సాహసించి.. సాధించినం

ఎన్నో పెండింగ్​ అంశాలను ఏడాదిలో తేల్చేసినం
ప్రధాని మోడీ‌‌‌‌‌‌‌‌-, అమిత్ ​షా చర్యల వల్లే విజయాలు


ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్డీయే–2 పాలన ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను అమలు చేయడంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలకపాత్ర వహించారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్​లో ఉన్న అనేక అంశాలను పరిష్కరించగలిగారు. రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా కీలక బిల్లులు ఆమోదించేలా అమిత్ షా చేసిన వ్యూహరచన సక్సెస్​ అయ్యింది. ట్రిపుల్​ తలాక్ చట్టంతో మొదలుపెడితే.. జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఆర్టికల్​370 రద్దు.. సిటిజన్​షిప్​ సవరణ చట్టం అమలు.. అయోధ్య వివాదానికి షరిష్కారం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు సాధించారు. ఇవి కాక సుపరిపాలన, శాంతిభద్రతల నియంత్రణ, అభివృద్ధికి సంబంధించి పలు చట్టాలు, సవరణలను ఆమోదించారు. ఏండ్ల తరబడి వాడుకలోలేని 58 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశారు. రామమందిర నిర్మాణానికి మార్గం వేసిన ఘనత అమిత్ షాకే దక్కుతుంది. కీలకమైన ఈ చట్టాల ఆమోదం, చారిత్రక ఘటనల సమయంలో నేను కూడా కేంద్ర హంశాఖ సహాయ మంత్రిగా పాలుపంచుకోవడం నా జీవితంలో మరపురాని ఘట్టం.

ఇంకా ఎన్నో కీలక బిల్లులు

ఇండియన్లు లేదా దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశాల్లో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపైనా విచారణ చేపట్టేందుకు విస్తృతాధికారాలను కట్టబెట్టేలా ప్రభుత్వం ‘నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ(అమెండ్​మెంట్) చట్టం చేసింది. సైబర్ ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ నోట్ల వ్యాప్తి, నిషేధిత ఆయుధాల తయారీ, వాటి అమ్మకం కేసులపై విచారించేందుకు కూడా ఈ సంస్థకు అధికారం ఉంటుంది. మెడిసిన్​లో ఒకేరకమైన విధానాల అమలు, ప్రైవేటు మెడికల్​ కాలేజీల్లో 50 శాతం సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) స్టూడెంట్లకు అందేలా ఇండియన్​ మెడికల్​ కౌన్సిల్(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎస్ఎంసీ) బిల్లుకు ఆమోదం మరో ముఖ్య చట్టం. లా అండ్​ ఆర్డర్ అదుపులో ఉండేలా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు నియంత్రించేలా ఆయుధాలు అక్రమ వాడకాన్ని తొలగించేలా ‘వెపన్స్​ బిల్లు–2019’ను సవరించారు. హ్యూమన్​ రైట్స్​ ను కాపాడేందుకు నేషనల్, స్టేట్​ కమిషన్లకు మరిన్ని పరిపాలన, ఆర్థిక అధికారాలను కల్పించేలా “హ్యూమర్​ రైట్స్​ ప్రొటెక్షన్​ బిల్లు–2019”ను సవరించారు.

