ఇది మావోయిస్టుల కొత్త సేఫ్ జోన్

స్థానిక గిరిజనులతో నిఘా వ్యవస్థ  బలోపేతం
ఎంఎంసీ నిరంతర పర్యవేక్షణ
నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో న్యూబేస్ ఏరియా నిర్మాణం

భద్రాచలం, వెలుగుఅబూజ్‍మడ్.. దట్టమైన అడవులతో కూడిన ఈ ప్రాంతం ఇన్నాళ్లు మావోయిస్టులకు కంచుకోట. చత్తీస్‍గఢ్‍ రాష్ట్రంలోని బీజాపూర్‍, సుక్మా, నారాయణ్‍పూర్‍ జిల్లాల సరిహద్దుల్లో ఉండే నక్సల్స్ అగ్రనేతలకు, వారి వ్యూహరచనకు సేఫ్‍జోన్‍గా చెప్పుకునేవారు. కానీ కొన్నాళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్​ గ్రీన్‍హంట్‍, ఆపరేషన్ ప్రహార్‍ పేరిట మూకుమ్మడిగా అబూజ్‍మడ్ పై దండయాత్ర చేస్తున్నాయి. ఆ ప్రాంతం చుట్టూ  కేంద్ర పారామిలటరీ బలగాలతో బేస్​ క్యాంపులు వెలిశాయి. కేంద్ర హోంశాఖ ఏకంగా ఓ గోడ కట్టేసి అబూజ్ మడ్​నుంచి మావోయిస్టులు బయటకు వచ్చే మార్గాలను మూసివేసింది. నక్సల్స్ నిఘా వ్యవస్థను సైతం దెబ్బతీయడంతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్రనేతలను రక్షించుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేసుకునేందుకు వీలుగా సరికొత్త సేఫ్‍జోన్‍ను ఏర్పాటు చేసుకున్నారు. జార్ఖండ్‍, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‍ రాష్ట్రాల సరిహద్దుల్లోని అమరకంఠక్​ అడవుల్లో న్యూ బేస్‍ఏరియా నిర్మాణం చేపట్టారు. దక్షిణ అబూజ్‍మడ్​ తరహాలో ఉండే ఈ సేఫ్‍జోన్‍ను ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‍, చత్తీస్‍గఢ్‍(ఎంఎంసీ) కమిటీ పర్యవేక్షిస్తోంది.

పర్వతశ్రేణుల మధ్య నర్మదా నది తీరంలో..

నర్మదా తీరంలో వింధ్య, మైకల్‍, సత్పురా పర్వతశ్రేణుల మధ్య అమరకంఠక్ న్యూబేస్‍ ఏరియా ఉంది. మధ్యప్రదేశ్‍, చత్తీస్‍గఢ్‍ రాష్ట్రాల సరిహద్దుకు ఇది చేరువలోఉంటుంది. అమరకంఠ క్‍  అటవీ ప్రాంతం హిందూ దేవాలయాల సమూహం. తీర్థరాజ్‍(కింగ్‍ ఆఫ్​పిలిగ్రిమేజ్‍) పేరిట మధ్యప్రదేశ్‍, చత్తీస్‍గఢ్​ టూరిజం డిపార్ట్​మెంట్​దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సంకల్పిస్తోంది. కానీ గడిచిన ఐదేళ్లుగా అబూజ్‍మడ్ మార్గాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూసివేయడంతో  సరికొత్త సేఫ్‍జోన్‍ కోసం మావోయిస్టులు కొన్నేళ్లుగా అన్వేషిస్తున్నారు. చివరకు కన్హా టైగర్‍ రిజర్వ్ ప్రాంతంలో పుష్కలంగా తాగునీటి వనరులు, ఎత్తయిన వింధ్య, మైకల్‍, సత్పురా పర్వతశ్రేణులు అనువుగా ఉన్న ఈ అమరకంఠక్‍ అడవులను తమకు సేఫ్​ జోన్​గా ఎంచుకున్నారు. ఇప్పటికే స్థానిక  గిరిజనుల సాయంతో కొత్త సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకున్నట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు పసిగట్టాయి. ఇక్కడ  స్థానిక గిరిజనులపై అటవీశాఖ ఉద్యోగుల వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. వీటిని ఆసరాగా చేసుకునే నక్సల్స్ చకచకా పావులు కదిపినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి  2016లోనే మావోయిస్టులు అబూజ్​మడ్​చేజారితే సరికొత్త సేఫ్‍జోన్‍ అమరకంఠక్‍కు తరలివెళ్లాలని నిర్ణయించుకున్నారు. 2018లో పహాడ్‍సింగ్‍అనే మావోయిస్టు లీడర్ లొంగిపోయినపుడు పోలీసులు ఈ సమాచారాన్ని సేకరించారు. దీనికి తోడు డిసెంబరు 2019లో స్టేట్‍ఇంటెలిజెన్స్ బ్యూరో కొన్ని డాక్యుమెంట్లు సేకరించింది. ఇవి కూడా అమరకంఠక్ సేఫ్‍జోన్‍ నిర్మాణాన్ని ధ్రువీకరించాయి.  ఎంఎంసీ(మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‍, చత్తీస్‍గఢ్‍) కమిటీ  చీఫ్​ టెల్టుంబేడ్​ ఆధ్వర్యంలో అమరకంఠక్ సేఫ్‍జోన్​ను పర్యవేక్షిస్తోంది. ఈయనకు 12 మంది బాడీగార్డులు ఉన్నట్లు తెలుస్తోంది. టెల్టుంబేడ్​పై రూ.1.37 కోట్ల మేర రివార్డు ఉంది. ఈయన కోసం జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‍, చత్తీస్‍గఢ్​ పోలీసులు గాలిస్తున్నారని  చత్తీస్‍గఢ్‍ డీజీపీ (ఆపరేషన్స్) డీఎం అవస్థి చెబుతున్నారు. అమరకంఠక్​ సేఫ్‍జోన్‍లోకి మావోయిస్టు అగ్రనేతలు వెళ్లిపోయారనే సమాచారంతో మధ్యప్రదేశ్‍లోని ఈ సేఫ్ జోన్‍కు సమీపాన ఉండే రెండు జిల్లాలను అప్రమత్తం చేసినట్లు ఆయన అక్కడి మీడియాకు తెలిపారు.

