సముద్రంలో పచ్చ బంగారం

రథాన్‌‌లో వందలు, వేలు, ఒక్కోసారి లక్షల సంఖ్యలో జనాలు పాల్గొంటారు. పరుగులు తీసే క్రమంలో అలిసిపోయే వాళ్లకు మంచి నీళ్లు, ఎనర్జీ డ్రింకులు తప్పనిసరి.  సొంతంగా తెచ్చుకునేవాళ్లు కొందరైతే.. మిగతా వాళ్లకు సౌకర్యాలు కల్పించడం నిర్వాహకుల బాధ్యత. లండన్‌‌లో గతేడాది నిర్వహించిన మారథాన్‌‌ కోసం తొమ్మిదిన్నర లక్షల వాటర్‌‌ బాటిళ్లను నిర్వాహకులు అందించారు. ఈవెంట్‌‌ అయ్యాక రోడ్లన్నీ  ఖాళీ బాటిళ్లు, గ్లాసుల చెత్తతో నిండిపోయాయి. ప్లాస్టిక్‌‌ వేస్టేజ్‌‌ను రీసైక్లింగ్‌‌ చేయడం నిర్వాహకులకు తలకు మించిన భారం అయ్యింది.

అందుకే ఈ ఏడాది మారథాన్‌‌ కోసం ‘వాటర్ పాడ్స్‌‌’ ఆలోచన అమలు చేశారు. ఒక ప్రైవేట్‌‌ స్టార్టప్‌‌ సహకారంతో సముద్రపు నాచు నుంచి ఈ పాడ్స్‌‌ను తయారు చేశారు. రెండు లక్షల వాటర్‌‌ పాడ్‌‌లలో నీటిని, ఎనర్జీ డ్రింకులను నింపి మారథాన్‌‌లో పాల్గొన్నవాళ్లకు అందజేశారు. తద్వారా ప్లాస్టిక్‌‌ వేస్టేజ్‌‌ సమస్య కొంత మేర తగ్గింది. ఈ ఐడియా ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది.

మనం వాడుకోలేమా?

సముద్ర సంపద ఖనిజలవణాలుగానే కాదు.. నాచు రూపంలో కూడా దొరుకుతుంది. జపాన్‌‌, తైవాన్‌‌, ఇండోనేషియా.. తదితర దేశాల్లో సీవీడ్‌‌కు ఫుల్‌‌ గిరాకీ ఉంటోంది. నాచును ప్రాసెసింగ్‌‌ చేసి సేంద్రియ ఎరువుల తయారీకి వినియోగిస్తున్నారు. సీవీడ్‌‌ ముడిసరుకును ఆహార, ఔషధ, వస్త్ర, రసాయన పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు.  మన దేశపు తీర ప్రాంతం పొడవు ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు. తీరం పొడవునా టన్నుల కొద్దీ నాచు దొరుకుతుంది. కానీ, వినియోగం మాత్రం సరైన స్థాయిలో ఉండట్లేదు.  ప్లాస్టిక్‌‌ కారకాల వల్ల మన ఆరోగ్యానికి, సముద్ర వాతావరణానికి చేసే నష్టం గురించి తెలియంది కాదు. అలాంటప్పుడు సింగిల్‌‌ యూజ్‌‌ ప్లాస్టిక్‌‌ ప్రొడక్టులకు ప్రత్యామ్నాయంగా మారిన నాచును ఉపయోగించుకుంటే సమస్యల నుంచి బయటపడొచ్చు.

సాగు.. ఎరువు

కొన్ని ప్రాంతాల్లో రైతులు సీవీడ్‌‌తో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. మన దేశంలో ‘కప్పాప్‌‌హైకస్‌‌ సాప్‌‌’ అనే రకం నాచు రసాన్ని వరి, మినుము పంటలు ఏపుగా పెరిగేందుకు, పంట ఆరోగ్యంగా ఉండేందుకు చల్లుతున్నారు. సీవీడ్‌‌ ఎరువులకు మంచి గిరాకీ వస్తుండటంతో మత్స్యకారులు సముద్రపు నాచు సాగుపై ఆసక్తి పెంచుకుంటున్నారు. పశువులకు దాణాగా నాచుకు ప్రాధాన్యం ఇస్తే.. అవి విడుదల చేసే ‘మీథేన్‌‌’ స్థాయి తగ్గిపోతుంది. తద్వారా గ్లోబల్ వార్మింగ్ తగ్గుముఖం పడుతుంది.  సీవీడ్‌‌ ఫెర్టిలైజర్స్‌‌ వల్ల రానున్నరోజుల్లో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గుజరాత్‌‌ పొడవైన తీరప్రాంతం ఉన్న రాష్ట్రం.  దేశంలోనే సీవీడ్‌‌ మార్కెట్‌‌కి ఇప్పుడిది  అడ్డాగా మారింది. సీఎస్‌‌ఎంసీఆర్ఐ గతేడాది చివర్లో కొంత మంది రైతులకు నాచుతో ఫెర్టిలైజర్‌‌ తయారీలో శిక్షణ ఇచ్చింది. తీర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌‌, తమిళనాడులో ప్రభుత్వాలు మత్స్యకారులకు ప్రోత్సాహకాలు ఇచ్చి సాగు చేయిస్తున్నాయి. ముఖ్యంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండి చేపల వేటకు అవాంతరం ఎదురైనప్పుడు నాచుసాగు వాళ్లకు జీవనాధారంగా ఉంటోంది.  ఒక్కో పంటకు 45 రోజుల సమయం పడుతుంది. దీంతో తేలికగా రెండు పంటలను తీయగలుతున్నారు. గుజరాత్‌‌ మత్స్యకారులు ‘ గ్రేసీలేరియా దురా’ అనే సముద్రపునాచు రకం పెంపకం ద్వారా పంటకు లక్ష రూపాయలకు పైనే సంపాదిస్తున్నారు.

