సాయమందక 30 గంటలపాటు బావిలోనే గడిపిన వ్యక్తి

  • ప్రమాదవశాత్తూ బైకుతో సహా బావిలో పడ్డ వ్యక్తి
  • కేకలు వేసినా అందని సాయం.. పాములతో సావాసం

వరంగల్​, వెలుగు: చుట్టూ చిమ్మచీకటి. కింద నీళ్లు. చుట్టూ తిరుగుతున్న పాములు. కాపాడండి అని గొంతు చించుకు అరిచినా అందని సాయం. వెరసి 30 గంటలు బావిలోనే క్షణక్షణం గండంగా గడిపాడతడు. చివరకు ఆ బావి యజమాని, ఊళ్లో వాళ్లు వచ్చి తాళ్ల సాయంతో బయటకు తీయడంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు.

కరీంనగర్​ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన వజ్ర మురళి అనే వ్యక్తి గురువారం సాయంత్రం హన్మకొండ పరిమళకాలనీలో ఉన్న బంధువుల ఫంక్షన్​కు వెళ్లాడు. ఫంక్షన్​ తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు బైక్​పై బయల్దేరాడు. హసన్​పర్తి మండలం ముచ్చర్ల నాగారం వద్ద ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పక్కనే ఉన్న వ్యవసాయబావిలో అతడు పడిపోయాడు. ఏమైందో అర్థమయ్యే లోపు నీళ్లలో ఉన్నాడు. కాస్త తెల్లారక చూస్తే బావి అని అతడికి అర్థమైంది. బావిలోని మోటారుకు పెట్టిన పైపును పట్టుకుని గడిపాడు. సెల్​ఫోన్​ స్విచాఫ్​ అవడంతో సాయం కోసం ఇంట్లో వాళ్లకు చెప్పకుండా అయింది. పైన ఏదైనా అలికిడి అయితే అరిచాడు. అయినా ఎవరూ అటువైపు రాలేదు. అతడి చుట్టూ దాదాపు 20 దాకా పాములున్నాయి. దగ్గరకు వస్తుండడంతో చెట్ల కొమ్మలతో అదిలించి ప్రాణాలను కాపాడుకున్నాడు.

శనివారం పొద్దున ఎవరో డబ్బా మీద కొట్టినట్టు శబ్దం కావడంతో కాపాడండి అంటూ మురళి అరిచాడు. వెంటనే వచ్చిన భూమి యజమాని రాజిరెడ్డి ఊళ్లో వాళ్లను పిలిచి తాడు సాయంతో మురళిని బయటకు తీశాడు. అక్కడకు వచ్చిన వాళ్లలో తన ఊరి వాళ్లూ ఉండడంతో వారికి చెప్పి ఇంట్లో కబురు పెట్టించాడు. ముందు నుంచీ తనకు ధైర్యం ఎక్కువని, అందుకే 30 గంటలు బావిలో పడినా బెదిరిపోలేదని మురళి చెప్పాడు. పెద్దగా ఆకలి వేయలేదని, నాలుగైదు సార్లు నీళ్లు తాగే గడిపానని అతడు చెప్పాడు. అరుపులు వినిపిస్తుంటే ఎవరైనా పిచ్చోడై ఉంటాడనుకున్నానని ఆ బావి యజమాని రాజిరెడ్డి చెప్పాడు. స్టార్టర్​డబ్బా మీద కొట్టి చప్పుడు చేసినప్పుడు కాపాడండి సార్​ అని అరవడంతో వెంటనే ఊరోళ్లకు చెప్పి అతడిని పైకి తీసుకొచ్చామన్నారు.

Latest Updates