దొంగిలించిన పాత బైక్ తో వచ్చాడు.. కాస్ట్లీ బైక్ కొట్టేశాడు

అహ్మదాబాద్ : బైక్ షోరూం నిర్వాహకులకు ఊహించని ఝలక్ ఇచ్చాడు ఓ వ్యక్తి. రూ. లక్షకు పైగా విలువ చేసే స్పోర్ట్స్ బైక్ కావాలంటూ ఓ వ్యక్తి(30) కొట్టేసిన బైక్ తో షోరూంకి వచ్చాడు. టెస్ట్ డ్రైవింగ్ చేస్తానంటూ వెళ్లి తిరిగి రాలేదు. ఈ సంఘటన నవంబర్-20న అహ్మదాబాద్ లో జరిగింది.

అహ్మదాబాద్ లోని చంద్ ఖేడా ప్రాంతంలో ఉన్న బైక్ షోరూంకి అంతకుముందే దొంగిలించిన పాత బైక్ తో వచ్చాడు ఈ ఘరానా మోసగాడు. కాస్ట్లీ బైక్ కొంటానని షోరూం నిర్వాహకులను నమ్మించాడు. ఖరీదైన స్పోర్ట్స్ బైక్ ను టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పాడు. తన పాత బైక్ షోరూం పార్కింగ్ ప్లేస్ లోనే ఉండటం తో సిబ్బందికి కూడా నమ్మకం కలిగింది. ఏంచక్క బైక్ స్టార్ట్ చేసి దొంగ చేతికి బండిచ్చారు షోరూం సిబ్బంది. ఇంకేముంది..టెస్ట్ డ్రైవ్ కోసం వెళ్లిన అతడు అరగంటైనా తిరిగి రాలేదు.

మోసపోయామని తెలుసుకున్న నిర్వాహకులు పార్కింగ్ చేసిన బైక్ నంబర్ ఆధారాలతో పోలీసులకు పిర్యాదు చేశారు. దర్యాప్తులో అతడు పార్కింగ్ చేసిన బైక్ కూడా దొంగిలించినదే అని తేలటంతో షాక్ అయ్యారు నిర్వాహకులు. సీసీటీవీ పుటేజీ అధారంగా దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. అయితే టెస్టింగ్ బైక్ కావాడంతో నంబర్ లేదని.. దొరకడం చాలా కష్టమని పోలీసులు చెప్పినట్లు తెలిపారు షోరూం నిర్వహకులు.

Latest Updates