దళిత యువతితో ప్రేమ పెళ్లి.. ఉద్యోగం నుంచి తీసేసిన ఆలయ కమిటీ

దళిత యువతితో ప్రేమ పెళ్లి.. ఉద్యోగం నుంచి తీసేసిన ఆలయ కమిటీ

దళిత యువతిని పెళ్లాడినందుకు ఓ వ్యక్తిని ఉద్యోగం నుంచి తీసేశారు. ఈ ఘటన హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివారల్లోకి వెళ్తే.. నక్కా యాదగిరి గౌడ్ అనే వ్యక్తి 14 ఏళ్లుగగా వనస్థలిపురం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదం కౌౌంటర్లో పనిచేస్తున్నాడు. ఆయన ఆలయంలోనే ఓ గదిలో ఉంటున్నాడు. రెండు నెలల క్రితం యాదగిరి గౌడ్ ప్రేమలత అనే దళిత యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ ఛైర్మన్ లక్ష్మయ్య, నిర్వాహకులు యాదగిరిని ఉద్యోగంలో నుంచి తీసేశారు. తన భర్తను విధుల్లో నుంచి తీసేయోద్దని శనివారం ప్రేమలత లక్ష్మయ్య ఇంటికి వెళ్లి కోరింది.దీంతో ఆయన ప్రేమలతను కులం పేరుతో దూషించినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. 

ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, చిరంజీవి, మేనేజర్ శ్రీహరి తమ అనుచరులతో కలిసి ఆలయంలో యాదగిరి ఉంటున్న గది తాళాలు కూడా పగుల కొట్టారు. గదిలో ఉన్న సామాన్లను బయట పడేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదుకు నిరాకరించారన్నారు. అయితే విషయం బయటకు తెలియడంతో... నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారన్నారు.