బాంద్రా ఆందోళనలకు కారణమైన వ్యక్తి అరెస్ట్‌

  • నవీముంబైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • 1000 మంది కూలీలపై ఎఫ్‌ఐఆర్‌‌

ముంబై: బాంద్రా స్టేషన్‌కు వేలాది మంది వలస కూలీలు తరలివచ్చేలా పుకార్లు సృష్టించిన కార్మిక నాయకుడు వినయ్‌ దుబేను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్‌ మీడియాలో ‘‘చలో ఘర్‌‌ కి ఒరే” (ఇళ్లకు వెళ్లాం) అంటూ పోస్టులు పెట్టడంతో దాన్ని చూసిన వలస కార్మికులు వేలాదిగా తరలివచ్చారని పోలీసులు చెప్పారు. వినయ్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో‌ పోస్టులు పెట్టడంతో అవి చూసి బాంద్రాకు వచ్చారా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ‘ఉత్తర్‌‌ భారతీయ మహా పంచాయత్‌’ అనే ఎన్‌జీవో నడుపుతున్న వినయ్‌ దుబే మహారాష్ట్రలో పనిచేసే వలస కార్మికుల తరఫున పోరాడుతూ ఉంటారు. కాగా.. ఈమధ్య కాలంలో ఆయన మాట్లాడిన వీడియో మంగళవారం బాగా వైరల్‌ అయింది. “ లాక్‌డౌన్‌ పెంచితే ఉత్తర్‌‌ప్రదేశ్‌, బీహార్‌‌, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌కు రాష్ట్ర ప్రభుత్వం రైళ్లు పెట్టాలి. కావాలంటే మేం అక్కడికి వెళ్లిన తర్వాత క్వారంటైన్‌లో ఉండేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కరోనాతో కాదు.. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం. ఏప్రిల్‌ 14 వరకు వెయిట్‌ చేస్తాం. ఆ తర్వాత కాలినడకన మా ఊళ్లకు వెళ్తాం” అని వీడియోలో హెచ్చరించారు. దీంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని, లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించలేదనే నేరంపై కేసు పెట్టినట్లు అధికారులు చెప్పారు. మహారాష్ట్రలోని ముంబై, థానేలో వలస కూలీలు మంగళవారం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. ఉత్తర్‌‌ ప్రదేశ్‌, బీహార్‌‌, పశ్చిమబెంగాల్‌కు వెళ్లేందుకు ట్రైన్లు నడపాలని డిమాండ్‌ చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు వాళ్లపై లాఠీ చార్జ్‌ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారని 1000 మంది వలస కూలీలపై కేసు నమోదు చేశారు.

Latest Updates