మాండ్యాలో ఆరు రోజులుగా రైతుల జల దీక్ష

కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలో  రైతుల జల దీక్ష బుధవారానికి ఆరోరోజుకు చేరింది. కావేరీ, హిమవతి నదుల నీళ్లను తమ పంట కాలువల్లోకి వదలాలని రైతులు కొద్దిరోజులు డిమాండ్ చేస్తున్నారు. చేతికొచ్చిన పంట నాశనం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. పశువులు, జంతువులకు కూడా నీళ్లు ఇపుడు చాలా అవసరమని చెప్పారు.

“రిజర్వాయర్లలో నీటి లభ్యత తక్కువగానే ఉందని మాకు తెలుసు. కావేరీ రిజర్వాయర్ లో 80 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఈ టైమ్ లో సాధారణంగా నీళ్లు వదలరు. కానీ.. అత్యవసర పరిస్థితిగా పరిగణించి తమ కాలువల్లోకి నీళ్లు విడుదల చేయాలని కోరుతున్నాం. లేకపోతే.. మా ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తాం” అని రైతు సంఘం నాయకుడు దర్శన్ పుట్టనయ్య చెప్పారు.

కర్ణాటక సీఎం కుమారస్వామి ఇప్పటికే కేంద్రానికి లెటర్ రాశారు. కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఈ సమస్య త్వరగా పరిష్కరించేలా చూడాలని కోరారు. మరోవైపు.. తమిళనాడులోనూ తీవ్రమైన నీళ్ల కరువు ఉంది. మే 21న సమావేశమైన బోర్డు.. తమిళనాడుకు 9.19 టీఎంసీల నీటిని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీని తర్వాత.. కర్ణాటకలోనూ నిరసనలు మొదలయ్యాయి.