ఉద్యోగాల ఖాళీలు అర లక్ష.. సమస్యలు సవాలక్ష

ఉద్యోగాల భర్తీకి ఎన్నో అడ్డంకులు.. పట్టించుకోని రాష్ట్ర సర్కార్

డిపార్ట్​మెంట్లలో తేలని వేకెన్సీలు.. ముందుకు సాగని ప్రమోషన్లు

నోటిఫికేషన్ల రిలీజ్​పై నిరుద్యోగుల్లో అనుమానాలు

రాష్ట్రంలో అర లక్ష ఉద్యోగాల భర్తీకి సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర సర్కార్​ పరిష్కరించకపోవడం, అందుకోసం కనీసం చొరవ కూడా చూపకపోవడం నిరుద్యోగుల పాలిట శాపంగా తయారైంది. కొలిక్కిరాని ఖాళీలు.. ఎటూ తేలని ఉద్యోగుల సర్దుబాట్లు.. ఆలస్యమవుతున్న ప్రమోషన్లు.. పరిష్కారం కాని జోనల్​ వివాదం..  స్పష్టతలేని ఏజ్​ లిమిట్​ పెంపు.. ఇవన్నీ రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​కు అడ్డంకులుగా మారాయి. వీటికి తోడు డిపార్ట్​మెంట్ల వారీగా ఉన్న  సమస్యలు సవాల్​గా తయారయ్యాయి. అడ్డంకులన్నీ తొలిగిపోతేనే  రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​ సాఫీగా సాగుతుందని, లేకపోతే నోటిఫికేషన్లు వేయడం కూడా కష్టమేనని ఆఫీసర్లు అంటున్నారు.

హైదరాబాద్, వెలుగు: వెంటనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించి నెల దాటినా ఇంకా ఖాళీల గుర్తింపే పూర్తికాలేదు. ఖాళీలు తేలాలంటే.. ముందుగా ప్రమోషన్ల ప్రాసెస్​ పూర్తి చేయాల్సి ఉంటుందని, వీఆర్వో, వీఆర్ఏ లను సర్దుబాటు చేయాల్సి ఉంటుందని వారు చెప్తున్నారు. ఇవి పెద్ద సవాళ్లుగా మారాయని అంటున్నారు. మరోవైపు టీచర్ పోస్టుల భర్తీకి టెట్ వ్యవహారం తేలాల్సి ఉంది. ఉద్యోగ అర్హత వయసు పెంపుపై ఇప్పటికీ క్లారిటీ లేదు.

వీఆర్వో, వీఆర్ఏల సర్దుబాటు ఎట్ల?

ఈ మధ్యే  రెవెన్యూ శాఖలోని వీఆర్వో, వీఆర్ఏ  వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. నాలుగున్నర నెలలుగా వీఆర్వో, వీఆర్​ఏలకు ఎలాంటి పనులు చూపెట్టడం లేదు. తమను ఏదో ఒక శాఖలో మెర్జ్ చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే వివిధ శాఖల్లో ప్రమోషన్లతో ఏర్పడిన ఖాళీలను వారితో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం వీఆర్వోలు 5,200, వీఆర్​ఏ లు 22 వేలు మంది ఉన్నారు. వీరిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన తర్వాతే కొత్త ఉద్యోగాల భర్తీపై క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెప్తున్నారు. అందరినీ ఒకేసారి సర్దుబాటు చేయడం కష్టమని, భవిష్యత్ లో ఏర్పడే ఖాళీల మేరకు సర్దుబాటు చేస్తామని ఓ సీనియర్ ఆఫీసర్  చెప్పారు.

మెజార్టీ వీఆర్వోలు డిగ్రీ పూర్తి చేసి, 15 నుంచి 20 ఏండ్ల సర్వీస్​ కలిగి ఉన్నారు. వీరిలో చాలా మంది సీనియర్​ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్​ స్పెక్టర్​ ప్రమోషన్లకు అర్హులైనప్పటికీ.. వీరి ప్రమోషన్లను ప్రభుత్వం పక్కనపెట్టింది. రిటైర్​ అయినవారు పోనూ సుమారు 5 వేలకుపైగా ఉన్న వీఆర్వోలను వివిధ శాఖల్లో జూనియర్​ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లుగా అడ్జెస్ట్​ చేస్తే కానీ కొత్త కొలువులు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.

