సచ్చినట్టు నటించి బతికిపోయిండు

అదో చిన్న ఊరు. పులి జొరబడింది. ఊరోళ్లను ఆగమాగం జేసి ఉరికిస్తంది. ఇంతలో ఒకడు కిందవడి దొరికిపోయిండు. పులి దగ్గరకొచ్చింది. గుండెలమీద పంజావెట్టింది. మామూలుగైతే ఇక పనైపోయిందనే అనుకోవాలె. పులి పంజా కిందున్నోడు అట్లనే అనుకన్నా కాస్త సోచాయించిండు. పై పానం పైన్నే పోతున్నా కాపాడుకోనింకె కాస్త తెలివిగా ఆలోచించిండు. సచ్చిపోయినట్టు నటించి బతికిపోయిండు. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో శనివారం జరిగిందీ సంఘటన. ఆ జిల్లాలోని తుస్మార్‌ అనే ఊర్లోకి పులి జొరబడి జనాన్ని భయపెట్టింది. దీంతో దాన్ని చంపడానికి జనాలు వెంటబడ్డారు. ఈ టైంలో ఆ పులి ఓ వ్యక్తి మీదికి దుంకింది. దాడి చేయబోయింది. సూస్తున్నోళ్లంతా వాడి పని అయిపోయిందనుకున్నారు. కానీ మనోడు చనిపోయినట్టు నేలపై పడిపోయిండు. పులి వచ్చి అతనిపై పంజా పెట్టి కాసేపు అట్లనే నిల్చొని ఉంది. అప్రమత్తమైన ఊరోళ్లు పులిపై రాళ్లేయడంతో అక్కడి నుంచి పారిపోయింది. మనోడు ఎలాంటి దెబ్బలు తగలకుండా బయటపడిపోయిండు. సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఒకరు ఈ వీడియోను షేర్‌ చేశారు. వెంటనే వైరలైపోయింది.

వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి

Latest Updates