అన్ని ఉద్యోగ సంఘాలు అర్టీసీ కార్మికులకు మద్ధతివ్వాలి: మందకృష్ణ

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై  ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు జేఏసీ నేతలు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. అన్ని పక్షాలు కలిసి కార్యాచరణపై మాట్లాడామన్నారు. శుక్రవారం వినతిపత్రాన్ని సమర్పించడం జరుగుతుందని, శనివారం మౌన ప్రదర్శన చేయాలని నిర్ణయించామని తెలిపారు. తదుపరి కార్యాచరణను ఆదివారం ప్రకటిస్తామని చెప్పారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పౌరసమాజం అండగా ఉండాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మద్దతివ్వాలని తెలిపారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు.. టీఎన్జీవో.. టీజీవోల నుంచి ఈ సమ్మెపై స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ సమ్మెలో భాగస్వామ్యం కాకపోతే తోటి కార్మికులకు వెన్నుపోటు పొడవడమేనని, ఉధ్యమంలో భాగస్వాములు కాకపోతే చరిత్ర హీనులుగా మిగిలి పోతారన్నారు. ఉద్యోగ సంఘాలు పోరాటానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఆర్టీసీ ని పరిరక్షించుకోవాలని కార్మికులు చూస్తుంటే.. అమ్ముకోవాలని ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారని మందకృష్ణ అన్నారు. ఆర్టీసీ ప్రభుత్వం లో విలీనం అయితే ఆస్థులను అమ్ముకునే అవకాశం ఉండదనే విలీనం చేసేందుకు ఒప్పుకోవడం లేదన్నారు.  ప్రజలు అద్దె వాహనాల్లో తిరుగుతుంటే.. నాయకులు మాత్రం ప్రజాధనంతో కొత్తవాహనాల్లో తిరుగుతున్నారన్నారు. నిబద్దతతో పోరాటం చేస్తున్న కార్మికులకు ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని ఆయన అన్నారు.

ఆర్టీసీ జేఏసీ తీసుకునే కార్యాచరణకు మద్దతు ఇస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి అన్నారు.

ఆర్టీసీ ని బ్రతికించుకునేందుకు అందరూ ఈ పోరాటానికి సిద్దం కావాలని విమలక్క అన్నారు. అరుణోదయ సాంస్కృతిక శాఖ ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతిస్తుందని తెలిపారు.

Latest Updates