భార్యతో గొడవపడి.. చీరతో ఉరేసుకున్న భర్త

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయపాకల గ్రామానికి చెందిన జి.బోగురయ్య(30) బతుకుదెరువు కోసం 8 ఏండ్ల క్రితం భార్య పద్మ ఇద్దరు పిల్లలతో కలిసి సిటీకి వచ్చాడు. వీరు అంజయ్యనగర్ సంస్కృతి హోటల్ సమీపంలో ఉంటున్నారు. బోగురయ్య లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా ఏడాది కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

సోమవారం అంజయ్య నగర్లో ఉండగా.. బోగురయ్య భార్య పద్మ చెల్లెలి కుమార్తె నామకరణం ఫంక్షన్‌కు అతడు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాడు. మధ్యాహ్నం బోగురయ్య ఒక్కడే ఇంటికి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చి డోర్ కొట్టినా బోగురయ్య తెరవలేదు. లోపల నుంచి గడియపెట్టి ఉండటంతో పద్మ తన పిల్లలను తీసుకుని చెల్లెలి ఇంటికి వెళ్లిపోయింది.
మంగళవారం ఉదయం 6 గంటలకు పద్మ మళ్లీ ఇంటికి వచ్చి డోర్ కొట్టింది. ఎంతసేపటికీ బోగురయ్య తలుపు తీయకపోవడంతో అనుమానంతో కిటికీలో నుంచి చూసింది. బోగురయ్య చీరతో ఉరేసుకుని కనిపించాడు. వెంటనే పద్మ రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు అక్కడికి చేరుకుని డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియాక తరలించారు. మృతుడి తండ్రి ఆంజనేయులు ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ దేవేందర్ తెలిపారు.

Latest Updates