టెట్​ పెడ్తరా.. టీఆర్టీతోనే కలిపి నిర్వహిస్తరా?

రాష్ట్రంలో దాదాపు 15 వేల టీచర్ పోస్టుల ఖాళీలు ఉన్నట్టు ప్రభుత్వం లెక్క తీసింది. అయితే వాటిని భర్తీ చేయాలంటే ముందుగా టెట్ (టీచర్​ ఎలిజిబిలిటీ  టెస్ట్​) నిర్వహించాలి. కేంద్ర గైడ్​లైన్స్​ ప్రకారం టెట్ అర్హత సాధించిన వారే టీచర్  పోస్టుల(టీఆర్టీ–టీచర్​ రిక్రూట్​మెంట్​ టెస్ట్​)కు అర్హులు. అయితే రాష్ట్రంలో 2017 జూన్  తర్వాత ఇంతవరకూ టెట్ నిర్వహించలేదు. ఈ మధ్య కాలంలో డీఈడీ, బీఈడీ పూర్తి చేసినవారు చాలా మంది ఉన్నారు. వారి కోసమైనా మళ్లీ టెట్​ నిర్వహించాల్సి ఉంది. ఆరునెలలకోసారి నిర్వహించాల్సిన ఈ పరీక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. టెట్, టీఆర్టీ విడివిడిగా నిర్వహిస్తే టైం వేస్ట్​ అవుతుందని, కామన్ ఎగ్జామ్స్ పెడ్తే ఎట్లుంటుందనే  కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తోంది. గతంలో ఒకసారి టెట్  పాస్ అయితే ఏడేండ్ల పాటు టీచర్ పోస్టుల భర్తీ కోసం పోటీ పడొచ్చు. కానీ తాజాగా కేంద్రం.. ఒకసారి టెట్ పాస్ అయితే  దాని వ్యాలిడిటీ లైఫ్​టైమ్​ ఉంటుందని ప్రకటించింది. ఈ సడలింపు గతంలో టెట్ పాస్ అయిన వారికి వర్తిస్తుందా? కొత్తగా టెట్ పాస్ అయిన వారికి మాత్రమే వర్తిస్తుందా? అనే విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

టీచర్ల ప్రమోషన్లు చాలెంజ్

టీచర్ల ప్రమోషన్లపై డైలమా కొనసాగుతోంది.  నెలాఖరులోపు అన్ని డిపార్ట్​మెంట్లలో పదోన్నతులు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. కానీ స్కూల్​ ఎడ్యుకేషన్​లో మాత్రం సర్వీస్​ రూల్స్ అంశం ఇబ్బందికరంగా మారింది. ఏకీకృత సర్వీస్​రూల్స్​ అంశం కోర్టులో ఉండటం కారణమని ఆఫీసర్లు చెబుతున్నారు. చివరిసారిగా 2005లో ఎంఈవో స్థాయి వరకూ ప్రమోషన్లు ఇవ్వగా, 2015లో హెడ్మాస్టర్ల వరకూ మాత్రమే ప్రమోషన్లు ఇచ్చారు. ఈసారీ మేనేజ్‌‌‌‌మెంట్ల వారీగా స్కూల్​ అసిస్టెంట్, హెడ్మాస్టర్ పోస్టుల వరకే ప్రమోషన్లను పరిమితం చేయాలని సర్కారు భావిస్తోంది. ఎంఈవో, డైట్, బీఈడీ కాలేజీల్లో లెక్చరర్​ పోస్టుల జోలికి పోవద్దనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం అన్ని రకాల ప్రమోషన్లు ఇస్తే హెడ్మాస్టర్​ స్థాయి కంటే  పైపోస్టులన్నీ గవర్నమెంట్ టీచర్లకే ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఎక్కువ సంఖ్యలో ఉన్న లోకల్ బాడీ టీచర్ల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంలో సర్కారు ఆ పనిచేయకపోవచ్చని తెలుస్తోంది.

