మిగిలిన వంటలతో పెళ్లి విందు

  • వేస్ట్​ఫుడ్డుతో తాజా వంటకాలు చేయించిన జంట
  • అతిథులు తిన్న తర్వాతగానీ చెప్పని పెళ్లికూతురు
  • వాంతులు చేసుకున్నంత పనిచేసిన బంధువులు, స్నేహితులు
  • ఫుడ్డును పడేయొద్దన్న మంచి కారణంతోనే చేశానన్న వధువు

అంగరంగవైభవంగా పెళ్లి వేడుక జరుగుతోంది. వచ్చిన అతిథుల కోసం అన్ని రకాల వంటలూ సిద్ధమయ్యాయి. టేబుళ్లమీద చేపలు, మటన్​, చికెన్​, పోర్క్​, బీఫ్​ , వెజ్​.. అబ్బో ఒక్కటేమిటి అన్ని రకాల వంటకాలను రెడీ చేసి పెట్టారు. అతిథులు ఆవురావురంటూ తినేశారు. కానీ, అక్కడే ఓ ట్విస్ట్​ ఉంది. ఏంటది?

మామూలుగా మనం ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్డును ఏం చేస్తాం? తెల్లారి బాగుంటే టిఫిన్​గా లాగించేస్తాం. లేదంటే పడేస్తుంటాం. ఊళ్లలో అయితే పశువుల కుడితిలో వేస్తుంటాం. కానీ, బ్రిటన్​కు చెందిన జో టిల్​స్టన్​(34) కొంచెం డిఫరెంట్​గా ఆలోచించారు. తన బాయ్​ఫ్రెండ్​ కేలీ (35)ని పెళ్లి చేసుకున్న ఆమె, ‘మిగిలిపోయిన ఆహారం’తో ఆ వంటల్ని చేయించింది. 280 మంది గెస్టులు ఆ తిండి తిన్న తర్వాతగానీ టిల్​స్టన్​ అసలు విషయాన్ని చెప్పలేదు. ఆమె అలా చెప్పిందో లేదో అందరూ కంగు తిన్నారు. వాంతులు చేసుకున్నంత పనిచేశారు. టిల్​స్టన్​ మాత్రం తాను చేసిన పనిని సమర్థించుకుంది. ఆహార వృథాను తగ్గించడం కోసమే తాను ఈ పని చేశానంటోంది. ‘‘మిగిలిపోయిన ఆహారాన్ని పడేయడం కన్నా దానిని మళ్లీ ఎలా వాడుకోవాలో కొత్తగా ఆలోచిస్తే ఆహారం వృథా కాదు. అందుకే మేం ఇలా చేశాం” అని చెప్పింది. ప్రపంచంలో చాలా మంది తిండి దొరక్క అల్లాడుతున్నారని, వాళ్ల కడుపులు నింపడానికి మన ఆలోచనలకు విలువలు తోడైతే సమస్య తీరుతుందని చెప్పింది. సగటున ఒక వ్యక్తి భోజనానికి 25 పౌండ్లు (సుమారు ₹2156) ఖర్చవుతుందని, కాబట్టి 300 మందికి విందు ఇవ్వడానికి ఈ ఆలోచన చేశామని తెలిపింది. ఫుడ్డు ఒక్కటే కాదు, పెళ్లి వేడుకలో అలంకరణకూ రీసైకిల్​ చేసిన వాటినే తిరిగి వాడుకున్నారు. టిన్​స్టన్​ తన తలకు వాడి పారేసిన పూలతోనే ఓ కిరీటం చేయించుకుంది. అంతేకాదు, తన పెళ్లి డ్రెస్సును భవిష్యత్తులో మళ్లీ వాడుకునేలా రీసైకిల్​ చేయించేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త దంపతులు ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఇలాగే చేశారు.

రియల్​ జంక్​ ఫుడ్​ ప్రాజెక్ట్​

టిల్​స్టన్​ పెళ్లికి ‘మిగిలిపోయిన విందు’ను ద రియల్​ జంక్​ ఫుడ్​ ప్రాజెక్ట్​ సరఫరా చేసింది. వేస్ట్​ ఫుడ్డు కోసం ప్రత్యేకంగా కేఫెలను పెట్టింది. ఎవరైనా తమ ఇంట్లో మిగిలిన ఫుడ్డును ఆ కంపెనీకి తెచ్చి ఇవ్వొచ్చు. దాంతోనే ఫ్రెష్​గా మళ్లీ వంట చేస్తారు. ఆకలికి అల్లాడేవాళ్లు, లేదా ఎవరైనా సరే ఎంతో కొంత ఇచ్చి ఆ వేస్ట్​ ఫుడ్డును తీసుకెళ్లేలా అవకాశం ఇస్తోంది. లేనోళ్లకు ఫ్రీగా ఇస్తోంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకైతే డబ్బును చాలా వరకు ఆదా చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఒక్కో మనిషికి 25 పౌండ్లు ఖర్చయ్యే దగ్గర కేవలం 5 పౌండ్లు (సుమారు ₹430) ఖర్చవుతుందని వివరించింది. ప్రస్తుతం ఆ కంపెనీకి మాంచెస్టర్​, విగాన్​, లీడ్స్​లో కేఫెలున్నాయి. ఆ కేఫెలన్నీ ఇలాంటి కేటరింగ్​లు చేస్తున్నాయి. 2013లో ఈ సంస్థ మొదలైంది. ఇదొక్కటే కాదు, దేశంలో వేస్ట్​ఫుడ్డును తిరిగి వాడుకునేందుకు ఇలాంటి కేఫెలు బ్రిటన్​లో చాలానే ఉన్నాయి. ఆక్స్​ఫర్డ్​ ఫుడ్​ బ్యాంకు అందులో ఒకటి. గత ఏడాది అక్టోబర్​లో ఓ జంట ఈ ఫుడ్​ బ్యాంకు నుంచి మిగిలిన ఆహార పదార్థాలతోనే పెళ్లి కేకు, ఫుడ్డును తయారు చేయించింది. వాల్తామ్​స్టోలోని ఎగ్స్​ అండ్​ బ్రెడ్​ అనే ఎన్జీవో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తోంది. ఓ వ్యక్తి ట్విట్టర్​లో దీని గురించి పోస్ట్​ చేయడంతో అది వైరల్​ అయింది. చాలా మంది ఆ కంపెనీ బాటలో నడుస్తున్నారు. లీడ్స్​లోని టోస్ట్​లవ్​ కాఫీ అనే సంస్థ, స్థానికంగా ఉన్న షాపుల నుంచి వేస్ట్​గా పడేసే సరుకులను సేకరించి ఫుడ్డు తయారు చేయిస్తోంది. లండన్​లోని బ్రిక్స్​టన్​ పౌండ్​ కేఫె, శాకాహారం, వీగన్​ ఫుడ్డును అందిస్తోంది. 2018లో ఆ సంస్థ దాదాపు 3.2 టన్నుల ఆహార వృథాను ఆపగలిగింది.

Latest Updates