యూపీలో దారుణం.. పోలీస్ స్టేష‌న్‌లోనే పార‌తో దాడి, వ్యక్తి మృతి

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జ‌రిగింది . ప్రతాప్ గడ్ జిల్లా‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఓ నిందితుడు మరో నిందితుడిపై దాడి చేయ‌డంతో అత‌ను అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. చేతిలో ఉన్న పారతో విచక్షణా రహితంగా దాడిచేయ‌డంతో ఆ వ్యక్తి గాయాల‌తో విలవిలాడుతూ మ‌ర‌ణించాడు.

పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ సింగ్ తెలిపిన వివరాల ప్ర‌కారం… మిథాయిలాల్ (50) అనే వ్య‌క్తిని ఓ వివాదం కేసులో రాణిగంజ్ పోలీస్ స్టేషన్‌లో క‌స్ట‌డీలో ఉంచారు. శ‌నివారం రాత్రి ఇంద్రపాల్ అనే మ‌రో వ్య‌క్తిని కూడా అదే పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఇంద్రపాల్ మిథాయిలాల్ తో గొడ‌వ ప‌డి అత‌నిపై పారతో దాడి చేశాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన మిథాయిలాల్ ను చికిత్స నిమిత్తం పోలీసులు తొలుత కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు , ఆ తరువాత జిల్లా ఆసుపత్రికి, తరువాత ప్రయాగరాజ్‌కు తీసుకెళ్లారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మిథాయిలాల్ అక్క‌డే మృతి చెందాడ‌ని” ఎస్పీ చెప్పారు.

అయితే ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి ఇంద్ర‌పాల్‌కి మతిస్థిమితం సరిగా లేదని స‌మాచారం. పోలీసుల ముందే ఈ దారుణం జరగడంతో దాడి ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. హెడ్ ​​కానిస్టేబుళ్లు రాజిత్రమ్ గుప్తా, రాకేశ్ కుమార్, కానిస్టేబుల్ శుభం ఖార్వార్ ల‌ను సస్పెండ్ చేశారు. ఈ కేసుపై రాణిగంజ్ సర్కిల్ ఆఫీసర్ అతుల్ అంజన్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ మృత్యుంజయ్ మిశ్రా లు దర్యాప్తు చేయాలని అధికారులు ఆదేశించారు.

Latest Updates