KCR కావాలనే దళితులను అవమానిస్తున్నారు:మందకృష్ణ

పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహ ధ్వంసానికి వ్యతిరేకంగా.. ఇందిరాపార్క్ దగ్గర MRPS నిర్వహించాలనుకున్న దీక్షకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. శాంతి భద్రతల సమస్య పేరుతో పోలీసులు నిరసనకు అనుమతించలేదు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను హౌజ్ అరెస్ట్ చేశారు. నగరంలోని అన్ని అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన తెలపాలని.. ఈనెల 22 వరకు ఈ నిరసనలు కొనసాగించాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిరసనలకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ , కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మద్దతు ఇచ్చారు. మందకృష్ణ మాదిగను ఆయన ఇంటిలో కలిసి తమ సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మందకృష్ణ మాదిగ… సీఎం కేసీఆర్ కావాలనే దళితులను అవమానిస్తున్నారని అన్నారు. ఐదేళ్లు గడుస్తున్నా కేసీఆర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనలేదన్నారు. కనీసం ఎర్రవల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి కూడా నివాళులు అర్పించలేదని విమర్శించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పిన కేసీఆర్.. ఆ ఊసే ఎత్తరు కానీ.. తాము పెట్టుకున్న విగ్రహాలను మాత్రం విరగ్గొట్టి డంపింగ్ యార్డులో పడెయ్యొచ్చా అని ప్రశ్నించారు మందకృష్ణ.

“అంబేద్కర్ మాకు దేవుడితో సమానం. నిరసన తెలుపుతాం అంటే హౌజ్ అరెస్ట్ చేయడం ఏంటి? తెలంగాణ ఉద్యమంలో ఎమ్మార్పీఎస్ కీలక పాత్ర పోషించింది. మమ్మల్ని శత్రువులుగా చూడొద్దు. మా పోరాటాలన్నీ ప్రజలకోసమే” అన్నారు మందకృష్ణ.

Latest Updates