కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన ఘనత కార్మిక లోకానిదే

  • ఆర్టీసీ ఆస్తులను అమ్మాలన్నదే కేసీఆర్ లక్ష్యం
  • కార్మికులపై కాల్పులు జరపాలనుకున్నాడు
  • 100 ఏళ్ల క్రితం నాటి  కెనడా ఫార్మూలాను అమలు చేయాలనుకున్నాడు
  • ఓటమి దిశగా కేసీఆర్ , గెలుపు దిశగా కార్మికులున్నారు: మందకృష్ణ 

మహబూబ్ నగర్:  సమ్మె మొదలైన నాటి నుంచి ప్రతి సందర్భంలోనూ కోర్టు కార్మికుల పక్షానే నిలబడిందని, కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన ఘనత కార్మిక లోకానిదేనని మందకృష్ణ మాదిగ అన్నారు. కోర్టు హెచ్చరికల చివరి రూపమే సీఎస్ ను , ఆర్టీసీ ఎండీని, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిని బోనులో నిలబెట్టిందని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడిన మందకృష్ణ .. రాజకీయ పార్టీలను, ప్రజలను ఆర్టీసీ కార్మికుల నుంచి దూరం చేయాలని సీఎం కేసీఆర్ కుట్ర చేశాడని, కానీ ఆ విషయంలో విజయం సాధించలేకపోయాడన్నారు. అవసరమైతే కొంత మంది కార్మికులపై ఛలో సరూర్ నగర్ సందర్భంలో వారిపై కాల్పులు జరిపి ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని కూడా భావించాడన్నారు.

ఆర్టీసీని, ఆర్టీసీ ఆస్తులను అమ్మాలన్నదే కేసీఆర్ లక్ష్యమని, ఆర్టీసీని నామరూపాలు లేకుండా చేయాలన్నదే అతని కల అని మందకృష్ణ అన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించిన మొదటి రోజే సీఎం కేసీఆర్ సెల్ప్ డిస్మిస్ అన్నాడన్నారు. 100 ఏళ్ల క్రితం అమలైన  కెనడా ఫార్మూలాను తెలంగాణలో అమలు చేయాలని కేసీఆర్ కుట్ర పన్నాడన్నారు.

” కేసీఆర్ కు, ఆయన భజన పరులకు నిన్నటి వరకు తమ అక్రమ సంపాదనకు కాళేశ్వరం కేరాఫ్ అయ్యింది. ఇపుడు కాళేశ్వరంపై కేంద్రం కన్నేయటంతో కేసీఆర్ దృష్టి ఆర్టీసీపై పడింది.ఆర్టీసీని విలీనం చేస్తే… మిగతా కార్పోరేషన్ల నుంచి డిమాండ్లు వస్తాయని కేసీఆర్ కొత్త వాదన లేవనెత్తాడు. ఆర్టీసీ పుట్టుకతోనే ప్రభుత్వ రంగం. మిగతా 90 కార్పోరేషన్లతో ఆర్టీసీకి సంబంధం లేదు.  లోటు బడ్జెట్ ఉన్న ఏపీ ఆర్టీసీని విలీనం చేస్తే… మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఎందుకు చేయలేకపోతుంది?” అని ప్రశ్నించారు మందకృష్ణ.

“ఆర్టీసీ జేఏసీ సమాజం మద్దతును కూడగట్టుకుంది. సమస్యలు పరిష్కరించే వరకు కార్మికులు వెనక్కి తగ్గొద్దు. ఆత్మహత్య చేసుకోవద్దు. టీఎన్జీవో నాయకులు – ఆర్టీసీ జేఏసీకి అండగా నిలవాలి కాని,  కేసీఆర్ కు వంతపాడి ఆర్టీసీ కార్మికులను వెన్నుపోటు పొడవద్దు. ఓటమి దిశగా కేసీఆర్ , గెలుపు దిశగా కార్మికులున్నారు.  ప్రజలు కూడా ఆర్టీసీని కాపాడేది కార్మికులేనని భావిస్తున్నారు.” అని మందకృష్ణ అన్నారు.

Mandakrishna comments on court proceedings on case of RTC strike

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి

Latest Updates