్లించింది.

ఆ తరువాత యువతి ఫొటోలను సైట్స్ నుంచి వినోద్ కుమార్ తొలగించాడు. దీంతో ఏప్రిల్ నుంచి ఆమె డబ్బు ఇవ్వడం ఆపేసింది. తనకు రావాల్సిన డబ్బు నిలిచిపోవడంతో మళ్లీ మహిళ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో బాధితురాలు బ్లాక్ మెయిలర్ ను మరోసారి సంప్రదించింది. డబ్బు చెల్లిస్తానని చెప్పడంతో కొన్ని రోజుల తరువాత బాధిత యువతి ఫొటోలను సోషల్ సైట్ల నుంచి తొలగించాడు. అప్పటికే ఆ యువతి పోర్న్ సైట్స్, డేటింగ్ యాప్స్ లో ఉండడంతో ఆమెకు ఆకతాయిల ఫోన్స్ రావడం పెరిగిపోయాయి. విసిగిపోయిన బాధిత యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇలా దొరికాడు

బాధితురాలి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడు వినోద్ కుమార్ ను విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. నిందితుడు నాలుగు నెలలుగా ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నట్లు  సీసీఎస్ అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. ఇలాంటి బ్లాక్ మెయిలర్స్  చేతుల్లో పడకుండా ఉండాలంటే వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో  పోస్ట్ చేయకూడదని ఆయన సూచించారు. వినోద్ కుమార్ బారినపడిన వారి వివరాలు సేకరిస్తున్నామని  తెలిపారు.

Latest Updates