స్మార్ట్‌‌ఫోన్‌‌ మాత్రం నిలబడింది బాస్‌‌..

ఆటో, ఎఫ్‌‌ఎంసీజీ,  రియాల్టీ.. ఇలా చాలా రంగాలు అమ్మకాలు లేక డీలా పడుతున్నా, స్మార్ట్‌‌ఫోన్‌‌ మార్కెట్‌‌ మాత్రం దూసుకుపోతోంది. ఈ ఏడాది రెండో క్వార్టర్‌‌లో కంపెనీలు 3.69 కోట్ల స్మార్ట్‌‌ఫోన్లను షిప్‌‌ చేశాయి. గత ఏడాది క్యూ2తో పోలిస్తే 9.9 శాతం, గత క్వార్టర్‌‌తో పోలిస్తే 14.8 శాతం పెరుగుదల కనిపించింది. స్మార్ట్‌‌ఫోన్‌‌ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడటం, ఫీచర్ల ఫోన్‌‌ యూజర్లు స్మార్ట్‌‌ఫోన్‌‌పై ఆసక్తి చూపించడం, డిస్కౌంట్లు.. వంటివి స్మార్ట్‌‌ఫోన్ల వాడకం పెరగడానికి కారణాలని కంపెనీలు చెబుతున్నాయి.

మారుతీ సుజుకీ కారు ధర దాదాపు రూ.ఐదు లక్షలు ఉంటుంది. పార్లే బిస్కెట్‌‌ ప్యాకెట్‌‌ ధర రూ.ఐదు ఉంటుంది. అటు రూ.ఐదు లక్షల కార్లూ అమ్ముడుపోవడం లేదు. ఇటు ఐదు రూపాయల బిస్కెట్‌‌ ప్యాకెట్‌‌కూ డిమాండ్‌‌ లేని పరిస్థితి ఏర్పడింది. స్మార్ట్‌‌ఫోన్లు మాత్రం హాట్‌‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వినియోగదారులు తమ జీవితంలో ఫోన్‌‌ను అత్యంత ముఖ్యమైన వస్తువుగా భావించడమే ఇందుకు కారణమని స్టడీలు చెబుతున్నాయి. మనదేశంలో ప్రస్తుతం ఆటో, ఎఫ్‌‌ఎంసీజీ,  రియాల్టీ.. ఇలా చాలా రంగాలు అమ్మకాలు లేక డీలా పడ్డాయి.

స్మార్ట్‌‌ఫోన్‌‌ మార్కెట్‌‌ మాత్రం తగ్గడం లేదు. ఏప్రిల్‌‌–జూన్‌‌ క్వార్టర్‌‌లో మిగతా రంగాల్లో అమ్మకాలు బాగా తగ్గగా, స్మార్ట్‌‌ఫోన్‌‌ షిప్‌‌మెంట్లు మాత్రం పదిశాతం పెరిగాయి. పండగ సమయం కాబట్టి సెప్టెంబరు క్వార్టర్‌‌లో వీటి సేల్స్‌‌ మరింత పెరుగుతాయని రిపోర్టులు చెబుతున్నాయి. జూన్‌‌ క్వార్టర్‌‌లో కంపెనీలు 3.69 కోట్ల స్మార్ట్‌‌ఫోన్లను షిప్‌‌ చేశాయి. గత ఏడాది క్యూ2తో పోలిస్తే 9.9 శాతం, గత క్వార్టర్‌‌తో పోలిస్తే 14.8 శాతం పెరుగుదల కనిపించిందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్‌‌ (ఐడీసీ) తెలిపింది. చైనా స్మార్ట్‌‌ఫోన్‌‌ మేకర్‌‌ షావోమీ షిప్‌‌మెంట్లు వార్షికంగా 4.8 శాతం, దక్షిణ కొరియా కంపెనీ శామ్‌‌సంగ్‌‌ షిప్‌‌మెంట్లు 16.6 శాతం పెరిగాయి. తక్కువ, మధ్యస్థాయి స్మార్ట్‌‌ఫోన్లకు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం.  ఆన్‌‌లైన్‌‌ సేల్స్‌‌  గత 12 నెలల్లో 12.4 శాతం పెరిగాయి. మొత్తం అమ్మకాల్లో ఆన్‌‌లైన్‌‌ వాటా 36.8 శాతం.

పండగలపై ఎన్నో ఆశలు..

జూన్‌‌ క్వార్టర్‌‌లో అద్భుత ఫలితాలు సాధించామని, సెప్టెంబరులో అమ్మకాలను మరింత పెంచుకుంటామని శామ్‌‌సంగ్‌‌ మొబైల్‌‌ బిజినెస్‌‌ విభాగం సీనియర్‌‌ ఆఫీసర్‌‌ రంజివిత్‌‌ సింగ్‌‌ అన్నారు. ఆర్థికమాంద్యం ప్రభావం తమ కంపెనీపై లేదన్నారు. స్మార్ట్‌‌ఫోన్‌‌ పనిచేయకుంటే, కొత్తది కొనడం మినహా వేరే మార్గం లేదని షావోమీకి చెందిన రఘురెడ్డి అన్నారు.   ఫీచర్‌‌ ఫోన్‌‌ వాడేవారిలో ఎక్కువ మంది స్మార్ట్‌‌ఫోన్‌‌పై ఆసక్తి చూపుతుండడంతో వీటి అమ్మకాలు నానాటికీ పెరుగుతున్నాయి గత జూన్‌‌ క్వార్టర్‌‌లో ఫీచర్‌‌ ఫోన్‌‌ షిప్‌‌మెంట్లు 3.24 కోట్లు కాగా, ఈ ఏడాది జూన్‌‌ క్వార్టర్‌‌లో వీటి సంఖ్య 2.63 కోట్లకు పడిపోయింది.

ఒక రోజులో చాలా సమయం స్మార్ట్‌‌ఫోన్‌‌పై గడుపుతారు కాబట్టి దీనికోసం ఖర్చు చేయడానికి ప్రజలు వెనుకాడటం లేదని కౌంటర్‌‌పాయింట్‌‌ రీసెర్చ్‌‌కు చెందిన తరుణ్‌‌ పాఠక్‌‌ అన్నారు. మరో విశేషం ఏమిటంటే ప్రీమియం ఫోన్లు మిగతా అన్ని ఫోన్ల కంటే ఎక్కువ అమ్ముడవుతున్నాయి! మొబైల్‌‌ మార్కెట్‌‌ సగటు అమ్మకం ధర జూన్‌‌ క్వార్టర్‌‌లో దాదాపు రూ.11,400 (159 డాలర్లు). 200–300 డాలర్ల మధ్య ధర ఉన్న స్మార్ట్‌‌ఫోన్లకు డిమాండ్‌‌ వేగంగా పెరుగుతోంది. వచ్చే నెల నుంచి మరిన్ని ప్రీమియం స్మార్ట్‌‌ఫోన్‌‌ మోడల్స్‌‌ విడుదలవుతాయి కాబట్టి ఈ సెగ్మెంట్‌‌ అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా. షావోమీ వంటి బ్రాండ్లు గతంలో ఆన్‌‌లైన్‌‌లో మాత్రమే స్మార్ట్‌‌ఫోన్లను అమ్మగా, ఇప్పుడు ఆఫ్‌‌లైన్‌‌ బాట పట్టాయి. దీనివల్ల స్మార్ట్‌‌ఫోన్ల వాడకం మరింత ఎక్కువకానుంది.

Latest Updates