తీసిపారేయొద్దు

సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. నోట్లో స్ట్రా ఇరుక్కుని తాబేలు విలవిలలాడుతుంటే.. రెస్క్యూ టీం శ్రమించి ఎట్టకేలకు ఆ తాబేలును రక్షించింది.  సముద్ర చరాలు ప్లాస్టిక్‌‌ భూతంతో ఎదుర్కొంటున్న నరకానికి ఉదాహరణ ఆ వీడియో. కొబ్బరి బోండాం, జ్యూస్‌‌, కూల్‌‌డ్రింక్స్‌‌ల కోసం స్ట్రాను ఉపయోగిస్తుంటారు. వాడి పడేశాక అది చెత్తలో కలిసిపోతుందనుకుంటారు. ప్లాస్టిక్‌‌ బాటిళ్లు రీసైక్లింగ్‌‌ కోసం వాడతారు. కానీ, స్ట్రాలను పక్కనపడేస్తారు. ఆ చెత్తంతా చివరకు సముద్రంలోనే కలుస్తుంది.  ప్లాస్టిక్‌‌ ఉత్పత్తుల్లో స్ట్రా చిన్నదే కదా అనుకుంటాం. కానీ, అది సృష్టించే సమస్య ఊహకందని స్థాయిలో ఉంటుంది. ఈ సమస్యకు చెక్‌‌ పెట్టేందుకు కొన్ని కంపెనీలు సీవీడ్‌‌తో స్ట్రాలను తయారుచేస్తున్నాయి. ‘డిజైన్డ్‌‌ టూ డిసప్పియర్‌‌’ స్ట్రాలు ఇకో ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. ఇవి చూడటానికి ప్లాస్టిక్‌‌ స్ట్రాల మాదిరిగానే ఉంటాయి. వాడి పడేశాక అరవై రోజుల్లో మట్టిలో కలిసిపోతాయి. మన దేశంలో చాలా చోట్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌‌పై నిషేధం ఉండటంతో పేపర్‌‌ స్ట్రా వాడకం ఎక్కువగా కనిపిస్తోంది. కానీ, అడవులకు నష్టం వాటిల్లకుండా సీవీడ్‌‌ స్ట్రాలు ఉపయోగించడం ఇంకా బెటర్‌‌ ఆప్షన్‌‌ ఏమో కదా!.

యమ్మీ.. పాకురు

సముద్రపు నాచే కదా.. అని తక్కువ అంచనా వేయకండి. దీంట్లో పోషక విలువలు బోలెడు ఉంటాయి. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్స్‌‌, మినరల్స్‌‌, విటమిన్లు ‘ఎ, బి, సి, ఇ’ పుష్కలంగా లభిస్తాయి. అందుకే నాచుతో రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. పైగా ఆ ఫుడ్‌‌ ఆరోగ్యానికి మంచిది కూడా.  గార్నిష్‌‌గా అయినా తీసుకున్న పోషక విలువలు అందుతాయి.
శాకాహారులకు, వెగాన్లకు సీవీడ్‌‌ బెస్ట్ చాయిస్‌‌. నైరుతి ఆసియా దేశాల్లో ఇప్పటికే సీవీడ్‌‌ ఫుడ్‌‌ కల్చర్‌‌ విస్తారంగా ఉంది.

సౌందర్య సాధనం

సీవీడ్ పచ్చిగా ఉంటే ఒక కేజీకి నాలుగైదు రూపాయలకు అమ్ముడుపోతుంది. ఎండిన సీవీడ్‌‌ కేజీ నలభై నుంచి యాభై రూపాయల ధర ఉంటుంది. పిల్లలు తినే స్నాక్స్‌‌ దగ్గరి నుంచి మందుల తయారీలోనూ సీవీడ్‌‌ను వాడొచ్చు. బ్యూటీ ప్రొడక్టుల తయారీ, మసాజ్‌‌లోనూ సముద్రపు నాచును ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా సమ్మర్‌‌లో సీవీడ్‌‌ ఉత్పత్తులు ఎక్కువగా ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రేమతో ప్యాకింగ్‌‌..

ఫుడ్‌‌ ప్యాకింగ్‌‌లో నాచును ఉపయోగించే సాంకేతికత ఇప్పుడు అందుబాటులో ఉంది.  ఇన్‌‌స్టంట్ నూడుల్స్‌‌, బర్గర్‌‌ల చుట్టూ ర్యాపర్లు, టీ, కాఫీ, షుగర్‌‌ బ్యాగుల స్థానంలో సీవీడ్‌‌తో తయారుచేసిన బ్యాగులను వాడుతున్నారు. టూత్‌‌ పిక్‌‌ మొదలు శానిటరీ న్యాప్‌‌కిన్‌‌ల దాకా అన్ని వస్తువులు సముద్రపు నాచుతోనే తయారుచేస్తున్నారు. ప్రపంచంలో సీవీడ్‌‌ను ఎక్కువగా వినియోగిస్తున్న దేశంగా ఇండోనేషియా నిలిచింది.

 

Latest Updates