జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీన్ రివర్స్

  • విద్యాసంస్థల మేనేజ్​మెంట్లు సర్కారువైపు..
  • సిబ్బంది ప్రతిపక్షాల వైపు

హైదరాబాద్, వెలుగు: ప్రతి సంస్థలో మేనేజ్మెంట్లు ఎటు సపోర్టు చేస్తే.. దాదాపు ఉద్యోగులూ అటువైపే ఉంటారు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. ప్రైవేటు స్కూల్స్, కాలేజీల మేనేజ్మెంట్లన్నీ సర్కారుకు మద్దతుగా నిలిస్తే.. వాటిల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మాత్రం ప్రతిపక్షాలకు మద్దతిస్తున్నారు. అయితే మేనేజ్మెంట్లు బహిరంగంగా టీఆర్ఎస్​కు మద్దతుగా ప్రచారం సాగిస్తుండగా.. సిబ్బంది మాత్రం కొందరు బహిరంగంగా, మరికొందరు ఇంటర్నల్​గా సర్కారుకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నరు.

మేనేజ్మెంట్లను మచ్చిక చేసుకుంటున్న సర్కారు

జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 4,500 ప్రైవేటు స్కూళ్లుండగా, 2 వేల వరకు కాలేజీలున్నాయి. వీటిల్లో సుమారు లక్షన్నర వరకూ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్​తో ఇప్పటికీ విద్యాసంస్థలు ఓపెన్ కాలేదు. ప్రైవేటు మేనేజ్మెంట్లన్నీ ఆన్​లైన్​లో బోధన సాగిస్తున్నాయి. ఈ క్రమంలో టీచర్లను, సిబ్బందిని విధుల్లోకి తీసుకోలేదు. కొద్దిమందినే తీసుకుని, వారితో ఆన్​లైన్​పాఠాలు చెప్పిస్తున్నారు. దీంతో వేల మందికి ఉపాధి లేకుండా పోయింది. ఆన్ లైన్ పాఠాలు చెబుతున్నవారికీ సగమే జీతం ఇస్తున్నరు. అయితే లాక్​డౌన్ సమయంలో సిబ్బందిని తీసివేయవద్దనీ, జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం జీవో నెంబర్ 45 ఇచ్చింది. మేనేజ్మెంట్లు దీన్ని ఎక్కడా అమలు చేయలేదు. జీవో అమలు చేయాలని ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు, సిబ్బంది ఆందోళనలు చేసినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో వారిలో సర్కారుపై వ్యతిరేకత మొదలైంది. మరోపక్క ప్రైవేటు విద్యాసంస్థలను మచ్చిక చేసుకునేందుకు సర్కారు ఇప్పటికే వారికి పలు హామీలిచ్చింది. ఇంటర్ కాలేజీల మాదిరిగానే ప్రైవేటు స్కూళ్లకు ఫైర్ ఎన్ఓసీ మినహాయింపులు ఇస్తామనీ, కరెంట్ బిల్లుల కేటగిరిలో మార్పులు చేస్తామని హామీనిచ్చింది. మిక్స్ డ్ ఆక్యుపెన్సీ బిల్డింగుల్లో కొనసాగుతున్న ప్రైవేటు జూనియర్ కాలేజీలకూ మినహాయింపు ఇస్తూ నేడో, రేపో అధికారికంగా సర్కారుకు ఉత్తర్వులివ్వనుంది. నెలన్నర రోజుల వ్యవధిలోనే రెండుసార్లు మేనేజ్మెంట్లతో మంత్రి కేటీఆర్​ సమావేశం కావడం గమనార్హం.

Latest Updates