నటిని పెళ్లి చేసుకుంటానంటూ రచ్చ చేశాడు

సినిమా, టీవీల్లో నటించే నటీమణులపై అభిమానం పెంచుకోవడం కామన్. కానీ ఓ యువకుడు ఓ టీవీ నటిని సిన్సియర్ గా ప్రేమించాడు. ఆ నటిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ యువకుడు ఆమె ఇంటికి వెళ్లాడు. నటి తండ్రితో నానా రచ్చ చేశాడు. ఇద్దరి మధ్యన వివాదం చెలరేగడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

వివరాలు ఇలా ఉన్నాయి..

రాజారాణి తదితర టీవీ సీరియళ్లలో నటిస్తూ పాపులర్ అయిన నటి రితిక. ఈమె తన తండ్రితో కలిసి స్థానిక వడపళని,  మెట్రో రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది. గురువారం ఉదయం ఓ యువకుడు రితిక ఇంటికి వచ్చి కాలింగ్‌ బెల్‌ కొట్టాడు. నటి రితిక తండ్రి సుబ్రమణి వచ్చి తలుపు తీశాడు. ఆయనతో ఆ యవకుడు నటి రితిక అంటే తనకు ఇష్టం అని, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

అతడి మాటలకు దిగ్బ్రాంతికి గురైన రితిక తండ్రి తేరుకుని అతన్ని వెళ్లిపొమ్మాని చెప్పాడు. అయినా ఆయన మాటలను లెక్క చేయకుండా రితికను పెళ్లి చేసుకుంటానని గట్టిగా అరుస్తూ రచ్చ రచ్చ చేశాడు.  దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో నటి రితిక ఇంట్లోనే ఉంది. వారి గొడవ విని చుట్టు పక్కల వారు, ఇంటి సెక్యూరిటీ అక్కడకు చేరుకుని ఆ యువకుడిని వడపళని పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ ఆ యువకుడిని విచారించారు. విచారణలో ఆ యువకుడు గోపిశెట్టి పాలయంకు చెందిన భరత్‌ అని తెలిసింది. ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన భరత్‌ ఉద్యోగం కోసం చెన్నైకి వచ్చాడని, గురువారం ఇంటికి తిరిగి వెళ్లాల్సిన అతను నటి రితిక ఇంట్లోకి చొరబడ్డాడని తెలిసింది. విచారణలో తాను నటి రితికను సిన్సియర్ గా లవ్ చేస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నట్లు భరత్ చెప్పాడని తెలిపారు పోలీసులు. అయితే అతడు ఎవరో తనకు తెలియదని తెలిపిందట నటి రితిక.

Latest Updates