వారెవ్వా!: సింహం ముందు పోజులు.. సేఫ్ గా బయటకి..

ఏమైందీ సింహానికి.. ఎదురుగా మనిషి పోజులిస్తున్నా..

ఢిల్లీ: సింహం.. మృగరాజు! అడవిలో క్రూర మృగాలన్నింటికీ పెద్దన్నలాంటిది. గజరాజు ఏనుగునే తన పంజాతో కూల్చగల శక్తి దాని సొంతం. అలాంటి సింహానికి మనిషి ఎదురుపడితే.. మీదపడి మింగేయదా? దాని గర్జనకే వాడి గుండె ఆగిపోదా?! ఒక్క వేటుకే ప్రాణం ప్రాణం పోవడం ఖాయం కదా!

కానీ, సింహం ఎదుట మనిషి దర్జాగా నిలబడి దాన్ని ఎగాదిగా చూశాడు! దాని ముందు కాలిమీద కాలేసుకుని కూర్చున్నాడు. నువ్వు మృగరాజువైతే నాకేంటి అన్నట్టు.. శేషతల్పంపై విష్ణువులా అలా తలవాల్చాడు. దాని ఎదుట ఫొటోలకు పోజులిచ్చినట్టు.. రకరకాల స్టైల్స్ లో అలా అలా తిరిగాడాడు. జేబులోంచి ఫోన్ తీసి అలా కూర్చున్నాడు.

నమ్మబుద్ధి కావడం లేదా? ఇదంతా నిజంగా నిజం! అయితే అడవిలో కాదులెండీ.. దేశ రాజధాని ఢిల్లీలోని నేషనల్ జూ పార్క్ లో జరిగిందీ ఘటన. రెహాన్ ఖాన్ (28) అనే యువకుడు ఇనుప కంచె దాటి సింహం బోనులోకెళ్లాడు. అలా దాని ముందు కాసేపు ఏవో వేషాలేశాడు.

ఎదురుగానే ఉన్నా సింహం అతడిని  ఏమీ చేయలేదు. చూస్తూ ఉండిపోయింది. తీరా కూర్చుని దాని ముందు మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకున్న సమయంలో సింహం బాగా దగ్గరకెళ్లింది. ముఖంలో ముఖం పెట్టి చూసేసరికి గుండె జళ్లుమన్నదో ఏమో.. అప్పటిదాకా ఏ బెరుకూ లేకుండా ఉన్నవాడు ఒక్కసారిగా లేచి రెండడుగులు వెనక్కి వేశాడు. ఈలోపే అతడి సింహం బోన్ లోకి వెళ్లిన అతడిని చూసి జూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎంతో చాకచక్యంగా చిన్న గాయం కూడా లేకుండా బయటకు తీసుకొచ్చారు.

చావడానికెళ్తున్నా.. కాపాడొద్దు

రెహాన్ ఖాన్ ఇనుప కంచె దూకి సింహం బోనులోకి దూకినప్పుడే తమ సిబ్బంది చూశారని జూ పార్క్ పీఆర్వో రియాజ్ అహ్మద్ ఖాన్ చెప్పారు. అతడిని ఆపే ప్రయత్నం చేసినా.. వినకుండా సింహం దగ్గరకు వెళ్లిపోయాడన్నారు. కంచె దగ్గరే నిచ్చెన ఇచ్చి.. వెనక్కి రావాలని పిలిచినా వెనక్కి రాలేదని చెప్పారు. ‘నేను చావడానికే వచ్చా.. నన్ను కాపాడొద్దు’ అని చెబుతూ రెహాన్ పరుగుపెట్టాడని ఆయన తెలిపారు. చివరికి సింహానికి మత్తు ఇంజెక్షన్ చెసి.. అతడిని కాపాడాల్సి వచ్చిందన్నారు.

మతిస్థిమితం లేదు

రెహాన్ ఖాన్ ను బిహార్ కు చెందిన వాడిగా గుర్తించారు పోలీసులు. అతడిని ఏ మాత్రం గాయాలు లేకుండా సురక్షితంగా కాపాడామని ఢిల్లీ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చెప్పారు. అతడు మానసిక స్థితి సరిగాలేదని తెలిపారు.

సింహం సహజ స్వభావం పోయిందా?

ఎంతటి పదునైన కత్తినైనా రెగ్యులర్ గా వాడుతుంటేనే.. వాడిగా తెగుతుంది. పక్కన పడేస్తే తుప్పుపట్టి.. ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఈ సింహం విషయంలో కూడా అలానే జరిగిందా? జూలో ఉండి దాని క్రూరత్వం కోల్పోవడం వల్లే ఆ మనిషి క్షేమంగా భయటపడ్డాడా? అంటే నిపుణులు అవుననే అంటున్నారు.

సింహం సహజ స్వభావం వేట. దానికి కావాల్సిన ఆహారాన్ని పంజా విసిరి.. చంపి తినడం దాని గుణం. కానీ ఈ ఘటన చూస్తే.. జూలో పెట్టడంతో మృగరాజు దాని అలవాటును పూర్తిగా మర్చిపోయిందా? అక్కడే దానికి రోజూ కొంత మాంసాన్ని అందిస్తుండడంతో చాలీచాలక కడుపు మాడి క్రూరత్వం చచ్చిపోయిందా అని అనుమానం వస్తోంది. అయితే ఆకలి లేకుండా సింహం ఎటువంటి జంతువు దాని ఎదుట తిరిగినా వేటాడదని సీనియర్ క్యూరేటర్లు చెబుతున్నారు. జూలో ఉండడం వల్ల కూడా కొంత వేగంగా స్పందించే గుణం తగ్గి ఉండొచ్చని తెలిపారు.

Latest Updates