టెన్నిస్‌కు షరపోవా గుడ్‌‌బై

భుజం గాయమే ప్రధాన కారణం
కెరీర్‌‌లో ఐదు గ్రాండ్‌ స్లామ్ టైటిల్స్‌

పారిస్‌: ఓవైపు అందం.. మరోవైపు ఆటతో.. టెన్నిస్‌ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రష్యా స్టార్‌ ప్లేయర్‌ మరియా షరపోవా ఆటకు వీడ్కోలు పలికింది. ‘టెన్నిస్‌ .. ఐయామ్‌ సేయింగ్‌ గుడ్‌ బై’ అంటూ బుధవారం జరిగిన వోగ్‌ అండ్‌ వానిటి ఫెయిర్‌ మ్యాగజైన్‌ పేజీలో మరియా రాసుకొచ్చింది. ‘28 ఏళ్లు.. ఐదు గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ తర్వాత నేను కొత్త అడుగు వేయబోతున్నా’ అని షరపోవా తన రిటైర్మెంట్‌ సందర్భంగా వ్యాఖ్యానించింది. 2004లో 17 ఏళ్లకే వింబుల్డన్‌ టైటిల్‌‌ గెలిచిన మూడో యంగెస్ట్‌‌ ప్లేయర్‌‌గా రికార్డు సృష్టించిన షరపోవా.. టెన్నిస్‌‌లో తనకంటూ స్పెషల్‌‌ ఇమేజ్‌‌ను ఏర్పర్చుకుంది. 2001లో ప్రొఫెషనల్‌‌ కెరీర్‌‌ను మొదలుపెట్టిన ఈ రష్యన్‌ .. 19 ఏళ్ల కెరీర్‌‌లో ఎన్నో టైటిల్స్‌‌ను సొంతం చేసుకుంది. అయితే సుదీర్ఘకాలంగా భుజం గాయంతో ఇబ్బందిపడుతున్న షరపోవా.. గతేడాది పెద్దగా టోర్నీలు కూడా ఆడలేదు. దీంతో ఒకప్పుడు డబ్ల్యూటీఏలో నంబర్‌ వన్‌ ర్యాంక్‌‌ను సొంతం చేసుకున్న ఆమె.. ప్రస్తుతం 373 ర్యాంక్‌కు దిగజారింది. లాస్ట్‌‌ ఇయర్‌ వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌‌లో తొలిరౌండ్‌‌లోనే వెనుదిరిగిన షరపోవా రీసెంట్‌‌గా జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ నిరాశపర్చింది. 2005లో నంబర్‌ వన్‌ ర్యాంక్‌‌ను సొంతం చేసుకున్న షరపోవా.. తర్వాతి ఏడాది యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌‌ను గెలిచింది.

2007లో గాయం
2006లో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌‌తో టెన్నిస్‌‌లో ఓ సంచలనంగా మారిన షరపోవాకు 2007లో భుజం గాయం ప్రతికూలంగా మారింది. సూపర్‌ ఫామ్‌‌లో ఉన్న ఆమె 2008లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచినా .. గాయంతో సీజన్‌ రెండో హాఫ్‌‌కు దూరమైంది. దీంతో యూఎస్‌ ఓపెన్‌‌తో పాటు బీజింగ్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనలేదు. 2009–10లో భుజానికి ఆపరేషన్‌ చేయించుకుంది. రిహాబిలిటేషన్‌ తర్వాత కమ్‌ బ్యాక్‌ అంత సులువుగా జరగలేదు. ఫామ్‌ లేమితో ఇబ్బందిపడినా.. పోరాటాన్ని ఆపకుండా ఒక్కో అవరోధాన్ని జయించింది. దీంతో 2012లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌‌ సాధించిన షరపోవా.. కెరీర్‌ గ్రాండ్‌ స్లామ్‌ పూర్తి చేసిన పదో వుమెన్‌ ప్లేయర్‌‌గా రికార్డులకెక్కింది. అదే ఏడాది లండన్‌ ఒలింపిక్స్‌‌లో సిల్వర్‌ మెడల్‌‌ సాధించడంతో మళ్లీ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ దక్కింది. 2013లో భుజం గాయం మళ్లీ తిరగబెట్టినా .. రకరకాల చికిత్సల తర్వాత కాస్త కోలుకుంది. ఫలితంగా 2014లో రెండోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌‌ను గెలిచింది. అదే జోరుతో 2015లో నాలుగోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లోకి వెళ్లినా .. రన్నరప్‌‌తో సరిపెట్టుకుంది.

15 నెలల నిషేధం
2016లో ముంజేతి గాయంతో ఇబ్బందిపడిన షరపోవాకు డ్రగ్స్‌ రూపంలో అతిపెద్ద దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సందర్భంగా నిర్వహించిన డోప్‌ పరీక్షలో షరపోవా.. నిషేధిత డ్రగ్‌ ‘మెల్డోని యమ్‌ ’ తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రొవిజనల్ సస్పెన్షన్​ ఎదుర్కొన్న ఆమెపై జూన్‌ 8న రెండేళ్ల నిషేధాన్ని విధిస్తూ ఐటీఎఫ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తర్వాతి కాలంలో రష్యన్‌ స్పోర్ట్స్‌ మినిస్టర్‌ ఇందులో జోక్యం చేసుకోవడంతో బ్యాన్‌‌ను 15 నెలలకు కుదించారు. జనవరి 26,2016 నుంచే దీనిని అమలు చేయడంతో టెన్నిస్‌ స్టార్‌‌కు కాస్త ఉపశమనం లభించింది. 2017 ఏప్రిల్‌లో డబ్ల్యూటీఏ టూర్‌‌తో రీ ఎంట్రీ ఇచ్చిన షరపోవా అనుకున్న స్థా యిలో రాణించలేకపోయింది. 2018లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో‌కి చేరడంతో మళ్లీ గాడిలో పడిందనుకున్నా.. వరుస గాయాల కారణంగా గతేడాది పెద్దగా ఆడలేదు. దీంతో కెరీర్‌‌ను కొనసాగించడం కష్టంగా మారడంతో 32 ఏళ్ల వయసులో రిటైర్మెంట్‌‌కు మొగ్గు చూపింది. మొత్తం కెరీర్‌‌లో 800 మ్యాచ్‌లు ఆడిన షరపోవా.. ఆస్ట్రేలియన్‌, యూఎస్‌ ఓపెన్‌‌లో డబుల్స్‌ రన్నరప్‌‌గా కూడా నిలిచింది.

కెరీర్‌‌లో నేను ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదు. అలాగని ఎప్పుడూ ఎదురుచూడలేదు. ఇదే నా విజయ రహస్యం. ఆటలో నైపుణ్యం సాధిస్తే మరింత ఉన్నత శిఖరాలకు చేరగలనని నమ్మా. అదే నిజమైంది – షరపోవా

For More News..

ఒకటి కాదు.. రెండు కాదు.. ఆ ఊళ్లో 400 జతల కవలలు

వాషింగ్టన్‌లో ల్యాండవ్వగానే భారత టూర్‌పై ట్రంప్ ట్వీట్

మంగమ్మా.. ఏందమ్మా మీ సమస్య? కలెక్టర్‌నంటూ పరిచయం చేసుకొని..

ఇంటర్​ మెమోలో కీలక మార్పులు

Latest Updates