భార్యకు శీలపరీక్ష…మరుగుతున్న నూనెలో

సాంకేతికంగా అన్ని రంగాల్లో దూస్కెళ్తున్న ఈ రోజుల్లో కూడా కొందరు ఇంకా మూఢనమ్మకాలనే పాటిస్తూ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఓ ఘటన మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో జరిగింది. తన భార్యను శీలవతిగా నిరూపించుకోవాలంటూ అగ్ని పరీక్ష పెట్టాడో ఓ భర్త. సల సల కాగే నూనెలో చేతులు పెట్టించాడు. అంతేకాదు భార్యను పరీక్ష చేస్తూ దాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. అది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫిబ్రవరి 11వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్తపై కోపంతో భార్య ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లింది. కారు డ్రైవరైన భర్త నాలుగు రోజుల పాటు ఆమె కోసం గాలించాడు. ఎంతకీ భార్య ఆచూకీ లభించలేదు. ఐదో రోజు భార్య ఫోన్‌ చేసి ఇంటికి వచ్చింది. అయితే ఇంటికొచ్చిన భార్యను ఎక్కడకు వెళ్లావని భర్త ప్రశ్నించగా.. ఆ నాలుగు రోజులు ఏం జరిగిందో చెప్పింది.

కచాపురి చౌక్‌లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తనను బలవంతంగా తీసుకెళ్లిపోయారని భార్య చెప్పింది. తీసుకెళ్లిన వారు నాలుగు రోజులు తమ దగ్గరే ఉంచుకున్నారని..అయితే తనను వాళ్లు ఏమీ చేయలేదని భర్తకు చెప్పింది. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకుని ఇంటికొచ్చా అని చెప్పింది.భార్య చెప్పిన విషయాలను భర్త నమ్మలేదు. దీంతో తమ కమ్యునిటీ సంప్రదాయం…పర్ది ప్రకారం భార్య శీలాన్ని పరీక్షించాలని నిర్ణయించాడు. దీంతో సలసల కాగే నూనెలో ఐదు రూపాయల కాయిన్ వేసి దాన్ని చేతితో తీయాలని అన్నాడు.

మరుగుతున్న నూనెలో వేసిన కాయిన్ చేతితో తీయడంతో భార్యకు చేతికి గాయాలయ్యాయి. అతడి తీరుపై మహిళా సంఘాలతో సామాజికవేత్తలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Latest Updates