తగ్గిన హింసాత్మక ఘటనలు

పాకిస్థాన్ లోని కర్తాపూర్ లో గురునానక్ దేవ్ సమాధి మందిరానికి వెళ్లేలా ఇండియా నుంచి రహదారిని నిర్మించేలా పాకిస్థాన్ తో ఒప్పందం చేసుకున్నాం. కర్తాపూర్ కారిడార్ ఏర్పాటుతో ఏడాది పొడవునా ఎలాంటి వీసా లేకుండా గురుద్వారాను దర్శించుకోవచ్చు. ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్, తప్పిపోయిన వ్యక్తుల శోధన, వాహన ఎన్​వోసికి సంబంధించిన Digital police citizen services.gov.in ద్వారా నేషనల్​ లెవల్ లో ఆన్​లైన్​సేవలు ప్రారంభించాం. ఎన్డీఆర్ఎఫ్ దళాలు గతేడాది జరిగిన వరద ప్రమాద ఘటనల్లో వివిధ రాష్ట్రాల్లోని 5,375 మందిని రక్షించారు. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో 42,000 మందినిపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బంది రిటైర్మెంట్​ వయసును 60 ఏండ్లకు పెంచడంతో 7 లక్షలకుపైగా సిబ్బందికి లబ్ధి చేకూరుతుంది. ప్రత్యేక భద్రతా చర్యల్లో భాగంగా లెఫ్ట్ వింగ్ ఎక్స్​ట్రీమిజం గణనీయంగా తగ్గింది. మరణాల సంఖ్య 2009లో 1,005 ఉంటే 2018లో 240 కి పడిపోయింది. నక్సల్స్ హింసతో బాధపడుతున్న జిల్లాలు 2010లో 96 ఉండగా 2018లో 60కి తగ్గాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ హింసాత్మక ఘటనలు బాగా తగ్గాయి. అస్సాంలో అక్రమ వలసదారులను గుర్తించేందుకు ‘‘నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్​ఆర్సీ)”ని రూపొందించాం. చట్టవిరుద్ధ వలసదారులను గుర్తించడం, బహిష్కరించడం కోసం తగిన యంత్రాంగం రూపొందించాం. త్రిపురలో హింసాత్మక ఘటనలు నిలిపివేసేలా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ట్విపాతో నిర్మాణాత్మక చర్చలు సక్సెస్​ అయ్యాయి. బోడో ప్రాంతాల అభివృద్ధికి మూడేండ్లలో ప్రత్యేక ప్యాకేజీ రూ.1,500 కోట్లతో నిర్దిష్ట ప్రాజెక్టులను చేపట్టడానికి కేంద్రం అంగీకరించింది.

కట్టుదిట్టంగా కరోనా కంట్రోల్

కరోనా వైరస్​ వ్యాప్తిని కంట్రోల్​ చేయడానికి దాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ ‘‘స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్” నిధులు రిలీజ్​ చేయించాం. వైరస్ ను కంట్రోల్​ చేసేందుకు ఫిజికల్​ డిస్టెన్స్​ పాటించేలా దేశవ్యాప్తంగా లాక్​ డౌన్ అమలు చేశాం. తబ్లిగి జమాత్​ కార్యక్రమంలో పాల్గొన్న 960 మంది ఫారినర్ల టూరిస్ట్​ వీసాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాం. వీసా ఆంక్షలు మే 22 నుంచి సడలించి విదేశాల్లో చిక్కుకున్న ఇండియన్లు వచ్చేలా అనుమతిచ్చాం. వలస కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఎస్‌టీఆర్ఎఫ్ నిధులు ఖర్చుచేసేలా రాష్ట్రాలకు అనుమతిచ్చాం. 14.3 లక్షల మంది వలస కూలీలకు ఆశ్రయం కల్పిస్తూ 37,000కుపైగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేశాం. బస్సుల్లో వలస కూలీల అంతర్రాష్ట్ర కదలికకు అనుమతిచ్చాం. మే 1 నుంచి 2,600 శ్రామిక్ రైళ్లలో 35 లక్షలకుపైగా వలస కూలీలను వారి ప్రాంతాలకు తరలించాం. జూన్ 1 నుంచి 200 రైళ్లు ప్రారంభం కానున్నాయి.

ట్రిపుల్ తలాక్ రద్దు

తక్షణ విడాకులిచ్చే ఇస్లాం సంప్రదాయ ట్రిపుల్ తలాక్​ను నేరంగా పరిగణించే ముస్లిం మహిళల(మ్యారేజ్​ రైట్స్ ప్రొటెక్షన్) బిల్లు–2019ను జులై 25న లోక్​సభ, 30న రాజ్యసభ ఆమోదించాయి. తలాక్ అనేది కాల దోషం పట్టిన మధ్యయుగం నాటి సంప్రదాయం. ట్రిపుల్ తలాక్ ను అడ్డుపెట్టుకుని చాలా మంది ముస్లిం మగాళ్లు తమ భార్యల అభిప్రాయంతో సంబంధం లేకుండా విడాకులు ఇస్తున్నారు. భార్యలను అనాగరికంగా వదిలించుకునే ఈ దురాచారాన్ని మోడీ ప్రభుత్వం కూల్చివేసింది. ఈ చట్టంతో ముస్లిం మహిళల కష్టాలు గట్టెక్కినట్లే. సమాజంలో సమానత్వ సాధనకు ఇది ఉపయోగపడుతుంది. ఈ చట్టం ప్రకారం.. తక్షణ విడాకులు కోరుతూ ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరం, చట్ట విరుద్ధం. ఆ నేరానికి పాల్పడే భర్తకు మూడేండ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. మరో ముఖ్యమైన చట్టం సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ బిల్లు–2019. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని మనదేశానికి శరణార్థులుగా వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, క్రైస్తవ, పార్శీలకు మన సిటిజన్​షిప్​ కల్పించేలా దీన్ని రూపొందించారు. ఈ బిల్లు ప్రకారం.. 2015 డిసెంబర్​కు ముందు ఐదేండ్లు దేశంలో ఉన్న శరణార్థులకు సిటిజన్​షిప్​ లభిస్తుంది.

