మామిడి రైతుకు ఎంత కష్టమొచ్చె..!

ప్రారంభించకుండానే వ్యాపారం
షెడ్లు, కనీస సౌలతులు కరువు
గడువు లోపూ పనులు పూర్తయ్యేట్టులేవు
పంటను కాపాడుకునే పరిస్థితీ లేదంటున్న రైతులు

హైదరాబాద్, వెలుగు: మామిడి రైతులకు ఈ సీజన్ పరీక్షగా మారింది. పంట సాగు ఒక ఎత్తయితే.. అమ్ముకోవడంమరింత కష్టంగా మారింది. ఏటా జగిత్యాల మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల రైతులుహైదరాబాద్లోని గడ్డిఅన్నారం ఫ్రూట్మార్కెట్ కు పంట తెచ్చేవాళ్లు. ఇటీవల మార్కెట్ ను రంగారెడ్డి జిల్లా కొహెడకు తరలించడంతో సమస్యలు మొదలయ్యాయి. కనీస సౌలతులు కూడా కల్పించకుండానే అక్కడ కొనుగోళ్లు స్టార్ చేశారు. షెడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంట్ రాదు. పంటను కాపాడుకునేందుకు రక్షణ చర్యలూ కరువవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ ను మార్చినట్లు జిల్లాల రైతులకూ సమాచారమూ లేకపోవడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అతిపెద్ద మార్కెట్లో నీళ్లకూ ఇబ్బందే..

కొహెడకు మార్కెట్ ను అయితే తరలించారుగానీ, సౌలతులు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ గా 178ఎకరాల్లో ఈ మార్కెట్ ను నిర్మిస్తున్నారు. మొత్తం నాలుగు షెడ్లకు ప్రస్తుతం 2 మాత్రమే పూర్తయ్యాయి . కరెంట్, మంచి నీటి సౌకర్యం పూర్తిస్థాయిలో కల్పించలేదు. టాయిలెట్స్ లేవు. ఈ నె ల 27 నుంచి డైలీ 400 – 800 లోడ్లు వస్తున్నాయి. మామిడిని చెట్టు నుంచి తెంపాక పండేంత వరకూ గాలి, నీరు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాంటి ఏర్పాట్లు కూడా చేయలేదు. దాంతో కాయ కరాబ్ అయ్యే ప్రమాదముందని రైతులు టెన్షన్ పడుతున్నారు. వర్షం పడితే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అధికారులు శానిటేషన్ కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవట్లేదు. మాస్కులు ఇవ్వడం లేదు. వచ్చే నెల 2న మార్కెట్ ఓపెన్ చేయనుండగా , అప్పటికీ ఏర్పాట్లు పూర్తయ్యే పరిస్థితి కనిపిచడం లేదు.

సడన్ గా తరలించాల్సి వచ్చింది

వచ్చే నెల 2న మార్కెట్ అధికారికంగా ఓపెన్ చేస్తం. రైతులు, వ్యాపారులకు ఇబ్బందుల్లేకుండా చూస్తం. కరోనా వల్ల సడన్ గా తరలించాల్సి వచ్చింది. రైతులకు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా భోజనాలు పెట్టిస్తు న్నం. మార్కెట్ స్టార్ట్ అయ్యాక బస్సులు ఏర్పాటు చేస్తం. – రాంనర్సింహగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్

పంట అమ్ముకోవడం చానా కష్టమైతుంది

మిర్యాలగూడ నుంచి మామిడి లోడ్ తీసుకొచ్చిన. ఇక్కడ కొనుగోళ్లు పూర్తిస్థాయిలో స్టార్ట్ కాలేదు. కనీస సౌకర్యాలు గూడ లేవ్. మంచి నీళ్లు దొరకతలేవ్. పంట అమ్మడం పెద్ద సమస్యగా మారింది. షెడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలె.

                                                                                 – నర్సిరెడ్డి, నల్లగొండ జిల్లా రైతు

Latest Updates