లాక్ డౌన్ లో కారుకు MLA స్టిక్క‌ర్ అంటించి సిటీలో హ‌ల్ చ‌ల్

క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను అక‌తాయిలు ఇష్టానుసారం ఉల్లంఘిస్తున్నారు. ఏ ప‌నీ లేకున్నా బ‌య‌ట‌కు వ‌చ్చి పిచ్చి పిచ్చి కార‌ణాలు చెబుతూ పోలీసుల‌కు విసుగు తెప్పిస్తున్నారు కొంద‌రు. దీంతో ఇలా అన‌వ‌స‌రంగా బ‌య‌ట‌కు వ‌చ్చే వారిని ప‌ట్టుకుని కేసులు పెడుతున్నారు. అయితే ఓ 54 ఏళ్ల వ్యాపార‌వేత్త పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి కారుకు MLA స్టిక్క‌ర్ అంటించుకుని చ‌క్క‌ర్లు కొట్టాడు ఓ వ్య‌క్తి. తెలివిగా బ‌య‌ట‌కు వ‌చ్చి జాలీగా షికార్లు కొడుతున్న అత‌డి ఆట‌లు పోలీసులు సాగ‌నివ్వ‌లేదు. MLA అయినా స‌రే లాక్ డౌన్ లో ఇష్టానుసారం తిర‌గ‌డానికి లేదంటూ కారును ఆపారు. తీరా అస‌లు ఆ వ్య‌క్తి అంటించిన స్టిక్క‌ర్ ఫేక్ అని తేల‌డంతో కేసులు పెట్టారు. మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

కొడుకుతో క‌లిసి సిటీలో షికార్లు..

లాక్ డౌన్ లో బోర్ కొడుతోంద‌ని బుధ‌వారం సాయంత్రం క‌మ‌లేశ్ షా (54) అనేవ్యాపార‌వేత్త‌, త‌న కొడుకుతో క‌లిసి కారులో షికారుకెళ్లారు. MLA అంటే ఎవ‌రూ ఆప‌ర‌నుకుని ఓ ఫేక్ స్టిక్క‌ర్ ను అంటించుకుని బ‌య‌లుదేరారు. మ‌హేశ్వ‌రి ఉద్యాన్ ప్రాంతంలో తిరుగుతుండ‌గా ముంబై పోలీసులు ఆ కారును ఆపారు. ఏ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ఏంట‌న్న విష‌యాల‌ను ప్ర‌శ్నించ‌గా.. వాళ్లు త‌డ‌బ‌డ్డారు. దీంతో అనుమానం వ‌చ్చి గ‌ట్టిగా నిల‌దీయ‌డంతో ఫేక్ స్టిక్క‌ర్ అని, ఫ్రీగా బ‌య‌ట తిర‌గొచ్చ‌ని వ‌చ్చినట్లు చెప్పారు. దీంతో వారిపై ఫోర్జ‌రీ, ప‌బ్లిక్ సర్వెంట్స్ ని మోసం చేయ‌డం వంటి ఆరోప‌ణ‌లతో పాటు ఎపిడ‌మిక్ డిసీజ్ యాక్ట్ కింద కేసులు పెట్టామ‌ని పోలీసులు చెప్పారు.

Latest Updates