ప్రాపర్టీకీ ఆధార్ లింక్..?

న్యూఢిల్లీస్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాల్లో అక్రమాలను, అవినీతిని అరికట్టడానికి మోడీ ప్రభుత్వం ఆస్తులను ఆధార్‌‌తో లింక్‌‌ చేసే విధానాన్ని తీసుకొస్తుందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో కేంద్రం తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందనేది తాజా సమాచారం. ఈ రూల్‌‌ను అమలు చేస్తే నల్లధనం, మనీలాండరింగ్‌‌పై ప్రభుత్వం సర్జికల్‌‌ స్ట్రైక్‌‌ చేసినట్టేనని ఆర్థికరంగ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్లాక్‌‌మనీని వెలికితీయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రియల్‌‌ ఎస్టేట్‌‌ రంగంలో బినామీ లావాదేవీలను అడ్డుకునేందుకు చట్టం తెస్తుందని అధికారవర్గాలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి. బ్లాక్‌‌మనీ రియల్‌‌ ఎస్టేట్‌‌రంగంలోకి రావడం తగ్గడం వల్ల ఆస్తుల ధరలు తగ్గాయి కానీ ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడానికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి. ఆస్తుల ధరలు తగ్గడం వల్ల బ్లాక్‌‌మనీ పోగవడమూ తగ్గింది. సామాన్యులూ స్థిరాస్తులను కొనగలుగుతున్నారు. 2022 నాటికి అందరికీ గృహవసతిని అందుబాటులోకి తేవాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

ముగింపు దశకు డ్రాఫ్ట్ తయారీ..

రియల్‌‌ ఎస్టేట్‌‌ రంగంలో బినామీ లావాదేవీలను, బ్లాక్‌‌ మనీ చెలామణిని అడ్డుకోవడానికి ఆస్తులను ఆధార్‌‌ సంఖ్యకు లింక్‌‌ చేసేందుకు ఉద్దేశించిన ప్రత్యేక బిల్లు డ్రాఫ్ట్‌‌ తయారీ ముగింపుదశకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖవర్గాలు తెలిపాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే రియల్‌‌ ఎస్టేట్‌‌ లావాదేవీల్లో అవినీతి తగ్గుతుంది. పారదర్శకత పెరుగుతుంది. ఆస్తుల కొనుగోలుకు వైట్‌‌మనీయే కావాల్సినందున వాటి ధరలు సహజంగానే తగ్గుతాయి. ఎక్కువ ఆస్తులు ఉన్న వారిపై ఐటీ అధికారులు కన్నేస్తారు కాబట్టి మొదట్లో ఆస్తుల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ఆధార్‌‌ లింకింగ్‌‌ చట్టం వస్తే ఇళ్ల ధరలు సామాన్యుడికి కూడా అందుబాటులోకి వస్తాయని, అవినీతి తగ్గుతుందని ఎన్‌‌ఏఆర్‌‌ఈడీసీఓ మహారాష్ట్ర ప్రెసిడెంట్‌‌ రాజన్‌‌ బందేల్కర్‌‌ అన్నారు. బినామీ పేర్లతో ఆస్తులు కొన్నవారు వాటిని అమ్మేయడానికి పరుగులు తీస్తారని చెప్పారు. ‘‘ఈ చట్టం వస్తే పారదర్శకత పెరుగుతుంది కాబట్టి హోమ్‌‌లోన్లు, ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లు, అమ్మకాలు, కొనుగోళ్ల రూల్స్‌‌ మరింత ఈజీ అవుతాయి. అయితే ఆస్తికి ఆధార్‌‌ను జతచేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి యజమానులకు ప్రభుత్వం తగినంత గడువు ఇవ్వాలి’’ అని బందేల్కర్‌‌ అభిప్రాయపడ్డారు. రెసిడెన్షియల్‌‌ సెక్టార్‌‌లో ఇన్వెస్ట్‌‌మెంట్లు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని, దీనివల్ల మా ర్కెట్‌‌ మరింత ముందుకు వెళ్తుందని వివరించారు.

 

Latest Updates