సేఫ్ జోన్లే కీలకం

మావోయిస్టు పార్టీకి సేఫ్‍జోన్లే కీలకం. పీపుల్స్ వార్‍గా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍, తెలంగాణ ప్రాంతంలో మంచి పట్టు ఉండేది. పోలీసులు వ్యూహాత్మకంగా దాడులు చేసి ఉద్యమాన్ని అణచివేయడంతో గోదావరి దాటి బస్తర్‍అటవీ ప్రాంతాన్ని సేఫ్‍జోన్‍గా ఎంచుకున్నారు. గొత్తి, మురియా గిరిజనులతో సాన్నిహిత్యం ఏర్పరచుకుని బస్తర్‍ అబూజ్‍మడ్​ ప్రాంతాన్ని బలోపేతం చేసుకున్నారు. 1980వ సంవత్సరం నుంచి రెండు దశాబ్దాలపాటు తమ హవా కొనసాగించారు.  విప్లవ కారిడార్‍ రాష్ట్రాల్లో, నేపాల్‍ వరకు విస్తరించారు. 2005 నుంచి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీపై ఉక్కుపాదం మోపింది. బేస్​ క్యాంపులను అన్ని జిల్లాల చుట్టూ ఏర్పాటు చేసింది. లక్ష మందికి పైగా కేంద్ర పారామిలటరీ బలగాలు నక్సల్స్ అణచివేతలో పాల్గొంటున్నారు. బస్తర్‍ప్రాంతంలో ఒత్తిడి పెరిగినపుడు గోదావరి దాటి తెలంగాణ అడవుల్లోకి వచ్చేవారు. సేఫ్‍జోన్‍గా వినియోగించుకునేవారు. తాజాగా సరికొత్త సేఫ్‍జోన్‍గా అమరకంఠక్‍ న్యూ బేస్‍ ఏరియాను నిర్మించుకున్నారు. ఇక కేరళ, కర్నాటక, తమిళనాడుల్లోనూ ఎదురవుతున్న ప్రతిబంధకాల నుంచి బయటపడేందుకు, అగ్రనేతలు తలదాచుకునేందుకు డబ్ల్యూజీజడ్‍సీ(వెస్ట్రన్ గార్డ్ జోనల్  కమిటీ)ని ఏర్పాటు చేశారు. ఒకనాడు స్మగ్లర్​వీరప్పన్‍ రాజ్యంగా పేరొందిన సత్యమంగళం అటవీ ప్రాంతంలోనే ఈ జోన్‍ ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తమై ఈ పరిణామాలను విశ్లేషించుకుంటున్నాయి.

see also: మార్చి 31 వరకు కరోనా సెలవులు

ఒక్కొక్కరు ఆరుగుర్ని కనండి

Latest Updates