ప్రమోషన్ల ప్రాసెస్​ ఎప్పుడైతదో?

రెండేండ్లుగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు లేవు. దీనిపై ఉద్యోగులు పలుసార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రమోషన్లను పెండింగ్ లో పెట్టడం వల్ల ఇప్పుడు ఖాళీల గుర్తింపు ఆలస్యమవుతోంది. ఎప్పటికప్పుడు ప్రమోషన్లు ఇస్తే ఖాళీల సంఖ్య ఈజీగా తేలేది. ఈ నెల 31లోపు ప్రమోషన్లు పూర్తి చేయాలని అన్ని శాఖల సెక్రటరీలకు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు ఇచ్చినా ఆ గడువు లోపు పూర్తి చేయడం కష్టమనే చర్చ ఆఫీసర్ల మధ్య ఉంది.

జోనల్​ సమస్య అట్లనే ఉంది

జోన్, మల్టీ జోన్ పోస్టుల భర్తీకి కొత్త జోనల్ అంశం సవాల్​గా మారింది. సవరించిన జోనల్ కు ఇంకా రాష్ట్రపతి ఆమోదం రాలేదు. 2018 ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని 31 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజించి రాష్ట్రపతి ఆమోదం తీసుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి తొలగించి, చార్మినార్  జోన్ లో కలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట, ములుగు జిల్లాలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించలేదు. పాత జోన్ల మేరకు ఉద్యోగాలు భర్తీ చేస్తే ప్రధానంగా వికారాబాద్ జిల్లాకు చెందిన నిరుద్యోగుల నుంచి ఆందోళనలు వెల్లువెత్తే అవకాశం ఉంది.

ఏజ్​ లిమిట్​ పెంచుతరా? లేదా?

రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయసును 44 ఏండ్లకు పెంచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఎక్స్ సర్వీస్, ఎన్ సీసీ పర్సన్స్ కు మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్లు మినహాయింపు ఇస్తూ జీవో విడుదల చేశారు. ఆ జీవో కాలపరిమితి ఇప్పటికే ముగిసింది. దీంతో ఈ సారి ఏజ్​ లిమిట్​ పెంచుతరా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు.

టీచర్ల ప్రమోషన్లు చాలెంజ్

టీచర్ల ప్రమోషన్లపై డైలమా కొనసాగుతోంది. నెలాఖరులోపు అన్ని డిపార్ట్​మెంట్లలో ప్రమోషన్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. కానీ స్కూల్ ఎడ్యుకేషన్ లో సర్వీస్ రూల్స్ అంశం చాలెంజ్ గా మారింది. చివరిసారిగా 2005లో ఎంఈవో స్థాయి వరకూ ప్రమోషన్లు ఇవ్వగా, 2015లో హెడ్మాస్టర్ల వరకే ప్రమోషన్లు ఇచ్చారు. ఈసారి కూడా మేనేజ్మెంట్ల వారీగా స్కూల్ అసిస్టెంట్, హెడ్మాస్టర్ పోస్టుల వరకే ప్రమోషన్లను పరిమితం చేయాలని సర్కారు భావిస్తోంది. ఎంఈవో, డైట్, బీఈడీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల జోలికి పోవద్దనే ఆలోచనలో ఉంది. అయితే ప్రస్తుతం అన్ని రకాల ప్రమోషన్లు ఇస్తే హెడ్మాస్టర్ స్థాయికంటే పైపోస్టులన్నీ గవర్నమెంట్ టీచర్లకే ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఎక్కువ సంఖ్యలో ఉన్న లోకల్ బాడీ టీచర్ల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంలో సర్కారు ఆ పని చేయకపోవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు

ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో సర్కార్ పనితీరు బాగాలేదు

Latest Updates