ఆర్టికల్ 370 రద్దు

జమ్మూకాశ్మీర్‌‌‌‌కు స్పెషల్​ స్టేటస్​ కల్పించే ఆర్టికల్​ 370ని రద్దు చేసే తీర్మానాన్ని, జమ్మూకాశ్మీర్ రీఆర్గనైజేషన్​ బిల్లు–2019ను ఆగస్టు 6న పార్లమెంట్​ ఆమోదించింది. జమ్ముకాశ్మీర్ పై 70 ఏండ్లుగా ఏ రాజకీయ పార్టీ చేయని సాహసాన్ని మోడీ ప్రభుత్వం చేసింది. కృష్ణార్జునులుగా చెప్పుకునే మోడీ–అమిత్ షా.. ఆర్టికల్​ 370ని రద్దు చేసి కాశ్మీర్‌‌‌‌ను పూర్తిగా ఇండియాలో కలిపేశారు. 70 ఏండ్లుగా ఆర్టికల్​ 370 దేశం నెత్తిన ఒక కుంపటిలా తయారైంది. పాకిస్తాన్ పక్కలో బల్లెంలా మారి.. కాశ్మీర్ లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది. దీంతో వేల సంఖ్యలో జవాన్లు బలిదానాలు చేయాల్సి వచ్చింది. కాశ్మీర్‌‌‌‌ను ఇండియా నుంచి వేరు చేసేందుకు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలకు ముగింపు పలుకుతూ ‘ఒకే జెండా, ఒకే దేశం, ఒకే రాజ్యాంగం’ నినాదానికి అనుగుణంగా మోడీ సర్కార్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్స్​ 370, 35(ఎ) రద్దు నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్‌‌‌‌కు అన్యాయం జరిగిందని పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది. కానీ కాశ్మీర్ లో పరిస్థితులను ఎన్డీయే సర్కార్ ప్రపంచానికి చూపించడంతో ఇండియా చేసిన పని సరైనదే అని అమెరికా, చైనాల సహా ముస్లిం దేశాలు మద్దతిచ్చాయి. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ ను అసెంబ్లీ ఉన్న యూనియన్​ టెర్రిటరీగా, లడఖ్‌ను అసెంబ్లీ లేని యూటీగా రీఆర్గనైజ్​ చేశారు. ఇప్పుడు జమ్ముకాశ్మీర్ ప్రజలు ఇండియా సిటిజన్లుగా.. దేశంలో అమలవుతున్న అన్ని పథకాలు, రిజర్వేషన్లు పొందే హక్కులు కలిగిఉన్నారు.

మోడీ చొరవతో అయోధ్యపై తీర్పు

ఎన్నో ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని అయోధ్యపై తీర్పు ఎన్డీయే 2 మొదటి ఏడాదిలో వచ్చింది. ఏండ్ల తరబడి కోర్టుల్లో ఉన్న ఈ కేసును పరిష్కరించేందుకు కాంగ్రెస్ ముందుకు రాలేదు. కానీ, ప్రధాని మోడీ చొరవతో సుప్రీంకోర్టు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరిష్కరించింది. ఈ కేసు పరిష్కారం తర్వాత దేశంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా పరిస్థితిని చక్కదిద్దడటంతో అమిత్ షా తీసుకున్న చర్యలు అమోఘం. అయోధ్యలోని రామ జన్మభూమి–బాబ్రీ మసీదు భూయాజమాన్య వివాదంపై సుప్రీంకోర్టు నవంబర్​ 9న తుది తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని సుప్రీం తీర్పు ఇచ్చింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలోనే ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ఆదేశించింది. ఇప్పుడు రామజన్మభూమి ప్రాంతంలో హిందువుల మనోగతం మేరకు రామాలయ నిర్మాణం జరగనుంది.

     – జి.కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..

Latest Updates